విపక్షాలకే అవిశ్వాసం.. ప్రజల్లో మాకు విశ్వాసం-అమిత్ షా

విపక్షాలకే అవిశ్వాసం.. ప్రజల్లో మాకు విశ్వాసం-అమిత్ షా

ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రతిపక్షా ప్రయత్నిస్తున్నాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు.  ప్రజల ఆకాంక్షల మేరకు విపక్షాలు అవిశ్వాసం తీసుకురాలేదన్నరాు.  అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో చర్చ సందర్భంగా ఆయన మాట్లాడారు.  ‘‘సాధారణంగా ప్రభుత్వాలు సరిగ్గా పనిచేయకపోతే, ప్రజా ఆందోళనలు జరిగితే విపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతాయని చెప్పారు. విపక్షాలకు తమపై విశ్వాసం లేకపోయినా...ప్రజల్లో మోదీ ప్రభుత్వంపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందని అమిత్‌ షా తెలిపారు.

అవిశ్వాస తీర్మానంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని అమిత్ షా అన్నారు.  విపక్షాలకు ఈ తీర్మానం ప్రవేశపెట్టే హక్కు ఉందని చెప్పారు.  రెండు సార్లు పూర్తి మెజారిటీతో ప్రజలు మోదీని గెలిపించారని చెప్పారు. మోదీ  ప్రభుత్వం మైనారిటీలో లేదన్నారు. ప్రజల్లో అలజడి సృష్టించాలని విపక్షాలు ప్రయత్నిస్తున్నాయని..సభలో ప్రస్తావించేందుకు విపక్షాలకు మరో సమస్య దొరకలేదని అందుకే అవిశ్వాసం ప్రవేశపెట్టాయని హోంమంత్రి అమిత్ షా మండిపడ్డారు. 

స్వాతంత్య్రం తర్వాత అత్యంత ప్రజాదరణ కలిగిన వ్యక్తి మోదీ అని అమిత్ షా అన్నారు. 60 కోట్ల మంది పేదల బతుకుల్లో వెలుగులు నింపిన వ్యక్తి మోదీ అని చెప్పారు. అవినీతి, కుటుంబ పాలనపై మోదీ పిలుపునిచ్చారని తెలిపారు. అవిశ్వాసంలో అప్పట్లో పీవీ గెలిచారని....ఆ తర్వాత చాలా మంది జైలుకు వెళ్లారని అమిత్ షా గుర్తు చేశారు. అలాగే 1999లో  వాజ్ పేయి ప్రభుత్వంపై కూడా అవిశ్వాసం పెట్టారని... ఒక్క ఓటుతో వాజ్ పేయి ప్రభుత్వం వీగిపోయిందన్నారు. ఇక 2008లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వంపై అవిశ్వాసం పెడితే..సభ్యులకు డబ్బులిచ్చి ఓట్లు వేయించుకున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ చేసినట్లు తాము చేయబోమన్నారు. దేశంలో జరిగేది..సభలో జరిగేది ప్రజలంతా చూస్తున్నారు..ఇది ట్రైలర్ మాత్రమే అని విపక్షాలను హెచ్చరించారు అమిత్ షా.  అవిశ్వాసంతో కొన్ని సార్లు కూటముల బలమెంతో తెలుస్తుందని స్పష్టం చేశారు. 

9 ఏళ్లలో మోదీ ప్రభుత్వం 50 విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుందని అమిత్ షా తెలిపారు. మోదీ ప్రధాని కాకముందు పేదల గుడిసెలు మంటల్లో మగ్గిపోయాయన్నారు. కానీ ప్రధాని మోదీ వచ్చాక   వారి గుడిసెల్లో వెలుగులు నింపారని చెప్పారు.  రైతులను జీవితాంతం రుణ విముక్తులను మోదీ చేశారని....రైతులకు రుణమాఫీ  కాదు..రుణ భారం కాకుండా చేశారని చెప్పుకొచ్చారు. డీబీటీ ద్వారా ప్రజల ఖాతాల్లో డైరెక్టుగా డబ్బులు జమ అవుతున్నాయని గుర్తు చేశారు. జన్ ధన్ యోజన తెచ్చినప్పుడు ఎగతాళి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా సమయంలో వ్యాక్సిన్ తయారు చేసినప్పుడు మోదీ వ్యాక్సిన్ అని చెప్పి తీసుకోద్దని రాహుల్ గాందీ, అఖిలేష్ యాదవ్ చెప్పారని గుర్తు చేశారు. కానీ ప్రజలు నమ్మలేదని..అందరూ వ్యా్క్సిన్ తీసుకున్నారని చెప్పారు. కరోనా వచ్చినపుడు మోదీ రాజకీయాలకు అతీతంగా వ్యవహరించారని చెప్పారు. అందరిని కలుపుకుని పోయి కరోనాపై విజయం సాధించారని అమిత్ షా తెలిపారు. 


కాంగ్రెస్ గరీబీ హఠావో నినాదం కేవలం నినాదానికే పరిమితమైందన్నారు అమిత్‌షా. పేదలతో కాంగ్రెస్ రాజకీయాలు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేసిందన్నారు. యోజన పేరును పథకాలను ప్రవేశపెట్టిన కాంగ్రెస్..వాటి వల్ల  ప్రజలకు ఎలాంటి ప్రయోజనం చేయలేదన్నారు.  నరేంద్ర మోదీ వారసత్వ రాజకీయాలకు చెక్ పెట్టారన్నారు.  కేవలం అభివృద్ధి ఆధారంగానే రాజకీయాలు చేస్తున్నారని చెప్పారు. దేశ చరిత్రలోనే యూపీఏ అత్యంత అవినీతిమయమైన కూటమి ఇండియా కూటమి అని మండిపడ్డారు. అందుకే ప్రధాని మోదీ అవినీతికి, వారసత్వ రాజకీయాలకు క్విట్ ఇండియా నినాదంతో బదులు చెబుతున్నారని అమిత్ షా చురకలంటించారు.