మహబూబాబాద్ జిల్లా జనరల్ ఆస్పత్రిలో బతికున్న వ్యక్తిని అక్టోబర్ 29 న మార్చురీకి తరలించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఐదు రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతోన్న రాజు అనే వ్యక్తి ఇవాళ( నవంబర్ 3న) మృతి చెందాడు. చిన్న గూడూరు మండలం జయ్యారం గ్రామానికి చెందిన రాజు మృతదేహంను మార్చురీలోనే భద్రపరిచారు వైద్య సిబ్బంది. రాజు మృతదేహాన్ని డీఎస్ఎఫ్ టీ జాతీయ కన్వీనర్ డాక్టర్ వివేక్ పరిశీలించారు.
అసలేం జరిగిందంటే..?.. మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు మండలం జయ్యారం గ్రామానికి చెందిన వెల్ది రాజు ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేసేవాడు. మద్యానికి బానిసైన రాజు రోడ్ల వెంట తిరుగుతుండడంతో కుటుంబ సభ్యులు సైతం ఆయనను పట్టించుకోవడం మానేశారు. కిడ్నీ సమస్యతో బాధపడుతున్న అతడు మూడు రోజుల కింద మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్‌కు వచ్చాడు. అతడిని పరీక్షించిన డాక్టర్లు ఆధార్ కార్డుతో పాటు, వెంట ఉండేందుకు కుటుంబ సభ్యులను తీసుకొని రావాలని సూచించారు. కుటుంబ సభ్యులెవరూ పట్టించుకోకపోవడంతో ఎటు పోవాలో తెలియని రాజు మూడు రోజులుగా హాస్పిటల్ ఆవరణలోని క్యాంటీన్ వద్ద పడుకున్నాడు. దుస్తులలోనే టాయిలెట్ పోసుకోవడంతో వాసన వస్తుందన్న ఉద్దేశంతో క్యాంటీన్ సిబ్బంది అతడిని బయట పడుకోబెట్టారు. ఈ క్రమంలో వర్షానికి తడిసిపోయిన అతడు మార్చురీ సమీపంలో పడిపోయాడు. గమనించిన హాస్పిటల్ సిబ్బంది.. చనిపోయి ఉంటాడని భావించి మార్చురీ ఆవరణలోని గద్దెపై పడేశారు. అక్టోబర్ 30 ఉదయం స్వీపర్ మార్చురీని క్లీన్ చేస్తుండగా.. రాజు కదలడాన్ని గమనించి సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం ఇచ్చింది. వారు వచ్చి విషయాన్ని డాక్టర్లకు చెప్పడంతో వెంటనే వార్డులోకి తరలించి ట్రీట్‌మెంట్ స్టార్ట్ చేశారు.
ఈ ఘటనపై ఘటనపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కూడా సీరియస్ అయ్యారు. ఘటనకు సంబంధించిన నిజనిజాలు తేల్చాలని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ నరేంద్రకుమార్‌ను ఆదేశించారు. దీంతో డీఎంఈ ములుగు జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ వి.చంద్రశేఖర్, జనగాం మెడికల్ కాలేజీ, హాస్పిటల్‌కు చెందిన జనరల్ సర్జరీ డిపార్ట్‌మెంట్ హెచ్‌వోడీ గోపాల్‌రావు, సిద్దిపేట జనరల్ హాస్పిటల్ ఫోరెన్సిక్ మెడిసిన్ హెచ్‌వోడీ ఆర్. శ్రీధరాచారితో ఎంక్వైరీ కమిటీని నియమించారు. మహబూబాబాద్ ఘటనపై విచారణ జరిపిన కమిటీ అక్టోబర్ 31న రిపోర్ట్‌ను డీఎంఈ ఆఫీస్‌కు పంపించింది. ఐదు రోజుల ట్రీట్ మెంట్ అనంతరం రాజు ఇవాళ నవంబర్ 3న చనిపోయాడు.
