పంజ్ షీర్ ను కాపాడండి.. అమ్రుల్లా సలేహ్ వినతి

పంజ్ షీర్ ను కాపాడండి.. అమ్రుల్లా సలేహ్ వినతి
  • సెల్ ఫోన్ సిగ్నళ్లు ఆపేసి.. వసతులు అడ్డుకుని అష్టదిగ్బంధనం చేస్తున్న తాలిబన్లు
  • పంజ్ షీర్ ను కాపాడాలంటూ ఐరాసకు అమ్రుల్లా సలేహ్ వినతి
  • సెల్ ఫోన్ సిగ్నళ్లు ఆపేసి.. వసతులు అడ్డుకుని అష్టదిగ్బంధనం చేస్తున్న తాలిబన్లు
  • తాలిబన్ల ముప్పేట దాడిని తిప్పికొడుతూ తీవ్రంగా ప్రతిఘటిస్తున్న పంజ్ షీర్ పోరాట యోధులు


కాబుల్: పంజ్‌షీర్‌పై తాలిబన్లు తమ దాడిని తీవ్రతరం చేస్తుండగా, మానవతా సాయం కోసం పంజ్‌షీర్ లోయ నివాసితులు అంతర్జాతీయ సంస్థలకు  విజ్ఞప్తి చేస్తున్నాయి. తమ మాన ప్రాణాలు, కనీస హక్కులు కాపాడుకునేందుకు పోరాడుతున్న పంజ్‌షీర్‌ వాసులకు మానవతా దృక్పథంతో సహాయం చేయాలని ఐక్యరాజ్య సమితికి ఆఫ్ఘనిస్తాన్ మాజీ ఉపాధ్యక్షుడు అమృల్లా సలేహ్ కోరారు. కాబుల్ ను తాలిబన్లు ఆక్రమించిన వెంటనే ఆయన పంజ్‌షీర్‌ లోయకు వెళ్లిపోయి ఆఫ్ఘన్ల హక్కుల కోసం పోరాటం కొనసాగుతుందని, తాలిబన్లకు తలవంచేది లేదని ప్రకటించిన విషయం తెలిసిందే. పంజ్‌షీర్‌ లోనే ఉంటూ తాలిబన్ వ్యతిరేక పోరాటాలకు ఊపిరిలూదుతూ  ప్రపంచ దేశాలకు ఆఫ్ఘన్ల పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలియజేసేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. 
పంజ్‌షీర్‌ తమ ఆధీనంలోకి రావడం లేదన్న కోపంతో తాలిబన్లు దాడులు తీవ్రతరం చేస్తున్నారని.. లోయలోని మూడు జిల్లాల్లో ఆర్ధిక వనరులు, సెల్ ఫోన్ సిగ్నళ్లు నిలిపివేతతో మానవ సంక్షోభం ఏర్పడిందని అమృల్లా సలేహ్ ఆందోళన వ్యక్తం చేస్తూ సహాయం కోసం ఐక్యరాజ్య సమితికి, అంతర్జాతీయ సమాజానికి వినతులు పంపుతున్నారు. వేలాది మంది నిర్వాసితులు, స్థానిక పౌరులను రక్షించేందుకు రాజకీయ పరిష్కారం చూపాలని ఆయన అంతర్జాతీయ సమాజాన్ని కోరుతున్నారు. తాలిబన్లకు మద్దతుగా పాకిస్తాన్ ఐఎస్ఐ రంగంలోకి దిగి దాడులు ఉధృతం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. 
తాలిబన్ల భయంతో పంజ్ షీర్ ప్రావిన్స్ కు సుమారు 10 వేల మందికిపైగా తరలివచ్చి స్కూళ్లు, మసీదుల్లో తలదాచుకుంటున్నారని, ఎక్కడా ఉండే అవకాశం లేని వారు రోడ్లపైనే ఉంటూ.. ఆకలిదప్పులతో కష్టాలు ఎదుర్కొంటున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు రెండున్నర లక్షల మంది పిల్లలు, మహిళలు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారని.. ఈ పరిస్థితిని అదుపుచేయకపోతే మానవ హక్కులు హరించిపోతాయని, మారణహోమం జరిగే ప్రమాదం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నీరు, ఆహారం, వైద్య సదుపాయాలు అత్యవసరంగా అందించి ఆదుకోవాలని ఆయన ఐరాసతో పాటు అంతర్జాతీయ సమాజాన్ని కోరారు.