
కేంద్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన పలు ఆదేశాలపై ట్విట్టర్ కోర్టుకెక్కింది. కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కొన్ని రాజకీయ పార్టీలు పోస్ట్ చేసే కంటెంట్‌ను బ్లాక్ చేయాలని కేంద్ర సర్కారు కోరుతోందని పిటిషన్ లో ట్విట్టర్ పేర్కొంది. భారత సర్కారు సూచించిన విధంగా రాజకీయ పార్టీల కంటెంట్‌ను ఏకపక్షంగా బ్లాక్ చేస్తే భావ ప్రకటన స్వేచ్ఛకు విఘాతం కలిగించినట్లు అవుతుందని కోర్టుకు తెలిపింది.
అభ్యంతరకరంగా ఉన్న కంటెంట్ ను..
వాస్తవికంగానే అభ్యంతరకరంగా ఉన్న కంటెంట్ ను తమ ప్లాట్ ఫామ్ నుంచి తొలగించేందుకు చర్యలు తీసుకున్నామని, ఈవిషయంలో సంబంధిత ప్రభుత్వ సంస్థలకు సహకారాన్ని కూడా అందించామని ట్విట్టర్ కోర్టుకు నివేదించింది. ప్రభుత్వ సంస్థలతో సమన్వయం చేసుకొని పనిచేయడానికి గ్రీవెన్స్ అండ్ కాంప్లయన్స్ ఆఫీసర్ల నియామకాన్ని కూడా తప్పనిసరి చేశామని స్పష్టం చేసింది. దేశ రాజధాని ఢిల్లీలో పెద్దఎత్తున జరిగిన రైతు ఉద్యమం, కొవిడ్పై వందతులతో ముడిపడిన ట్విట్టర్ ఖాతాలను, కంటెంట్ ను బ్లాక్ చేయాలని కేంద్రం తమకు నిర్దేశించిందని పిటిషన్ లో ట్విట్టర్ వివరించింది. ఈమేరకు కేంద్రం జారీ చేసిన ఆదేశాలపై న్యాయ సమీక్ష( జ్యుడీషియల్ రివ్యూ) చేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేసింది.
సోషల్ మీడియా జవాబుదారీగా ఉండాల్సిందే : కేంద్ర ఐటీ మంత్రి
ట్విటర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన నేపథ్యంలో కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందించారు. ‘‘సోషల్ మీడియా వ్యాప్తి విస్తృతంగా జరుగుతోంది. దాన్ని జవాబుదారీగా చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ నిబంధనలకు అది కట్టుబడి ఉండాల్సిందే. ఈక్రమంలో ఏవైనా చట్టపరమైన మార్పులు అవసరమైతే చేయడానికి సిద్ధమే. ఏ రంగంలోని కంపెనీ అయినా దేశ చట్టాలకు అనుగుణంగా నడుచుకోవాల్సిందే” అని మంత్రి వ్యాఖ్యానించారు. అభ్యంతరకరమైన ట్విట్టర్ పోస్టులను, ఖాతాలను జులై 4కల్లా తొలగించాలంటూ ట్విట్టర్‌కు కేంద్ర ఐటీశాఖ నిర్దేశించింది. దీనికి సంబంధించిన నోటీసులను జూన్ 6, 9, 27 తేదీల్లో కేంద్రం పంపింది. వీటిపైనే ప్రస్తుతం ట్విట్టర్ న్యాయ సమీక్షను కోరుతోంది.