హైదరాబాద్ లో రియల్ భూమ్... కోకాపేటలో ఎకరం రూ.137 కోట్లు

హైదరాబాద్ లో  రియల్ భూమ్... కోకాపేటలో ఎకరం రూ.137 కోట్లు
  • నియోపోలిస్ లేఔట్​లో భూముల వేలానికి రికార్డు ధర
  • మరో ప్లాట్​లో ఎకరానికి రూ.136.50 కోట్లు
  • 2023లో జరిగిన వేలంలో ఎకరానికి రూ.100.75 కోట్లు 

హైదరాబాద్​సిటీ, వెలుగు: హెచ్ఎండీఏ అధికారులు కోకాపేటలోని నియోపోలిస్​ లేఔట్​లో రెండు ప్లాట్లకు నిర్వహించిన వేలానికి రికార్డు ధర లభించింది. ఒక ప్లాట్​లో ఎకరం రూ.137.25 కోట్లు పలకగా.. మరో ప్లాట్  ఎకరానికి 136.50 కోట్లు పలికింది. దీంతో అధికారులు ఊహించినట్టుగానే ఈసారి భూముల వేలంలో 
ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరింది.  హెచ్ఎండీఏ అధికారులు హైదరాబాద్​లోని కోకాపేట, మూసాపేట తదితర ప్రాంతాల్లోని 42 ఎకరాల భూములను ఈ–వేలంలో అమ్మకానికి పెట్టారు.

సోమవారం కోకాపేటలోని నియోపోలిస్​ లేఔట్ లో ప్లాట్​నంబర్  17(4.59  ఎకరాలు), ప్లాట్​ నంబర్ 18 (5.31 ఎకరాలు) భూములకు వేలం జరిగింది. ప్లాట్​నంబర్ 17లో ఎకరానికి రూ.136.50 కోట్లు, 18లో ఎకరానికి 137.25 కోట్లు వచ్చాయి. 2023లో జరిగిన వేలంలో సగటు ధర ఎకరానికి రూ.73 కోట్లు పలుకగా ఈసారి 87 శాతం పెరిగిందని అధికారులు తెలిపారు. రెండు నెలల క్రితం తుర్కయాంజల్, బాచుపల్లి, మేడ్చల్  తదితర ప్రాంతాల్లో నివాస, కమర్షియల్   మల్టీపర్పస్​ భూములను వేలం వేయగా పెద్దగా స్పందన రాలేదు. తాజాగా చేపట్టిన భూముల వేలానికి మాత్రం ఊహించినట్టుగానే భారీ స్పందన లభించిందని మెట్రోపాలిటన్​ డెవలప్​మెంట్​ కమిషనర్​ సర్ఫరాజ్​ అహ్మద్​ తెలిపారు. ‘‘పోటీ భారీగా ఉండడంతో  బిడ్డింగ్  మధ్యాహ్నం 4:00 గంటలకు మించి కొనసాగింది. ప్లాట్ నంబర్ 18ని  మొదటగా ఎంఎస్ఎన్​ అర్బన్  వెంచర్స్  ఎల్ఎల్​పీ  సొంతం చేసుకుంది.  వెంటనే వజ్రా హౌసింగ్  ప్రాజెక్ట్స్  ఎల్ఎల్​పీ ప్లాట్ నంబర్ 17ను దక్కించుకుంది. ఈ రెండు పార్సిల్స్​ వేలాల ద్వారా ప్రభుత్వానికి మొత్తం రూ.1,356 కోట్ల రెవెన్యూ లభించింది” అని కమిషనర్  వివరించారు.