
- సముద్రంలో చిక్కుకున్న సెయిలర్లను కాపడిన నేవీ లెఫ్టినెంట్ కమాండర్
- సబ్‌మెరీన్‌ను రిపేర్ చేస్తుండగా అలల దెబ్బకు పడిపోయిన ముగ్గురు సిబ్బంది
అరేబియా సముద్రం.. ముంబై నుంచి 220 కిలోమీటర్ల దూరం.. 2010 ఆగస్టు 30.. పొద్దున 6.55 గంటలు.. అప్పుడే సూర్యుడు వస్తున్నాడు. కానీ సముద్రం కల్లోలంగా ఉంది. అలల దెబ్బకు సబ్‌మెరీన్ ఐఎన్‌ఎస్ శంఖుష్ అటూ ఇటూ భయంకరంగా కదులుతోంది. దానికి నాయకత్వం వహిస్తున్న లెఫ్టినెంట్ కమాండర్ ఫిర్దౌస్ మొఘల్‌కు ప్రాబ్లమ్ అర్థమైంది. సబ్‌మెరీన్ ఎలక్ట్రిక్ బ్యాటరీల నుంచి వచ్చే విష పదార్థాలను విడుదల చేసే ఎగ్జాస్ట్ వాల్వ్ పని చేయడం ఆగిపోయిందని తెలిసింది. దాన్ని రిపేర్ చేయకపోతే అందులోని వారంతా చనిపోతారు. ముగ్గురు సెయిలర్లను దాన్ని బాగు చేయించడానికి పంపారు. వాళ్లు 15 నిమిషాలు తండ్లాడి దాన్ని రిపేర్ చేశారు. తర్వాత లోపలికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. కానీ.. ఒక్కసారిగా పెద్ద శబ్దంతో అలలొచ్చి వాళ్లను ఢీకొట్టాయి. ముగ్గురూ చెల్లాచెదురయ్యారు. సముద్రంలో పడిపోయారు. ఇంతలో ఇంకో వ్యక్తి కూడా కేసింగ్ దగ్గరకెళ్లారు. తననూ అలలు కొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. కాళ్లకు బాగా దెబ్బ తగిలింది. రక్తం కారుతున్నా సబ్‌మెరీన్‌ను గట్టిగా పట్టుకున్నాడు. వాచ్ టవర్ నుంచి ఇదంతా ఫిర్దౌస్ చూశారు. వెంటనే సబ్‌మెరీన్ కేసింగ్ దగ్గరకెళ్లారు. గాయపడిన సెయిలర్‌ను కాపాడేందుకు ఫిర్దౌస్ చాలా కష్టపడ్డారు. ఎలాగొలా ఆయన్ను లాగి చికిత్స కోసం కనెక్టింగ్ రూమ్‌కు తీసుకెళ్లారు. మరో ముగ్గురు నీళ్లలో ఉన్నారు. సబ్‌మెరీన్‌కు 100 మీటర్ల దూరంలో ఉన్నారు. మరో ఇద్దరు డైవర్లతో కలిసి సముద్రంలోకి ఫిర్దౌస్ దూకారు. సబ్‌మెరీన్‌ను ఆ ముగ్గురి వైపు తీసుకెళ్లారు. అయితే, అప్పటికే అలల తాకిడికి వాళ్లు మరో 200 మీటర్ల దూరం పోయారు. సబ్‌మెరీన్‌లో ఉన్న కమాండర్ మురళి ఎలాగోలా వాళ్ల వద్దకు సబ్‌మెరీన్‌ను తీసుకెళ్లారు. ముగ్గురినీ కాపాడారు.
ఫిర్దాస్ తలకు గాయం
సబ్‌మెరీన్ వాళ్ల దగ్గరకొచ్చాక ఇద్దరు డైవర్లను లోపలికి వెళ్లాల్సిందిగా డైవర్లకు చెప్పారు. ఇంతలోనే పెద్ద అల వచ్చేసరికి మళ్లీ వాళ్లు దూరంగా వెళ్లిపోయారు. ఇక లాభం లేదనుకొని ఫిర్దౌస్ ఓ తాడుతో డైవర్ల వైపు వెళ్లారు. వాళ్ల దగ్గరకు చేరుకుని సబ్‌మెరీన్ వైపు తీసుకొచ్చారు. తనపై ఎక్కి సబ్‌మెరీన్‌ను లోపలికి వెళ్లమన్నారు. వాళ్లు తటపటాయించారు. గట్టిగా అరిచే సరికి ఎక్కేశారు. చివరిగా ఆయన సబ్‌మెరీన్ లోపలికి వెళ్లబోతుండగా అలల దెబ్బకు సబ్‌మెరీన్ ఆయన తలకు గట్టిగా తగిలింది. మురళికి ఏం చేయాలో అర్థం కాలేదు. ముంబైలోని ఐఎన్‌ఎస్ శిక్ర హెలికాప్టర్‌కు సమాచారమిచ్చారు. ఉదయం 9.15 ఫిర్దౌస్‌ను కాపాడారు. సాయంత్రం 7 గంటలకు సబ్‌మెరీన్ హార్బర్‌కు చేరుకుంది. ఫిర్దౌస్ ధైర్య సాహసాలకు ప్రభుత్వం శౌర్య చక్ర అవార్డు ఇచ్చింది.