శరీరంలో చుక్క రక్తం లేకుండా పీల్చేసే జీవి

శరీరంలో చుక్క రక్తం లేకుండా పీల్చేసే జీవి

జంతువులను, మనుషులను చంపి తినే క్రూరమైన జంతువుల గురించి విన్నాం. కానీ.. జంతువు బతికి ఉండగానే శరీరంలో చుక్క రక్తం లేకుండా పీల్చేసే జీవి గురించి మీకు తెలుసా? అవును అమెరికాలోని చాలా ప్రాంతాల్లో ఇలాంటి జీవి తిరుగుతోందట. కాకపోతే.. అది ఏ జాతికి చెందింది? ఏ ప్రాంతం నుంచి వచ్చింది? అనేది ఇప్పటికీ మిస్టరీనే. కొందరేమో అది గ్రహాంతరవాసి అంటారు. మరి కొందరు పారానార్మల్‌‌‌‌‌‌‌‌ పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అంటారు. ఇలా.. అనేక సిద్ధాంతాలు పుట్టుకొచ్చాయి. దాని పుట్టుపూర్వోత్తరాలు మాత్రం తెలియలేదు. 

అది 1995 మార్చి నెల. నార్త్‌‌‌‌‌‌‌‌ అమెరికాలోని పోర్టోరికోలో ఒక రైతుకు చెందిన ఎనిమిది మేకలు చనిపోయాయి. ప్రతి మేకకు మెడ దగ్గర మూడు రంధ్రాలు ఉన్నాయి. మరెక్కడా గాయాలు కాలేదు. దాన్ని చంపిన జీవి మాంసం ముట్టుకోకుండా... శరీరంలో రక్తాన్ని చుక్క లేకుండా తాగేసింది. అప్పటివరకు మనకు తెలిసిన ఏ జంతువూ అలా రక్తాన్ని పీల్చలేదు. దాంతో వాటిని ఏ జీవి చంపిందనే ప్రశ్నకు జవాబు దొరకలేదు. ఇలా జరిగిన కొన్ని నెలలకు పోర్టోరికో పట్టణంలోనే మడేలిన్ టోలెంటినో అనే మహిళ ఒక వింత జీవిని చూసినట్టు చెప్పింది. దాని పళ్లు చాలా పదునుగా ఉన్నాయి. చూడ్డానికి కుక్కలా కనిపిస్తుంది. కానీ.. ఆకారంలో కొన్ని తేడాలు ఉన్నాయి. వెన్ను ఎముకలు బయటకు కనిపిస్తున్నాయి. కళ్లు ఎర్రగా మెరుస్తున్నాయి. అలాంటి జీవిని అప్పటివరకు ఆ ప్రాంతంలో ఆమెతోపాటు ఎవరూ చూడలేదు. ఆ జంతువును చూసిన కొన్ని రోజుల్లోనే ఆ ప్రాంతంలో దాదాపు 150  జంతువులు చనిపోయాయి. అన్నింటికి మెడ దగ్గర మూడు రంధ్రాలు ఉన్నాయి. శరీరంలో రక్తం లేదు. అయితే.. పోర్టోరికోలో జరిగినట్లే అర్జెంటీనా, బొలీవియా, బ్రెజిల్, చిలీ, కొలంబియా, డొమినికన్ రిపబ్లిక్, ఎల్ సాల్వడార్, హోండురాస్, మెక్సికో, నికరాగ్వా, పనామా, పెరూ,  ఫిలిప్పీన్స్‌‌‌‌‌‌‌‌ల్లో కూడా జరిగింది. అక్కడ కూడా ఇలా చాలా జంతువులు చనిపోయాయి.
 
