అమీన్​పూర్​పెద్ద చెరువు మా ప్లాట్లను ముంచేసింది

అమీన్​పూర్​పెద్ద చెరువు మా ప్లాట్లను ముంచేసింది

ఖైరతాబాద్, వెలుగు: అమీన్​పూర్​పెద్ద చెరువు తమ ప్లాట్లను ముంచేసిందని పలువురు బాధితులు వాపోయారు. ఇరిగేషన్​అధికారుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమని మండిపడ్డారు. పట్టా భూముల్లో లేఅవుట్​వేస్తే.. 1986లో ప్లాట్లు కొనుగోలు చేశామని, హెచ్ఎండీఏ, పంచాయతీ అనుమతులు కూడా ఉన్నాయని చెప్పారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో బాధితుల జేఏసీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. జేఏసీ చైర్మన్​ చిరునామా సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు వీఎస్సార్​బ్రహ్మానందరావు, జాయింట్​సెక్రటరీ పి.విజయ్​కుమార్​రెడ్డి మాట్లాడుతూ.. దాదాపు 5 వేల కుటుంబాలకు చెందిన స్థలాలు పెద్ద చెరువులో కలిసి పోయాయన్నారు. 

ఇరిగేషన్​అధికారులు రెండు చెరువులను కలిపి ఎఫ్ టీఎల్ గా ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నించారు. సీఎం రేవంత్​రెడ్డి స్పందించి రీసర్వే చేయాలని, ప్లాట్లను తిరిగి అప్పగించాలని కోరారు. చెరువు విస్తీర్ణం 93 ఎకరాలు కాగా, తమ స్థలాలను కలిపి ప్రస్తుతం 400 ఎకరాలకు చేరుకుందన్నారు. పైనుంచి వచ్చిన నీళ్లన్నీ ప్లాట్లలోకి చేరాయని వాపోయారు. ఇల్లు కట్టు కుందామంటే ఎఫ్​టీఎల్ పరిధి అంటున్నారని, రిజిస్టర్డ్​భూములు ఎఫ్ టీఎల్ పరిధిలోకి ఎలా మారుతాయని ప్రశ్నించారు. సమావేశంలో జేఏసీ సభ్యులు డి.నర్సింగరావు, కాసోజు నవనీత, కోశాధికారి టి.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.