బురదలో దిగబడ్డ అమ్మ ఒడి వాహనం.. అర కిలోమీటర్ ​నడిచిన బాలింత

బురదలో దిగబడ్డ  అమ్మ ఒడి వాహనం.. అర కిలోమీటర్ ​నడిచిన బాలింత
  • మెదక్ ​జిల్లా రెడ్యా తండా పరిధిలో ఘటన 
  • ట్రాక్టర్ కట్టి 102 వెహికిల్‌ ను 
  • బయటకు లాగిన  తండావాసులు

మెదక్ (శివ్వంపేట), వెలుగు : ఓ బాలింతను ఇంటికి తీసుకువెళ్తున్న అమ్మ ఒడి వాహనం బురదలో దిగబడిపోయింది. ముందుకు కదలకపోవడంతో సదరు మహిళ అర కిలోమీటర్​నడుచుకుంటూ ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. చివరకు ట్రాక్టర్ కు 102 వెహికల్​ను కట్టి బయటకు లాగారు. మెదక్ జిల్లా శివ్వంపేట మండలం రెడ్యా తండా పంచాయతీ పరిధిలోని రూప్ సింగ్ తండా కు చెందిన మంజుల ఎనిమిది రోజుల కింద మెదక్ లోని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో ఓ బిడ్డకు జన్మనిచ్చింది. మంగళవారం ఆమెను డిశ్చార్జి చేయగా అమ్మ ఒడి వెహికల్​లో ఇంటికి తీసుకొస్తున్నారు. శివ్వంపేట మండలం చెండి గోమారం మెయిన్ రోడ్ నుంచి రూప్ సింగ్ తండాకు చేరుకోవాలంటే  మూడు కిలోమీటర్ల మేర మట్టి రోడ్డుపై ప్రయాణించాలి. ఇటీవల కురిసిన వర్షాలకు ఆ రోడ్డంతా బురదమయమైంది. దీంతో 102 వెహికిల్ బురదలో దిగబడిపోయింది. డ్రైవర్ ​ఎంత ప్రయత్నించినా  ఒక్క అడుగు కూడా కదల్లేదు. దాదాపు గంటసేపు ట్రై చేసినా వెహికల్ ​ముందుకు సాగే పరిస్థితి కనిపించలేదు. దీంతో మంజులను, ఆమె వెంట ఉన్న కుటుంబసభ్యులను వాహనంలో నుంచి కిందికి దించారు. 

తర్వాత కుటుంబసభ్యులు మంజులను చెరోవైపు పట్టుకుని నెమ్మదిగా నడిపించుకుంటూ అర కిలోమీటర్ ​దూరంలోని తండాకు తీసుకువెళ్లారు. మంజులకు సిజేరియన్​ కావడంతో అర కిలోమీటర్​నడిచేసరికి నొప్పితో విలవిల్లాడిందని కుటుంబసభ్యులు తెలిపారు. చివరకు మంజుల కుటుంబసభ్యులే ట్రాక్టర్​ తెప్పించి తాడు కట్టి 102 వెహికిల్​ను బయటకు లాగారు. సరైన రోడ్డు వసతి లేక తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునే వారే లేరని తండావాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాది కింద రోడ్డు కోసం ధర్నా చేశామని, సర్పంచ్ రంగీలా రోడ్డు కోసం రాజీనామా చేయడానికి సిద్ధం కాగా, నర్సాపూర్​ ఎమ్మెల్యే మదన్ రెడ్డి రోడ్డు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చినా ఇంతవరకు నిలబెట్టుకోలేదని  మండిపడ్డారు.