టమాటాలకు సెక్యూరిటీ పెట్టాలేమో? తాజాగా జార్ఖండ్​లో చోరీ

టమాటాలకు సెక్యూరిటీ పెట్టాలేమో? తాజాగా జార్ఖండ్​లో చోరీ

టమాటా ధరలు చుక్కలనంటుతున్న వేళ వాటి చోరీ ఘటనలు నిత్యం ఏదో ఒక చోట జరుగుతూనే ఉన్నాయి. టమాటాలు చోరీ చేసిన ఘటన తాజాగా జార్ఖండ్​లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుమ్లాలోని తంగ్రా కూరగాయల మార్కెట్లోని 66 దుకాణాల్లో టమాటాలను దొంగలు ఎత్తుకెళ్లారు. 

దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. తంగ్రా కూరగాయల మార్కెట్‌లోని దుకాణాల నుంచి సుమారు 40 కిలోల టమాటాలు, పది కిలోల అల్లం, రెండు లక్షల విలువైన తూకం యంత్రాలు తదితర వస్తువులు చోరీ అయ్యాయి.  

ఉదయం మార్కెట్‌కు వచ్చిన కూరగాయల వ్యాపారులు తమ షాపుల తాళాలు పగులగొట్టి ఉండటం చూసి చోరీ జరిగిన విషయాన్ని గుర్తించారు. చోరీ అయిన వాటిలో 40 కిలోల టమాటాలు, పది కిలోల అల్లం, తూకం యంత్రాలు కూడా ఉండటం గమనార్హం. 

వారంతా కలిసి స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు నిరసనగా మార్కెట్‌లోని వ్యాపారులు దుకాణాలు మూసివేశారు. ఘటనపై బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

పెరుగుతున్న టమాటా ధరలు

దేశంలో టమాటా ధరలు భారీగా పెరిగాయి.  ఉత్తర భారతదేశంలోని భారీ వర్షాల కారణంగా రైతుల ఉత్పత్తులకు నష్టం వాటిల్లింది.ప్రస్తుతం ఢిల్లీలో కిలో టమాటా ధర రూ.250- ‌‌– 260 గా ఉంది.  ఆసియాలోనే అతిపెద్ద కూరగాయల హోల్‌సేల్ మార్కెట్ అయిన ఆజాద్‌పూర్ మండిలో వీటి ధర రూ. 150–-200గా ఉంది.