చుపకాబ్రా
ఎక్కువ జంతువులు చనిపోతుండడంతో అందుకు కారణాలు తెలుసుకోవాలని చాలామంది ప్రయత్నించారు. చివరకు మడేలిన్ టోలెంటినో చూసిన ఆ వింత జీవే వీటన్నింటినీ చంపిందని తేల్చారు. అన్నింటినీ రక్తం పీల్చి చంపుతుండడంతో దీన్ని ‘చుపకాబ్రా’ అని పిలుస్తున్నారు. ఇది స్పానిష్ భాష నుంచి వచ్చిన పదం. దీనికి ‘గోట్ సక్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’(మేకను పీల్చేది) అని అర్థం. ఇలాంటి జీవి గురించి అమెరికాలోని కొన్ని ప్రాంతాల జానపద కథల్లో కూడా ఉంది. అంతేకాదు ఇది చాలా దేశాల్లో కనిపించింది. కాకపోతే ఒక్కో చోట ఒక్కో విధంగా కనిపించిందని చూసినవాళ్లు చెప్పారు. యునైటెడ్ స్టేట్స్‌‌‌‌‌‌‌‌లోని నైరుతి ప్రాంతంలో కుక్క ఆకారంలో కనిపించింది.  పోర్టోరికో, లాటిన్ అమెరికాలో గ్రహాంతరవాసిలా కనిపించింది. కొన్ని దేశాల్లో చిన్న ఎలుగుబంటిలా ఉందని చెప్పారు. కానీ.. వీటన్నింటికీ కొన్ని దగ్గరి పోలికలు ఉన్నాయి. చాలామంది ఈ జీవిని చూశామని చెప్పినా సాక్ష్యాలు చూపించలేకపోయారు. అంటే దాని ఫొటో, వీడియో ఇప్పటికీ  అందుబాటులో లేదు. 

మన దగ్గర కూడా.. 
2018 అక్టోబరు, డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మనదేశంలోని మణిపూర్‌‌‌‌‌‌‌‌లో కూడా చుపకాబ్రా ఉన్నట్లు పుకార్లు వినిపించాయి. ఈ ప్రాంతంలో  చాలా పెట్స్‌‌‌‌‌‌‌‌,  పౌల్ట్రీల్లో కోళ్లు రక్తం పీల్చడం వల్ల చనిపోయాయి. అంతేకాకుండా కొందరు చుపకాబ్రాలను చూసినట్టు కూడా చెప్పారు. అయితే.. చనిపోయిన జంతువుల కళేబరాలపై రీసెర్చ్‌‌‌‌‌‌‌‌ చేసిన ఫోరెన్సిక్‌‌‌‌‌‌‌‌ ఎక్స్‌‌‌‌‌‌‌‌పర్ట్స్‌‌‌‌‌‌‌‌.. వాటిని వీధి కుక్కలే చంపాయని చెప్పారు.

గ్రహాంతరవాసులు
ప్రపంచంలో ఎక్కడ వింత విషయం గురించి తెలిసినా.. దాన్ని గ్రహాంతరవాసులతో ముడిపెట్టడం అలవాటైపోయింది. అలాగే చుపకాబ్రాలను కూడా ఏలియన్స్‌‌‌‌‌‌‌‌తో లింక్‌‌‌‌‌‌‌‌ పెట్టి కొత్త ఫిలాసఫీ క్రియేట్‌‌‌‌‌‌‌‌ చేశారు. చాలామంది ఇవి అసలు జంతువులే కావని, ఇలాంటి వాటిని మునుపెన్నడూ చూడలేదని చెప్పారు. అవి ఎక్కడి నుంచి వచ్చాయనే ప్రశ్న తలెత్తినప్పుడు అవి ఇతర గ్రహాల నుంచి వచ్చిన జీవులని చెప్తున్నారు. 

అసలు ఉన్నాయా? 
బెంజమిన్ రాడ్‌‌‌‌‌‌‌‌ఫోర్డ్ అనే రీసెర్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వీటిపై ఐదేండ్లు స్టడీ చేశాడు. ఆయన తెలుసుకున్న విషయాలను 2011లో ‘ట్రాకింగ్ ది చుపకాబ్రా’ అనే పుస్తకంలో రాశాడు. ఆయన చెప్పిన దాని ప్రకారం.. పోర్టోరికోలోని చుపకాబ్రను ప్రత్యక్షంగా చూసిన మాడెలిన్ టోలెంటినో 1995లో వచ్చిన సైన్స్- ఫిక్షన్ హార్రర్ ఫిల్మ్ ‘స్పీసీస్‌‌‌‌‌‌‌‌’లోని సిల్ జీవిలా ఉందని చెప్పింది. ఆ సినిమాలో  సిల్ గ్రహాంతర జీవి. ఈమెతో పాటు దాన్ని చూశామని చెప్పినవాళ్లు చాలామంది దానికి దగ్గరి పోలికలతోనే చెప్పారు. అయితే.. టోలెంటినో ఈ జంతువును చూడకముందే ‘స్పీసీస్‌‌‌‌‌‌‌‌’ సినిమా చూసింది. దాంతో ఆ సినిమా చూడడం వల్లే ఇలా చెప్పి ఉంటుందని బెంజమిన్ అన్నాడు. అసలు చుపకాబ్రా అనే జీవే లేదని ఆయన రిపోర్ట్‌‌‌‌‌‌‌‌లో రాశాడు. టోలెంటినో తను చూసిన ప్రతి విషయాన్ని బలంగా నమ్ముతుంది. అలాగే సినిమాలోని జీవి రియల్‌‌‌‌‌‌‌‌ లైఫ్‌‌‌‌‌‌‌‌లో కూడా ఉందని నమ్మి, ఏదో జంతువును చూసి చుపకాబ్రాగా భ్రమపడి ఉండొచ్చన్నాడు ఆయన. జంతువుల రక్తం పీల్చడంపై కూడా ఆయన క్లారిటీ ఇచ్చేందుకు ట్రై చేశాడు. చనిపోయిన మేకల శవ పరీక్షల్లో వాటి రక్తం పీల్చడం వల్లే చనిపోయాయని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు దొరకలేదు. కాబట్టి వాటిని ఆ చుట్టుపక్కల ఉన్న ఏవో జంతువులు  చంపి ఉంటాయని చెప్పాడు. కానీ.. బెంజమిన్ రిపోర్ట్‌‌‌‌‌‌‌‌ను కూడా చాలామంది నమ్మడంలేదు. 

