పెరోల్​ మీద వచ్చి ఎంపీగా ప్రమాణం

పెరోల్​ మీద వచ్చి ఎంపీగా ప్రమాణం

న్యూఢిల్లీ: ఖలిస్తానీ ప్రచారకుడు, సిక్కు వేర్పాటువాది అమృత్​పాల్ ​సింగ్​, కాశ్మీరీ నేత షేక్​ అబ్దుల్​ రషీద్​ శుక్రవారం లోక్​సభ ఎంపీలుగా ప్రమాణం చేశారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ పార్లమెంట్​ కాంప్లెక్స్​లోని స్పీకర్​ చాంబర్​లో లాంఛనాలు పూర్తిచేశారు. లోక్​సభ ఎన్నికల్లో అమృత్​పాల్ ​సింగ్(31)  పంజాబ్​లోని ఖదూర్ ​సాహిబ్ ​నుంచి గెలవగా.. అబ్దుల్​ రషీద్(56) జమ్మూకాశ్మీర్​లోని బారాముల్లా నుంచి విజయం సాధించారు.

అమృత్​పాల్​ జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టై అస్సాంలోని దిబ్రూగఢ్ జైలులో ఖైదీగా ఉన్నాడు. ఎంపీగా ప్రమాణం చేసేందుకు అతడికి నాలుగు రోజుల పాటు బెయిల్ లభించింది. ఇంజినీర్​ రషీద్​గా ప్రసిద్ధి పొందిన షేక్​ అబ్దుల్​ రషీద్​ టెర్రర్​ ఫండింగ్ కేసులో చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద తీహార్​లో జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఇతడికి ప్రమాణ స్వీకారం కోసం ప్రయాణ సమయం మినహా కేవలం 2 గంటల పెరోల్​ మాత్రమే లభించింది. ప్రమాణం చేసిన వెంటనే అతడిని తిరిగి జైలుకు తరలించారు.