బీసీని సీఎం చేస్తారా? .. అమిత్ షా మాటలు హాస్యాస్పదం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 

బీసీని సీఎం చేస్తారా? .. అమిత్ షా మాటలు హాస్యాస్పదం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 
  • బీసీ నేత రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటే ఓర్వనోల్లు 
  • బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 
  • బీసీలకు 60 సీట్లు కేటాయిస్తామని ప్రకటన

కాగజ్ నగర్, వెలుగు : బీజేపీ గెలిస్తే తెలంగాణ రాష్ట్రానికి బీసీని ముఖ్యమంత్రి చేస్తానన్న అమిత్ షా మాటలు హాస్యాస్పదమని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్  ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్  అన్నారు. బీసీ వర్గానికి చెందిన బండి సంజయ్ పార్టీకి అధ్యక్షుడిగా ఉంటే ఓర్వలేక తొలగించిన బీజేపీ అధిష్టానం.. బీసీని ముఖ్యమంత్రి చేస్తాననడం నమ్మశక్యంగా లేదన్నారు. బీసీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి ప్రధానిగా ఉన్నా బీసీ కులగణన ఎందుకు చేపట్టలేదని కేంద్రాన్ని ఆయన ప్రశ్నించారు.

సిర్పూర్  అసెంబ్లీ అభ్యర్థిగా బరిలో ఉన్న ప్రవీణ్  కుమార్  ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం కుమ్రంభీం ఆసిఫాబాద్  జిల్లాలోని కౌటాల మండలంలో శిర్శా, కనికి, విర్దండి, తాటిపల్లి, మోగడ్ దగడ, వైగాం, గుడ్లబోరిలో పర్యటించారు. ఆయన మాట్లాడుతూ పేద, మధ్యతరగతి ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో కేసీఆర్  ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఓట్ల కోసమే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌‌ఎస్  మోసపూరిత హామీలతో ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నాయని విమర్శించారు.

కేసీఆర్  ఇస్తున్న ఆచరణ సాధ్యంకాని, మోసపూరిత వాగ్దానాలతో ప్రజలు విసిగిపోయారని పేర్కొన్నారు. ఏకగ్రీవంగా సర్పంచ్  ఎన్నికైతే రూ.25 లక్షలు ఇస్తానన్న ప్రభుత్వం.. ఎమ్మెల్యే కోనప్ప శీర్ష గ్రామానికి ఇంకెప్పుడు ఇస్తారని ప్రశ్నించారు. బీఎస్పీని గెలిపిస్తే సిర్పూర్  ప్రాంతంలో వ్యవసాయానికి త్రీఫేస్ కరెంటు సప్లై చేస్తామని, పోడు భూములకు పట్టాలిస్తామని హామీ ఇచ్చారు. డబ్బులు పంచే, ప్రలోభాలకు గురిచేసే పార్టీలకు ఓట్లు అమ్ముకోవద్దని ఓటర్లను ఆయన కోరారు. రాబోయే ఎన్నికల్లో బీసీలకు 60 సీట్లు కేటాయిస్తామని ప్రకటించారు. ప్రచారంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి సిడెం గణపతి తదితరులు పాల్గొన్నారు.