లక్షల కోట్లు మింగిన కేసీఆర్‌‌ జైలుకే : అమిత్​షా

లక్షల కోట్లు మింగిన కేసీఆర్‌‌ జైలుకే : అమిత్​షా
  •     రాష్ట్రంలో అధికారంలోకి రాగానే చర్యలు తీసుకుంటం: అమిత్ షా
  •     కేసీఆర్ అవినీతికి రాష్ట్రంలోని ప్రాజెక్టులే సాక్ష్యం
  •     చివరికి వరద సాయంలో కూడా అక్రమాలకు పాల్పడ్డారు
  •     నేటి కాంగ్రెస్ అభ్యర్థులే రేపటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని కామెంట్​

హైదరాబాద్/కొల్లాపూర్/యాదాద్రి/సంగారెడ్డి, వెలుగు: లక్షల కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసిన సీఎం కేసీఆర్‌‌‌‌ ను వదిలిపెట్టబోమని కేంద్ర హోంమంత్రి అమిత్​షా హెచ్చరించారు. టీఎస్‌‌పీఎస్సీ క్వశ్చన్ పేపర్ల లీకే జీలపై విచారణ జరిపి.. లీకేజీల వీరుడిని జైలుకు పంపిస్తామని స్పష్టం చేశారు. శనివారం నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌‌‌‌లో నిర్వహించిన బీజేపీ సకల జనుల విజయ సంకల్ప​సభలో, యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్, సంగారెడ్డి జిల్లా పటాన్​చెరులో, హైదరాబాద్‌‌ బంజారాహిల్స్ పరిధిలోని ఎన్​బీటీ నగర్‌‌‌‌లో నిర్వహించిన రోడ్​షోలలో, హైదరాబాద్‌‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. 

చంద్రయాన్‌‌ను ప్రధాని మోదీ సక్సెస్ చేస్తే.. కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు 20 సార్లు ‘రాహుల్ యాన్’ను ప్రయోగించి ఫెయిల్ అయిందని ఎద్దేవా చేశారు. ‘‘కేసీఆర్ అవినీతికి రాష్ట్రంలోని ప్రాజెక్టులు సాక్ష్యంగా నిలిచాయి. కాళేశ్వరం, మిషన్ భగీరథ, మిషన్​కాకతీయ, మియాపూర్ ల్యాండ్ స్కామ్, ఓఆర్ఆర్, హరితహారం ఇలా దేన్నీ వదలిపెట్టలేదు. చివరికి వరద సాయంలో కూడా అవినీతికి పాల్పడ్డారు” అని మండిపడ్డారు.

నిరుద్యోగ యువతను పట్టించుకోలే

కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే.. తర్వాత వాళ్లు బీఆ ర్ఎస్‌‌లోకి జంప్​అవుతారని అమిత్​షా ఆరోపించారు. నేటి కాంగ్రెస్ అభ్యర్థులే రేపటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని ఎద్దేవా చేశారు. ‘‘కేసీఆర్​కొడుకు కేటీఆర్‌‌‌‌ను సీఎం కుర్చీలో కూర్చోబెట్టేందుకు తాపత్రయ పడ్డారే తప్ప.. నిరుద్యోగ యువతను పట్టించుకోలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మొత్తం 14 సార్లు పోటీ పరీక్షల పేపర్లు లీక్​అయ్యాయి. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రాగానే విచారణ జరిపి కేసీఆర్‌‌‌‌ను జైలుకు పంపిస్తాం” అని తేల్చిచెప్పారు. 

ఒవైసీకి భయపడి తెలంగాణ విమోచన దినం నిర్వహించని కేసీఆర్‌‌‌‌కు రాష్ట్రాన్ని పాలించే హక్కు లేదని అన్నారు. మాదిగల దశాబ్దాల కలను ప్రధాని మోదీ నెరవేరుస్తారని, జనాభా ప్రకారం రిజర్వేషన్లలో వాటా అందుతుందని భరోసా కల్పించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే.. మైనార్టీలకు అక్రమంగా కల్పించిన నాలుగు శాతం రిజర్వేషన్లను తొలగిస్తామని అమిత్ షా స్పష్టం చేశారు. ఆ రిజర్వేషన్లను ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు కేటాయిస్తామని హామీ ఇచ్చారు.

చెప్పింది చేసినం

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాగానే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని అమిత్ షా స్పష్టం చేశారు. మాదిగ సామాజిక వర్గానికి దశబ్దాలుగా జరుగుతున్న అన్యాయానికి చరమగీతం పాడేందుకు ఎస్సీ వర్గీకరణ నిర్ణయం తీసుకున్నామని, ఈ దిశగా పనిచేస్తున్నామని తెలిపారు. ‘‘పెట్రోలు, డీజిల్‌‌పై వ్యాట్ ను తగ్గిస్తాం. మోదీ ప్రభుత్వం పెట్రో ఉత్పత్తుల ధరలు తగ్గిస్తే.. బీజేపీ పాలిత రాష్ట్రాలు చాలా వరకు ధరలు తగ్గించి పేదలపై భారాన్ని తగ్గించాయి. కానీ కాంగ్రెస్ పాలిత ప్రాంతాలు నామమాత్రంగా తగ్గించాయి. ఇక్కడ బీఆర్ఎస్ తగ్గించలేదు. రామమందిర నిర్మాణమైనా, ట్రిపుల్ తలాక్ రద్దు అయినా.. ఆర్టికల్ 370 రద్దు అయినా.. ఏదైనా.. కేంద్ర ప్రభుత్వం చెప్పింది చేసింది” అని చెప్పుకొచ్చారు.

