ఈ వారం భారత స్టాక్ మార్కెట్లు అనూహ్యంగా పుంజుకుని మెగా ర్యాలీని నమోదు చేశాయి. అయితే ఈ క్రమంలో బెంచ్ మార్క్ సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ తమ సరికొత్త జీవితకాల గరిష్టాలను తాకాయి. అయితే అసలు ట్విస్ట్ ఏంటంటే మార్కెట్లు ఎంత పెరిగినా చాలా మంది రిటైల్ ఇన్వెస్టర్లు మాత్రం ఆ లాభాలను పొందలేకపోతున్నారు. మార్కెట్లు దూసుకుపోతున్నా తమ పోర్ట్ ఫోలియోలో స్టాక్స్ మాత్రం చలనం లేకుండా నష్టాల్లోనే ఉన్నాయని బాధపడుతున్నారు. అయితే దీని వెనుక ఉన్న అసలు మతలబు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రధానంగా ప్రస్తుతం దేశీయ స్టాక్ మార్కెట్లలో ర్యాలీ కొన్ని హెవీ వెయిట్ స్టాక్స్ లో మాత్రమే జరిగింది. అయితే రిటైల్ ఇన్వెస్టర్లు ఎక్కువగా స్మాల్ క్యాప్ కేటగిరీకి చెందిన షేర్లలో పెట్టుబడులను కలిగి ఉండటం వల్ల వారి పోర్ట్ ఫోలియోలో మార్కెట్ల ర్యాలీ ప్రతిబింబించటం లేదని నిపుణులు చెబుతున్నారు. ప్రధానంగా కొన్ని లార్జ్ క్యాప్ షేర్ల కారణంగానే మార్కెట్ల ర్యాలీ నడిపించబడిందని జియోజిత్ బ్రోకరేజ్ ప్రతినిధి వికె విజయకుమార్ చెప్పారు. కరోనా తర్వాత మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చిన చాలా మంది కొత్త ఇన్వెస్టర్ల పోర్ట్ ఫోలియోలు ఇప్పటికీ నష్టాల్లోనే కొనసాగుతున్నాయని ఆయన అన్నారు.
అసలు మేజర్ సమస్య ఏంటంటే చాలా మంది రిటైల్ ఇన్వెస్టర్లు తక్కువ రేటులో ఉన్న స్మాల్ అండ్ మైక్రో స్టాక్స్ కొని అవి మల్టీబ్యాగర్ రాబడులను అందించాలనే ఊహల్లో ఉంటుంటారని అందులోనే అసలు సమస్య ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తక్కువ ఆదాయాలు, భారీ విలువలతో ఇటీవలి కాలంలో స్మాల్ క్యాప్ స్టాక్స్ సతమతమౌతున్నాయి. అయితే మంచి రాబడులు కావాలనుకుంటే ఖచ్చితంగా ఇన్వెస్టర్లు లార్జ్ క్యాప్ లేదా మిడ్ క్యాప్ స్టాక్స్ ఎంచుకోవాల్సిందేనని వారు అంటున్నారు.
బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు సహజంగా మంచి రాబడులను పొందొచ్చనే ఊహ కలిగిస్తుంటాయని, కానీ మార్కెట్లలో పూర్తి స్థాయి వివరాలు దాని ద్వారా తెలియవని సాంకో సెక్యూరిటీస్ ప్రతినిధి అపూర్వా షేత్ అన్నారు. చూసేవారికి ఇవి పెరగగానే అందరు ఇన్వెస్టర్లకూ డబ్బు లాభాల రూపంలో వస్తుందనే భ్రమ కలుగుతుందని అన్నారు. అయితే ఆ సూచీల్లో ఏ స్టాక్స్ ఉన్నాయి అనే దాన్ని బట్టే అసలు లాభాలు ఎవరికి వెళుతున్నాయో అర్థం అవుతుందని చెప్పారు.
