హోం శాఖకు అ‘ధనం’  గత బడ్జెట్‌‌‌‌తో పోల్చితే ..రూ.1,719 కోట్లు ఎక్కువ

హోం శాఖకు అ‘ధనం’  గత బడ్జెట్‌‌‌‌తో పోల్చితే ..రూ.1,719 కోట్లు ఎక్కువ
  •    మొత్తం రూ.11.907 కోట్లు కేటాయింపు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: హోం శాఖకు ఈసారి బడ్జెట్​లో రూ.1,719 కోట్లు అదనంగా కేటాయించారు. గతేడాది రూ.10,188 కోట్లు కాగా.. శుక్రవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌‌‌‌లో రూ.11,907 కోట్ల కేటాయింపులు చేశారు. ఇందులో సిబ్బంది జీతభత్యాలు, ఇతర ఖర్చులు కలిపి నిర్వహణ పద్దు కింద రూ.10,944 కోట్లు, ప్రగతి పద్దు కింద రూ.963 కోట్లు అని పేర్కొన్నారు.  డీజీపీ, ఐజీలకు గత బడ్జెట్‌‌‌‌లో రూ.321.41 కోట్లు పెడితే.. ఈసారి రూ.370.08 కోట్లకు పెంచారు.

మహిళల భద్రతకు నిధులు పెంపు

రాష్ట్ర ప్రభుత్వం విమెన్ సేఫ్టీ వింగ్‌‌‌‌ సహా షీటీమ్స్‌‌‌‌, భరోసా సెంటర్ల నిర్వహణకు నిధులు పెంచింది.  మహిళా భద్రత విభాగానికి గత బడ్జెట్‌‌‌‌లో రూ.7.6 కోట్లు కేటాయించగా.. ఈసారి ఆ మొత్తం రూ.12.6 కోట్లకు పెరిగింది. షీ టీమ్స్‌‌‌‌కు గతంలో రూ.5 కోట్లు, ఇప్పుడు రూ.8.2 కోట్లు కేటాయించారు. భరోసా సెంటర్లకు గత బడ్జెట్​లో రూ.5 కోట్లు పెట్టగా.. ఈసారి రూ.7.5 కోట్లకు పెంచారు. హైదరాబాద్‌‌‌‌లో మహిళల భద్రత కోసం నిర్భయ ఫండ్‌‌‌‌ కింద చేపట్టిన సేఫ్‌‌‌‌ సిటీ ప్రాజెక్టు కోసం గత బడ్జెట్‌‌‌‌లో రూ.50 కోట్లు కేటాయించగా.. ఈసారి ఎలాంటి కేటాయింపులు జరగలేదు.

గ్రేహౌండ్స్‌‌‌‌కు రూ.6 కోట్లు

పోలీస్‌‌‌‌ అకాడమీకి సైతం నిధుల కేటాయింపు పెరిగింది. గత బడ్జెట్‌‌‌‌లో రూ.2.33 కోట్లు కేటాయించగా.. ఈ వార్షిక బడ్జెట్‌‌‌‌లో రూ.9.83 కోట్లు పెట్టారు. ఇంటిలిజెన్స్‌‌‌‌ ఐజీకి గత బడ్జెట్‌‌‌‌లో రూ.108.70 కోట్లు కేటాయిస్తే.. ఈసారి రూ.127.70 కోట్లకు పెంచారు. నూతనంగా ఏర్పడిన ఫ్యూచర్‌‌‌‌ సిటీ కమిషనరేట్‌‌‌‌ కోసం రూ.40 కోట్లు కేటాయించారు. మావోయిస్టుల ప్రభావం తగ్గినా.. గ్రేహౌండ్స్‌‌‌‌కు గతేడాది మాదిరిగానే రూ.6 కోట్లను బడ్జెట్‌‌‌‌లో పెట్టారు. అగ్నిమాపక శాఖకు గత బడ్జెట్‌‌‌‌లో రూ.26.39 కోట్లు  కేటాయించగా.. ఈసారి రూ.31.40 కోట్లకు పెంచారు.