నిరసన వ్యక్తం చేస్తున్న మహిళ జట్టుపట్టుకుని లాగిన మధ్యప్రదేశ్ పోలీసులు.. వీడియో వైరల్

నిరసన వ్యక్తం చేస్తున్న మహిళ జట్టుపట్టుకుని లాగిన మధ్యప్రదేశ్ పోలీసులు.. వీడియో వైరల్

నిరసన వ్యక్తం చేస్తోన్న ఓ మహిళను మహిళా పోలీసులు జట్టుపట్టుకుని ఈడ్చుకెళ్లిన ఘటన మధ్యప్రదేశ్ లో కలకలం రేపుతోంది. ఈ ఘటనపై అన్ని వర్గాల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు రావడంతో పోలీసు ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. 

అసలేం జరిగిందంటే..?

మధ్యప్రదేశ్‌లోని కత్నీ జిల్లా పరిధిలోని కౌరియా గ్రామంలో చైన బాయి కాచీ అనే మహిళకు సంబంధించిన భూమిలో విద్యుత్ స్తంభం ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగానే ఆమె స్థలంలో స్తంభం ఏర్పాటుకు ఏర్పాట్లు చేస్తుండగా.. కాచీ అడ్డుపడింది. తమ పొలంలో విద్యుత్తు స్తంభం ఏర్పాటు చేస్తున్నందుకు ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి పరిహారం అందలేదని నిరసన చేపట్టింది. కుటుంబ సభ్యులతో కలిసితో విద్యుత్ స్తంభం ఏర్పాటును వ్యతిరేకించింది.  బుల్‌డోజర్‌ తో పనులు చేపట్టేందుకు ప్రయత్నిస్తుండగా.. నిరసన చేపట్టింది. దీంతో పోలీసులు ఆమెను చుట్టుముట్టి.. బలవంతంగా అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. అంతకు ముందు మహిళకు సంబంధించిన నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. 

కొందరు మహిళా పోలీసులు అక్కడి నుంచి బలవంతంగా తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఆమె జుట్టుపట్టుకొని ఈడ్చుకెళ్లారు. ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌ గా మారడంతో పోలీసుశాఖ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.

ఈ వీడియోపై పోలీసు ఉన్నతాధికారి మనోజ్ కేడియా స్పందించారు. విద్యుత్ స్తంభం ఏర్పాటు చేయనీయకుండా అడ్డుపడుతుండడం వల్లే.. చైన బాయి కాచీని  ముందస్తుగా మహిళా పోలీసులు అదుపులోకి తీసుకున్నారని చెప్పారు మనోజ్ కేడియా. తమ సిబ్బంది సదరు మహిళను కొట్టలేదని, తాము నిబంధనల ప్రకారమే వ్యవహరించామన్నారు. ఆ వీడియో పాతదని చెప్పారు. కానీ.. ఎప్పటిదో మాత్రం చెప్పలేదు. 

బాధిత మహిళ తమ లాయర్‌తో కలిసి జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది. విద్యుత్ అధికారులు, రెవెన్యూ సిబ్బంది, పోలీసులతో కుమ్మక్కై కాంట్రాక్టర్లు తమ భూమిని కబ్జా చేయాలని చూస్తున్నారని ఆరోపించింది. తనపై దాడి చేసిన మహిళా కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకోవాలని కోరింది.