V6 News

ఓట్ చోరీపై అమిత్షా వర్సెస్ రాహుల్.. ఎన్నికల సంస్కరణలపై లోక్సభలో వాడివేడిగా చర్చ

ఓట్ చోరీపై అమిత్షా వర్సెస్ రాహుల్.. ఎన్నికల సంస్కరణలపై లోక్సభలో వాడివేడిగా చర్చ
  • రాజీవ్ తెచ్చిన ఈవీఎంలను కాంగ్రెస్ వద్దంటోంది: షా
  • ఈవీఎంలతో జరిగిన ఫస్ట్ ఎలక్షన్​లో ఆ పార్టీయే గెలిచింది 
  • నెహ్రూ హయాం నుంచే ఓట్ చోరీ జరిగిందంటూ ఫైర్ 
  • ఓట్ చోరీపై తాను పెట్టినప్రెస్ కాన్ఫరెన్స్​లపై డిబేట్ పెట్టాలని రాహుల్ సవాల్ 
  • ప్రతిపక్ష నేత చెప్పినట్టే సభ నడపాలంటే కుదరదన్న హోం మంత్రి

న్యూఢిల్లీ: ఓట్ చోరీ అంశంపై బుధవారం లోక్ సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మధ్య వాడివేడిగా చర్చ సాగింది. తొలి ప్రధాని నెహ్రూ హయాం నుంచే కాంగ్రెస్ ఓట్ చోరీకి పాల్పడిందని అమిత్ షా ఆరోపించగా.. ఓట్ చోరీపై తాను పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్ లపై లోక్ సభలో డిబేట్ పెట్టాలని రాహుల్ సవాల్ చేశారు. 

ముందుగా ఎన్నికల సంస్కరణలపై జరిగిన డిబేట్ లో అమిత్ షా మాట్లాడుతూ.. ఎన్నికల సంఘాన్ని కేంద్రంలోని బీజేపీ కబ్జా పెట్టిందంటూ మంగళవారం లోక్ సభలో రాహుల్ గాంధీ చేసిన విమర్శలపై స్పందించారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హయాంలో ప్రవేశపెట్టిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్(ఈవీఎం)లను ఇప్పుడు ఆయన కుమారుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ నేతలు వద్దంటున్నారని విమర్శించారు.

‘‘2004 లోక్ సభ ఎన్నికల్లో తొలిసారిగా ఈవీఎంలను వినియోగించారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీయే గెలిచి మన్మోహన్ సింగ్ ప్రధాని అయ్యారు. కానీ పదేండ్ల తర్వాత 2014లో మేం గెలవడంతో వాళ్లు ఈవీఎంలపై అనుమానాలు మొదలుపెట్టారు” అని అన్నారు. నిజానికి మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ హయాం నుంచే ఓట్ చోరీ జరిగిందని ఆరోపించారు. 

ఓటర్ల జాబితాలో అర్హులైన ఓటర్లే ఉండేలా సవరణలు చేపడితే.. అభ్యంతరం వ్యక్తం చేయడం ఏమిటని ప్రశ్నించారు. ‘‘వాళ్లు గెలిచినప్పుడు ఓటర్ లిస్టులు బాగుంటాయి. బిహార్ వంటి రాష్ట్రాల్లో ఓడిపోయినప్పుడు మాత్రం.. వాళ్లకు ఓటర్ లిస్టుతో సమస్య వస్తుంది” అని విమర్శించారు. 

ప్రతిపక్షాల వాకౌట్..
రాహుల్ గాంధీ ఓటర్ లిస్టులపై ప్రెస్ కాన్ఫరెన్స్​లు పెట్టారని.. కానీ ఒక ఫ్యామిలీ వాళ్లే తరతరాలుగా ఓట్ చోరీకి పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు. దీనికి రాహుల్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. ధైర్యం ఉంటే తన ప్రెస్ కాన్ఫరెన్స్​లపై సభలో డిబేట్ చేపట్టాలని సవాల్ చేశారు. దీనిపై అమిత్ షా తీవ్రంగా స్పందించారు. ప్రతిపక్ష నేత చెప్పినట్టుగా పార్లమెంట్ నడవదని చెప్పారు. తాను ఎలా సమాధానం ఇవ్వాలన్నది ఆయన డిసైడ్ చేయరాదన్నారు.

దీంతో అమిత్ షా భయపడుతున్నారని, అందుకే ఆత్మరక్షణలో పడి మాట్లాడుతున్నారంటూ రాహుల్ కామెంట్ చేశారు. అమిత్ షా స్పందిస్తూ.. ప్రజా తీర్పులో ఓడిపోయినవాళ్లే దేశంలో ఓట్ చోరీకి పాల్పడ్డారని ఆరోపించారు. అక్రమ వలసదారులు ఓటర్ లిస్టులో ఉండాలన్నదే నేడు ప్రతిపక్షాల ప్రయత్నమన్నారు. దీంతో అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా రాహుల్ గాంధీతో పాటు ప్రతిపక్ష నాయకులు లోక్ సభ నుంచి వాకౌట్ చేశారు.