ఓలటైల్ మార్కెట్లలో సేఫ్ ట్రేడింగ్ ఎలా..? పెయిర్ ట్రేడింగ్ వల్ల లాభాలొస్తాయా..?

ఓలటైల్ మార్కెట్లలో సేఫ్ ట్రేడింగ్ ఎలా..? పెయిర్ ట్రేడింగ్ వల్ల లాభాలొస్తాయా..?

ప్రస్తుతం భారతీయ మార్కెట్లు ఊహించని హైపర్ ఓలటాలిటీలో ట్రేడవుతున్నాయి. ఇలాంటి మార్కెట్లలో డబ్బు పెట్టాలంటే ఇన్వెస్టర్లు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్నారు. భారీగా మార్కెట్లు పతనం కావటంతో అసలు ట్రేడింగ్ ఎందుకు కొద్దిగా దూరంగా ఉందాం అనే ధోరణి చాలా మంది ఇన్వెస్టర్లలో కనిపిస్తోంది. దీంతో కొందరు గోల్డ్, సిల్వర్ వైపు వెళుతుంటే మరికొందరు మ్యూచువల్ ఫండ్స్ బాట పడుతున్నారు. చాలా తక్కువ మంది మాత్రమే బాండ్స్ లాంటి డెట్ మార్కెట్లోకి తమ డబ్బును ఇన్వెస్ట్ చేస్తున్నారు. అసలు ఇలాంటి పరిస్థితుల్లో సేఫ్ ట్రేడింగ్ కుదురుతుందా.. ఉంటే ఎలా చేయెుచ్చనే విషయాల గురించి నిపుణులు ఏమంటున్నారో చూద్దాం... 

జనవరి 2026 స్టాక్ మార్కెట్ చరిత్రలో ఒక అనూహ్యమైన మలుపుగా నిలిచిపోనుంది. నెల ప్రారంభంలో నిఫ్టీ జీవితకాల గరిష్టాలను తాకుతూ 29వేల స్థాయికి చేరుకుంటుందని ఇన్వెస్టర్లు ఎంతో ఆశగా ఎదురుచూశారు. కానీ అకస్మాత్తుగా మారిన భౌగోళిక రాజకీయ పరిస్థితులు, యుద్ధ వాతావరణం, కరెన్సీ పతనం, విదేశీ ఇన్వెస్టర్లు డబ్బు వెనక్కి తీసుకోవటంతో మార్కెట్ కుప్పకూలింది. నిఫ్టీ 25,200 స్థాయికి పడిపోవడంతో ట్రేడర్లలో నిరాశ పెరిగింది. ఇలాంటి అత్యంత ఓలటైల్ మార్కెట్లలో దిశను అంచనా వేసి ట్రేడింగ్ చేయడం కత్తి మీద సాములాంటిదే. బడ్జెట్ అంచనాలతో కొన్ని షేర్లు పెరిగినా, అంతర్జాతీయ ప్రతికూల పవనాలతో అవి నిలబడలేకపోతున్నాయి. ఇలాంటి క్లిష్ట సమయంలో నష్టాలను తగ్గించుకుంటూ లాభాలను ఆర్జించేందుకు నిపుణులు 'పెయిర్ ట్రేడింగ్' అనే వ్యూహాన్ని సూచిస్తున్నారు.

ఏంటి ఈ పెయిర్ ట్రేడింగ్ అంటే..?
పెయిర్ ట్రేడింగ్ అనేది ఒక రక్షణ కవచం లాంటిది. ఇందులో ట్రేడర్లు ఒకే రంగంలోని ఒక స్టాక్ ఫ్యూచర్‌ను కొనుగోలు(Buy) చేస్తూనే.. అదే రంగంలోని మరొక స్టాక్ ఫ్యూచర్‌ను అమ్ముతారు(Sell). మార్కెట్లో ఉండే రెండు రకాల రిస్కులను ఎదుర్కోవడానికి ఇది సరైన మార్గం. సాధారణంగా మార్కెట్ మొత్తం పడిపోయే సిస్టమాటిక్ రిస్క్ ను ఇది అడ్డుకుంటుంది. ఉదాహరణకు.. ఒక రంగంపై ప్రతికూల వార్తలు వచ్చినప్పుడు ఆ రంగంలోని షేర్లన్నీ పడిపోతాయి. అప్పుడు మీరు కొన్న షేరులో వచ్చే నష్టాన్ని.. మీరు షార్ట్ చేసిన అదే అమ్మిన స్టాక్ ఫ్యూచర్స్ లో వచ్చే లాభం భర్తీ చేస్తుంది. దీనివల్ల మార్కెట్ ఒడిదుడుకులతో సంబంధం లేకుండా.. ఆ రెండు షేర్ల మధ్య ఉండే రిలేటివ్ పెర్ఫామెన్స్ ఆధారంగా ఇన్వెస్టర్లకు లాభాలు వస్తాయి.

ఈ వ్యూహాన్ని అమలు చేయాలంటే.. ఒకే రంగంలో ఉండి చారిత్రకంగా ఒకేలా కదిలే రెండు షేర్లను ఎంచుకోవాల్సి ఉంటుందంట. మీరు కొనే షేరు కంటే మెరుగ్గా రాణిస్తున్న మరొక షేరును విక్రయించడం ద్వారా సమతుల్యత సాధించవచ్చు. ఒకవేళ మీరు కొన్న షేరు నష్టపోతే, వెంటనే రెండు పొజిషన్ల నుంచి ఎగ్జిట్ అవ్వాలి. దీనివల్ల మీ నష్టం చాలా తక్కువగా ఉంటుంది. 

చాలామంది ట్రేడర్లు పెయిర్ ట్రేడింగ్‌లో లాభాలు తక్కువగా ఉంటాయని భావిస్తారు. కానీ రిస్క్ కంట్రోల్ లో ఉండటం ఇక్కడ అసలు రహస్యం. లిమిట్స్ లేని నష్టాల కంటే.. సురక్షితమైన పరిమిత లాభాలే మేలని నిపుణులు చెబుతున్నారు. బడ్జెట్ వంటి కీలక ఈవెంట్లు ఉన్నప్పుడు లేదా మార్కెట్ గరిష్టాల వద్ద ఉన్నప్పుడు గుడ్డిగా బెట్లు కట్టడం కంటే, ఇలాంటి స్మార్ట్ వ్యూహాలతో ముందుకెళ్లడమే తెలివైన ట్రేడర్లు చేసే పని.