రాష్ట్రాన్ని అవమానించడం కాంగ్రెస్‌‌కు అలవాటే

అవకాశం దొరికినప్పుడు తెలంగాణను అవమానించడం కాంగ్రెస్ కు అలవాటని, గతంలో అంజయ్యను, పీవీని అవమానించిందని అమిత్ షా ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఆలోచన ఒక్కటేనని, కాంగ్రెస్‌‌కు ఓటు వేస్తే.. అది బీఆర్ఎస్ కు మళ్లీ అధికారం అప్పగించినట్లేనని చెప్పారు. బీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీలు.. 2జీ, 3జీ, 4జీ పార్టీలని ఎద్దేవా చేశారు. 

కాంగ్రెస్ పార్టీ.. 2004 నుంచి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌‌కు 2 లక్షల కోట్లు గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో ఇస్తే.. ఈ పదేండ్లలో.. తమ ప్రభుత్వం ఒక్క తెలంగాణకే.. రూ. 2.5 లక్షల కోట్లు ఇచ్చిందని  తెలిపారు. కేంద్ర నిధులపై కేసీఆర్ అవాస్తవాలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ‘‘ఇంట్లో కూర్చుని ప్రభుత్వాలు నడిపే వారికి అకౌంటింగ్ లెక్కలు తెలియవు. ఇందుకోసం ఆఫీసుకు వెళ్లి అధికారులతో నిరంతరం చర్చించాల్సి ఉంటుంది. కేసీఆర్ ఫామ్‌‌హౌస్‌‌లో కూర్చుంటాడు. ఆయనకు లెక్కలేం తెలుసు” అని ఎద్దేవా చేశారు.

పని చేయని మైకులు..అమిత్​ షా సీరియస్

చౌటుప్పల్‌‌లో రోడ్ షో నిర్వాహకులపై అమిత్​షా సీరియస్​అయ్యారు. షా మాట్లాడుతున్న టైమ్‌‌లో మైకులు పనిచేయలేదు. ఐదారు మైకులు మార్చినా ఫలితం లేదు. చివరికి ఓ చిన్న మైకులో అమిత్​షా మాట్లాడగా.. అదే మైకును తీసుకొని మాజీ ఎంపీ బూర నర్సయ్య తెలుగులో అనువాదం చేశారు. అది కూడా సరిగా పని చేయకపోవడంతో మూడు నిమిషాల్లోనే అమిత్ స్పీచ్​ను ముగించారు. అదే సమయంలో పేపర్లు వెదజల్లే మిషన్ ​నుంచి పెద్ద సౌండ్‌‌తో పాటు పొగ రావడంతో అమిత్​షా సీరియస్​అయ్యారు. బంద్​చేయాలని హెచ్చరించారు. నిర్వాహకులపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

పదేండ్లలో రాష్ట్రం దివాలా

1,200 మంది బలిదానాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని అమిత్ షా అన్నారు. రాష్ట్రంలో యువత, పేదలు, రైతులు.. ఇలా అన్ని వర్గాల ప్రజలు తీవ్ర నిరాశలో ఉన్నారని చెప్పారు. ‘‘పదేండ్లలో తెలంగాణ రాష్ట్రం దివాలా తీసింది. అవినీతి తప్ప.. ప్రజలకు బీఆర్ఎస్ సర్కార్ చేసిందేమీ లేదు. అవినీతిలో కేసీఆర్ ప్రభుత్వం కూరుకుపోయింది. ఇక్కడ ప్రజాస్వామ్య విలువలకు గుర్తింపు లేదు. కుటుంబమే వాళ్ల సర్వస్వం” అని ఆరోపించారు. డబుల్ బెడ్రూం ఇండ్లు, దళితబంధు పథకాల్లో బీఆర్ఎస్ నేతలు చేతివాటం ప్రదర్శించారని మండిపడ్డారు. 

కేసీఆర్‌‌‌‌ను ఇంటికి పంపించాలని తెలంగాణ ప్రజలు నిర్ణయించుకున్నారని చెప్పారు. ఎన్నికల టైమ్‌‌లో రైతుబంధుకు ఈసీ అనుమతి ఇవ్వడంపై స్పందిస్తూ.. తాము రైతుబంధును ఆపబోమని చెప్పారు. కేసీఆర్ అవినీతి విషయంలో చర్యలపై స్పందిస్తూ.. అవినీతి కేసులను విచారణ సంస్థలు జరుపుతాయని, అవి తమ పని తాము చేసుకుపోతాయని అన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే విచారణ జరిపి అవినీతిపరులను జైలుకు పంపుతామని తేల్చిచెప్పారు.

 ‘‘ఏ పార్టీ విశ్వసనీయత అయినా.. ఆ పార్టీ ఇచ్చే మేనిఫెస్టో అమలుపై ఆధారపడి ఉంటుంది. గత 10 ఏండ్లలో ఇచ్చిన హామీల్లో దేన్నీ కేసీఆర్ ప్రభుత్వం నెరవేర్చలేదు. ఫిల్మ్ సిటీ, ఫార్మా సిటీ, టెక్స్ టైల్ సిటీ, ఎడ్యుకేషన్ సిటీ వంటి హామీలన్నీ ఉత్తవేనని తేలిపోయింది. కేజీ టు పీజీ విద్యను గాలికొదిలేశారు. ఉద్యోగాలు భర్తీ చేయలేదు. రుణమాఫీ, నిరుద్యోగ భృతి, జిల్లాకో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటును అమలు చేయలేదు. మిషన్ కాకతీయలో రూ.వేల కోట్లు ఖర్చు చేసినా పనులు పూర్తి కాలేదు. దళితబంధులో అవినీతి జరిగింది” అని ఆరోపించారు.