బలగాలపై రాళ్లు రువ్వే వారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వం: అమిత్​ షా

బలగాలపై రాళ్లు రువ్వే వారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వం: అమిత్​ షా

న్యూఢిల్లీ : జమ్మూకాశ్మీర్​లో టెర్రరిస్ట్​ల ఫ్యామిలీలు, రాళ్లురువ్వే వారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వబోమని కేంద్ర హోంమంత్రి అమిత్​ షా తెలిపారు. ఈ నిర్ణయంపై కొంతమంది మానవ హక్కుల కార్యకర్తలు సుప్రీంకోర్టుకు వెళ్లారని, ఇందులో ప్రభుత్వమే నెగ్గిందని చెప్పారు. అయితే, కుటుంబ సభ్యులుగానీ, దగ్గరి బంధువులుగానీ టెర్రరిస్టుల్లో చేరిన వారి వివరాలను తమ దృష్టికి తీసుకువచ్చే బాధిత కుటుంబాలకు మినహాయింపు ఇస్తున్నట్టు తెలిపారు. సోమవారం ఆయన ఉత్తరప్రదేశ్​ రాష్ట్రంలోని బల్లియా, చందౌలీ, ఖుషీనగర్​లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీల్లో పాల్గొన్నారు.

ఓ జాతీయ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ మాట్లాడారు. ప్రధాని మోదీ సర్కారు టెర్రరిస్టులతో పాటు టెర్రర్​ ఎకోసిస్టమ్​నే నిర్మూలించే లక్ష్యంతో పనిచేసిందని అమిత్​ షా చెప్పారు. ఫలితంగా టెర్రర్​ కార్యకలాపాలు తగ్గిపోయాయన్నారు. ఇంతకుముందు టెర్రరిస్టుల మృతదేహాలకు​ అంత్యక్రియలను కాశ్మీర్​ గడ్డపైనే నిర్వహించేవారని, దీనికి తాము స్వస్తి పలికామని చెప్పారు. టెర్రరిస్టుల మృతదేహాలను సాంప్రదాయం ప్రకారం ప్రత్యేక ప్రదేశంలో ఖననం చేస్తున్నట్టు చెప్పారు.

టెర్రర్​ ఫండింగ్​పై ఉక్కుపాదం మోపాం

టెర్రర్​ ఫండింగ్​పై తమ సర్కారు ఉక్కుపాదం మోపిందని అమిత్​షా చెప్పారు. నేషనల్​ఇన్వెస్టిగేషన్​ ఏజెన్సీ(ఎన్​ఐఏ) ద్వారా టెర్రర్​ ఫండింగ్​పై చాలా కఠినంగా వ్యవహరించినట్టు తెలిపారు. ‘భద్రతా దళాలకు చిక్కిన టెర్రరిస్ట్​కు తొలుత లొంగిపోయే చాన్స్​ ఇస్తాం. వినకుంటే భద్రతా దళాలు మట్టుబెడతాయి’  అని వివరించారు. టెర్రరిజం సంబంధించిన పబ్లికేషన్స్​, వారి భావజాల వ్యాప్తిని నిషేధించినట్టు చెప్పారు. దేశంలో 2018లో భద్రతా దళాలు, టెర్రరిస్టులకు మధ్య 189 ఎన్​కౌంటర్స్​ జరిగితే.. అవి 2023లో 40 కి తగ్గిపోయాయని తెలిపారు.  2018లో ఉగ్రవాదుల కాల్పుల్లో 55 మంది పౌరులు, 91 మంది భద్రతా సిబ్బంది చనిపోగా.. 2023లో పౌరుల సంఖ్య 5, భద్రతా సిబ్బంది సంఖ్య 15కు తగ్గిందన్నారు. 

కాంగ్రెస్​ ఓటమికి ఖర్గేను బాధ్యుడిని చేస్తారు

సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్​ ఓటమికి ఏఐసీసీ చీఫ్​ మల్లికార్జున ఖర్గేను బాధ్యుడిని చేస్తారని, ఆయన పదవి కోల్పోతారని అమిత్​ షా అన్నారు. రాహుల్ ​గాంధీ, ప్రియాంకా గాంధీని ఎవరూ నిందించరని తెలిపారు.