తెలంగాణలో 10 ఎంపీ సీట్లు గెలవాల్సిందే : అమిత్ షా

తెలంగాణలో 10 ఎంపీ సీట్లు గెలవాల్సిందే : అమిత్ షా

హైదరాబాద్​, వెలుగు: రానున్న లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో 10 ఎంపీ  సీట్లను గెలుచుకోవాలని, 35 శాతం ఓటింగ్ రావాలని బీజేపీ రాష్ట్ర నేతలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా దిశానిర్దేశం చేశారు. గురువారం హైదరాబాద్​ శివారులోని కొంగర కలాన్ వద్ద బీజేపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అమిత్​ షా మాట్లాడుతూ.. వచ్చే  లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రంలో పది సీట్లు, 35 శాతం ఓట్లను ప్రధాని మోదీకి తెలంగాణ నుంచి గిఫ్ట్ ఇవ్వాలని అన్నారు. ‘‘2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కేవలం ఒక్క సీటు సాధించింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో 8  సీట్లు గెలిచింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. అప్పుడు బీజేపీకి 95 సీట్లు కూడా రావొచ్చు. నేతలంతా కలిసి పనిచేయాలి” అని ఆయన చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ .. రెండూ కుటుంబ పార్టీలేనని దుయ్యబట్టారు. ‘‘అవినీతి పాలనతో, మజ్లిస్ తో అంటకాగిన కేసీఆర్ ఫామ్​హౌస్​కే పరిమితమైండు. కేసీఆర్ కంటే కాంగ్రెస్ నేతలు తక్కువేమీ కాదు. కాంగ్రెస్ అతిపెద్ద అవినీతి, కుటుంబ పార్టీ. అవినీతి, కుటుంబ పార్టీలకు వ్యతిరేకంగా బీజేపీ తన పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంటుంది” అని అన్నారు. 

ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నం

తెలంగాణకు తొమ్మిదేండ్లలో  రూ. 9 లక్షల కోట్ల నిధులిచ్చామని అమిత్​ షా తెలిపారు. ‘‘మా ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉంది. మాదిగ సామాజిక వర్గానికి అండగా ఉంటం. ఆ వర్గానికి తగిన న్యాయం చేసే బాధ్యత మాపై ఉంది” అని చెప్పారు. ‘‘తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చే వరకు నేను మళ్లీ.. మళ్లీ వస్తూనే ఉంట. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావాలంటే.. ఈ పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు బీజేపీకి అత్యంత కీలకం. ప్రతి బీజేపీ కార్యకర్త .. పార్టీ తమదే అనే భావనతో పని చేయాలి. దేశం మనదేననే భావన ప్రతి కార్యకర్తలో ఉండాలి. ప్రతి బీజేపీ కార్యకర్త ఇదే భావనతో ముందుకు సాగితే..  పార్లమెంట్​ ఎన్నికల్లో బీజేపీ 400కుపైగా సీట్లు సాధించడం ఖాయం” అని ఆయన తెలిపారు.  తెలంగాణలో 10 లోక్ సభ స్థానాల్లో బీజేపీ గెలిచేలా కృషి చేస్తామని మీటింగ్ కు వచ్చిన  పార్టీ నేతలతో అమిత్ షా ప్రతిజ్ఞ చేయించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నేతలు తరుణ్ చుగ్, లక్ష్మణ్, డీకే అరుణ, పొంగులేటి సుధాకర్ రెడ్డి, సునీల్ బన్సల్, బండి సంజయ్, ఈటల రాజేందర్  తదితరులు పాల్గొన్నారు. 

బీజేపీ ఎల్పీ నేత ఎన్నిక మళ్లీ పెండింగ్​

అమిత్ షా సమక్షంలోనే బీజేపీ ఎల్పీనేతను ఎన్నుకుంటారని ఇటీవల పార్టీ రాష్ట్ర​అధ్యక్షుడు కిషన్ రెడ్డి  ప్రకటించారు. అయితే గురువారం ఆ సమావేశం జరగలేదు. దీంతో ఎన్నిక పెండింగ్ లో పడింది. పార్టీ విస్తృత స్థాయి సమావేశం అనంతరం అమిత్ షా.. పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమై బీజేపీ ఫ్లోర్​ లీడర్​ను  ఎన్నుకుంటారని అంతా ఎదురు చూసినా ఆయన మాత్రం పార్టీ విస్తృత స్థాయి సమావేశం తర్వాత కొంగర కలాన్ నుంచి నేరుగా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వెళ్లిపోయారు. మరో రెండు ముఖ్యమైన మీటింగ్ లు షెడ్యూల్ లో ఉన్నప్పటికీ వాటిని కూడా ఆయన రద్దు చేసుకొని ఢిల్లీ వెళ్లిపోయారు.  

భాగ్యలక్ష్మి టెంపుల్​లోఅమిత్ షా పూజలు

రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా చార్మినార్ దగ్గర ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. గురువారం మధ్యాహ్నం టెంపుల్ కు వచ్చిన మంత్రికి ఆలయ పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పూజల అనంతరం ఆలయ నిర్వాహకులు  అమిత్ షా కు సీతారామ చంద్ర స్వామి ఫొటోను బహూకరించి సన్మానం చేశారు. హోంమంత్రి వెంట కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి ఉన్నారు. అమిత్ షా పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.