ఇవాళ( డిసెంబర్ 28) తెలంగాణకు అమిత్ షా

ఇవాళ( డిసెంబర్ 28) తెలంగాణకు అమిత్ షా
  • కొంగరకలాన్​లో లోక్ సభ ఎన్నికల సన్నాహక సమావేశం
  • క్యాడర్ కు దిశా నిర్దేశం చేయనున్న కేంద్ర హోంమంత్రి
  • నోవాటెల్ లో పార్టీ  ముఖ్య నేతలతో భేటీ
  • చార్మినార్ భాగ్యలక్ష్మి టెంపుల్ లో పూజలు 
  • షా సమక్షంలోనే బీజేపీ ఫ్లోర్ లీడర్ ఎన్నిక

హైదరాబాద్, వెలుగు: లోక్ సభ ఎన్నికలకు బీజేపీ కేడర్ ను సిద్ధం చేసేందుకు గురువారం మధ్యాహ్నం  కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాష్ట్రానికి వస్తున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం రాష్ట్రంలో విస్తృత ప్రచారం చేసిన కేంద్ర హోంమంత్రి.. ఎన్నికల తర్వాత మొదటిసారి రాష్ట్రానికి వస్తున్నారు. మార్చిలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో మెజార్టీ సీట్లను సాధించడమే లక్ష్యంగా ఆయన రాష్ట్ర టూర్ ఖరారైంది. లోక్ సభ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం బీజేపీ అగ్ర నేతలు ఒక్కో రాష్ట్రానికి ఒక్కరు పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించనున్నారు. ఇందులో భాగంగా తెలంగాణలో జరగనున్న ఎంపీ ఎన్నికలను నేరుగా అమిత్ షానే పర్యవేక్షించబోతున్నారు. అందుకే ఆయన గురువారం రాష్ట్రానికి వస్తున్నారు. తెలంగాణలో కనీసం10 లోక్ సభ సీట్లను గెలుచుకోవడంపై ఫోకస్ పెట్టారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను సమీక్షించుకున్న అమిత్ షా.. దాని ప్రకారం ఇప్పుడున్న 4 ఎంపీ సీట్లకు అదనంగా మరో 4 నుంచి 6  సీట్లను గెలుచుకోవడంపై దృష్టి పెట్టారు. అందులో భాగంగానే కొంగర కలాన్ లో మండల స్థాయి నేతలు మొదలు రాష్ట్ర స్థాయి నాయకుల వరకు మొత్తం12 వందల మందితో నిర్వహించే లోక్ సభ సన్నాహక సమావేశానికి చీఫ్ గెస్టుగా అమిత్ షా హాజరవుతున్నారు. సుమారు గంట పాటు ఆయన ఈ సమావేశంలో పాల్గొంటారు.

 బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న లోక్ సభ ఎన్నికల సన్నాహక సమావేశానికి పార్టీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఇన్​చార్జ్​గా ఉన్న ప్రకాశ్ జవదేకర్, రాష్ట్ర బీజేపీ ఇన్​చార్జ్​లు తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, సహా ఇన్​చార్జ్ అరవింద్ మీనన్, సీనియర్ నేతలు లక్ష్మణ్, డీకే అరుణ, బండి సంజయ్, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సీనియర్ నేతలు, మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయి నేతలు పాల్గొననున్నారు. లోక్ సభ ఎన్నికల్లో గెలుపుపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్న అమిత్ షా, ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల  ఫలితాలపై కూడా సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం వికసిత్ భారత్ ప్రోగ్రామ్ ను బూత్ స్థాయిలో తీసుకెళ్లడంపై, అయోధ్యలో రాముని గుడి ప్రారంభోత్సవం, సందర్శనపై ఇందులో చర్చించనున్నారు. 

షా టూర్ షెడ్యూల్ ఇదీ..

గురువారం మధ్యాహ్నం1.25 గంటలకు ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకోనున్న అమిత్ షా, సాయంత్రం 6. 50 గంటలకు తిరిగి ఢిల్లీకి వెళ్లనున్నారు. సుమారు ఆరు గంటల పాటు రాష్ట్రంలో గడపనున్నారు. మధ్యాహ్నం1. 35 గంటలకు ఎయిర్ పోర్టు నుంచి నోవాటెల్ హోటల్ కు చేరుకోగానే బీజేపీ ముఖ్య నేతలతో భేటీ అవుతారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సమీక్ష చేసి, రానున్న లోక్ సభ ఎన్నికల కోసం పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేయనున్నారు. అనంతరం అక్కడి నుంచి 3. 05 గంటలకు భాగ్యలక్ష్మి టెంపుల్ కు వెళ్లి పూజలు నిర్వహిస్తారు. 

అక్కడి నుంచి 3. 50 గంటలకు కొంగర కలాన్ చేరుకొని అక్కడ సుమారు గంటపాటు పార్టీ లోక్ సభ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొంటారు. ఆ తర్వాత సాయంత్రం 5. 40 గంటలకు నోవాటెల్ హోటల్ కు  చేరుకోనున్న అమిత్ షా.. కొత్తగా ఎన్నికైన 8 మంది పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అవుతారు. బీజేపీ శాసనసభా పక్ష నేతను అమిత్ షా సమక్షంలోనే ప్రకటించనున్నారు. నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డిని బీజేపీ పక్ష నేతగా ఎన్నుకోనున్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈయన రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నిక కాగా, బీజేపీ తరఫున మొదటిసారి ఎన్నికయ్యారు. మొత్తం 8 మంది ఎమ్మెల్యేల్లో రాజాసింగ్, మహేశ్వర్ రెడ్డి మినహా మిగిలిన ఆరుగురు మొదటిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారే. ఎల్పీ నేత ప్రకటన తర్వాత అమిత్ షా అక్కడి నుంచి సాయంత్రం 6. 50 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకొని నేరుగా ఢిల్లీకి వెళ్లనున్నారు.