సాఫ్ట్ వేర్ ఆఫీసులో హత్య.. లైట్ల విషయంలో మేనేజర్‎ను డంబెల్ తో కొట్టి చంపిన టెకీ

సాఫ్ట్ వేర్ ఆఫీసులో హత్య.. లైట్ల విషయంలో మేనేజర్‎ను డంబెల్ తో కొట్టి చంపిన టెకీ

బెంగుళూర్: ఆఫీస్‎లో లైట్లు బంద్ చేసే విషయంలో తలెత్తిన చిన్న వివాదం ఓ వ్యక్తి ప్రాణం తీసింది. లైట్లు ఆపేయమన్న పాపానికి మేనేజర్‎ను దారుణంగా హత్య చేశాడు ఓ టెకీ. కారం చల్లి, డంబెల్‎తో కొట్టి కిరాతకంగా చంపేశాడు. ఆ తర్వాత నేరుగా పోలీస్ స్టేషన్‎కు వెళ్లి మేనేజర్‎ను చంపేశానని చెప్పి లొంగిపోయాడు నిందితుడు. ఈ దారుణ ఘటన ఐటీ రాజధానిగా పేరొందిన బెంగుళూర్ నగరంలో జరిగింది. 

వివరాల ప్రకారం.. చిత్రదుర్గకు చెందిన భీమేష్ బాబు (41) గోవిందరాజనగర్ పోలీస్ పరిధిలోని డిజిటల్ డేటా స్టోర్‎లో మేనేజర్‎గా పని చేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్‎లోని విజయవాడకు చెందిన సోమల వంశీ (24) ఇదే కంపెనీలో టెక్నికల్ ఎగ్జిక్యూటివ్‎గా జాబ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం నవంబర్ (2) అర్ధరాత్రి 1 గంటల ప్రాంతంలో ఆఫీస్‎లో లైట్లు ఆర్పే విషయంలో భీమేష్ బాబు, వంశీ మధ్య వాగ్వాదం తలెత్తింది. 

లైట్లు ఆపేయాలని భీమేష్ బాబు చెప్పగా.. అందుకు వంశీ నిరాకరించాడు. చిన్నగా మొదలైన వివాదం చిలికిచిలికి గాలివానలా మారింది. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురైన వంశీ మేనేజర్ భీమేష్‎పై దాడి చేశాడు. కారం పొడి చల్లి డంబెల్‎తో తల, ముఖం, ఛాతీపై కొట్టాడు. తీవ్ర గాయాలపాలైన భీమేష్‎ను ఇతరు ఉద్యోగులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. 

కానీ భీమేష్ అక్కడికక్కడే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. నిందితుడు వంశీ గోవిందరాజనగర్ పోలీస్ స్టేషన్‎కు వెళ్లి లొంగిపోయాడు. మేనేజర్ భీమేష్‎ను హత్య చేసినట్లు పోలీసుల ఎదుట అంగీకరించాడు. ఈ మేరకు వంశీపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆఫీసు లైట్ల విషయంలో చోటు చేసుకున్న వివాదం హత్యకు దారితీసిందని డీసీపీ (వెస్ట్) గిరీష్ ఎస్ ధృవీకరించారు.