సార్కోప్టెస్ స్కేబీ
అక్టోబర్ 2010లో మిషిగన్ యూనివర్సిటీకి చెందిన బయాలజిస్ట్‌‌‌‌‌‌‌‌ ‘బారీ ఓ కానర్’ దీనిపై రీసెర్చ్‌‌‌‌‌‌‌‌ చేసి ఒక రిపోర్ట్‌‌‌‌‌‌‌‌ ఇచ్చాడు. చుపకాబ్రా అనే జీవి ఉందని చెప్పడానికి అసలు ఆధారాలే లేవని ఆయన చెప్పాడు. కాకపోతే.. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో వాటిని చూశామని చెప్పినవాళ్లు.. నక్కలను చూసి భ్రమపడ్డారని చెప్పాడు. కాకపోతే ఆ నక్కలకు ‘సార్కోప్టెస్ స్కేబీ’ అనే ప్యారాసైట్ వల్ల వ్యాధి సోకడంతో అలా కనిపించాయని ఆయన తేల్చాడు. నక్కలకు ఈ వ్యాధి వస్తే అవి చుపకాబ్రాల్లా కనిపిస్తాయని చెప్పాడాయన. వ్యాధి సోకితే.. బొచ్చు ఊడిపోయి, చర్మం మందంగా కనిపిస్తుంది. అవే మేకలపై దాడులు చేసి ఉండొచ్చని ఓ’కానర్ చెప్పాడు. కానీ..వాటిని చూసినవాళ్లు మాత్రం అవి నక్కల్లా లేవని వాదిస్తున్నారు.

ఎలా ఉంటుంది? 
చుపకాబ్రాను చూసినవాళ్లలో చాలామంది దాని శరీరంపై పొలుసులు ఉన్నాయని చెప్పారు. కొందరు ఆకుపచ్చ, మరికొందరు బూడిద రంగు చర్మం ఉందని చెప్పారు. దాని వెన్నెముకలు బయటకు తేలి, చాలా పదునుగా ఉన్నాయట. దాని ఎత్తు సుమారు 3 నుంచి 4 అడుగులు ఉంటుంది. కంగారులా నిలబడుతుంది. చాలా వేగంగా పరిగెత్తగలదు. దట్టమైన అడవుల్లో ఉంటుంది. తిండి(రక్తం) దొరకనప్పుడే అడవుల నుంచి బయటికి వస్తుంది. వెంట్రుకలు చాలా తక్కువగా ఉంటాయి. కోర పళ్లు ఉంటాయి. సింహంలా పంజా విసరగలదు. ఎంతటి జంతువునైనా సులభంగా వేటాడగల కెపాసిటీ ఉంటుంది. జంతువుకు త్రిభుజాకారంలో మూడు రంధ్రాలు చేసి వాటి ద్వారా రక్తాన్ని పీలుస్తుంది. కొన్నిసార్లు ఒకటి, రెండు రంధ్రాలు కూడా చేస్తుంది. చుపకాబ్రాలకు అసలు మరణమే ఉండదని చాలామంది నమ్ముతున్నారు. అవి రక్తం తాగుతున్నన్ని రోజులు బతికే ఉంటాయని చెప్తుంటారు. అంతేకాకుండా ఇవి కేవలం రక్తం మాత్రమే తాగుతాయని నమ్ముతారు.

::: కరుణాకర్​ మానెగాళ్ల