మేయర్ పీఠం మాదే.. హైదరాబాద్‌‌ను విశ్వ నగరంగా మారుస్తాం

మేయర్ పీఠం మాదే.. హైదరాబాద్‌‌ను విశ్వ నగరంగా మారుస్తాం

హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. తొలుత చార్మినార్‌‌లో భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న షా.. ఆ తర్వాత వారాసిగూడలో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్నారు. అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రెస్‌‌మీట్‌‌లో ఆయన మాట్లాడారు. ప్రజల స్వాగతానికి అభినందనలు తెలిపారు. రోడ్ షోలో ప్రజల ఉత్సాహాన్ని చూస్తుంటే మేయర్ పీఠంపై బీజేపీని కూర్చోబెట్టడానికి జనాలు స్పష్టతను ఇచ్చినట్లు అర్థమవుతోందన్నారు.

‘హైదరాబాద్‌‌లో ఐటీ హబ్‌‌ ఏర్పాటుకు అవకాశాలు ఉన్నాయి. అయితే అందుకు అవసరమైన మౌలిక వసతుల సౌకర్యాన్ని సిద్ధం చేసుకోవాల్సి ఉంది. వీటి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి గ్రాంట్లు లభించినా దీన్ని రూపొందించాల్సిన పని నగర పాలక సంస్థదే. కానీ టీఆర్ఎస్-మజ్లిస్ నేతృత్వంలోని కార్పొరేషన్‌‌తో హైదరాబాద్ ఐటీ హబ్‌‌గా మారడం సాధ్యం కాదు. వరదలకు హైదరాబాద్‌‌లోని దాదాపు 7 లక్షల మంది ఇళ్లలో నీళ్లు చేరాయి. ప్రజలు చాలా అవస్థలు పడ్డారు. హైదరాబాద్ ప్రజలకు ఒక విజ్ఞప్తి చేస్తున్నా.. ఒక్కసారి బీజేపీని గెలిపిస్తే అన్ని అక్రమ కట్టడాలను కూల్చేస్తామని హామీ ఇస్తున్నాం. తద్వారా మళ్లీ హైదరాబాద్‌ మునగకుండా, ప్రజల ఇళ్లలో నీళ్లు చేరకుండా చేస్తామని వాగ్దానం చేస్తున్నాం’ అని అమిత్ షా పేర్కొన్నారు.

‘వరదలొచ్చినప్పుడు కేసీఆర్ ఎక్కడికెళ్లారు? ఒవైసీ ఎక్కడికెళ్లారు? ప్రజలను వాళ్లు కలవలేదు. హైదరాబాద్‌‌ను విశ్వనగరంగా మారుస్తామని మేం మాటిస్తున్నాం. వంద రోజుల్లో హైదరాబాద్‌లో మార్పు తీసుకొస్తామని కేసీఆర్‌‌ను అడుగుతున్నాం? ఐదేళ్లలో ఏం చేశారు? పేదల కోసం లక్ష ఇళ్లు కడతామన్నారు. 1,100 కంటే ఎక్కువ ఇళ్లు కట్టలేకపోయారు. 15 డంప్ యార్డులు నిర్మిస్తామన్నారు. ఒక్క డంప్ యార్డ్ బోర్డు చూపించమనండి. మోడీజీకి జనాకర్షణ పెరుగుతుందేమోనని ఆయుష్మాన్ భారత్‌‌ను ఇక్కడ అమలు చేయడం లేదు. హైదరాబాద్ మెట్రో విస్తరణ కోసం మోడీజీ రూ.16 వేల కోట్లు ఇచ్చారు. దీంతో 30 కి.మీ.ల మేర మెట్రోను విస్తరించారు. కరోనా నేపథ్యంలో మోడీజీ పీఎం స్ట్రీట్ వెండర్‌‌ను తీసుకొచ్చారు. దీని వల్ల ఎక్కువగా లబ్ధి పొందింది హైదరాబాద్ ప్రజలే’ అని అమిత్ షా పేర్కొన్నారు.