అదుపుతప్పిన ట్రాక్టర్.. దూసుకెళ్లి స్కూటీని ఢీకొన్న ట్రాలీ

అదుపుతప్పిన ట్రాక్టర్.. దూసుకెళ్లి స్కూటీని ఢీకొన్న ట్రాలీ

స్కూటీపై వెళ్తున్న తల్లితోపాటు ఇద్దరు బిడ్డలు మృతి

చిత్తూరు: చిత్తూరు జిల్లాలో అదుపు తప్పిన ట్రాక్టర్ భీబత్సం సృష్టించింది. ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడగా.. దాని నుండి  ఊడిపడిన ట్రాలీ.. వేగంగా వెళ్లి స్కూటీని ఢీకొట్టి పల్టీలు కొడుతూ రోడ్డు పక్కగా పడిపోయింది. దీంతో స్కూటీపై తన ఇద్దరు బిడ్డలతో కలసి వెళ్తున్న మహిళ ఎగిరిపడింది. తల్లీ కుమారులు ఘటనా స్థలంలోనే చనిపోయారు. విషాదం రేపిన ఘటన చిత్తూరు జిల్లా బకరాపేట ఘాట్ రోడ్డు పై జరిగింది.

ఎస్ఐ ఎం. రవి నాయక్ తెలిపిన వివరాల మేరకు.. చిత్తూరు జిల్లా బాకరాపేట ఘాట్ రోడ్ లో ట్రాక్టర్ టాలీ ఊడి ఎదురుగా స్కూటీలో వస్తున్న తల్లీ బిడ్డల పైకి దూసుకెల్లిందన్న సమాచారంతో పోలీసులు వెంటనే స్పందించారు. స్కూటీపై వెళ్తున్న తల్లి, కుమారుడు అక్కడికక్కడే చనిపోవడంతో.. తీవ్ర రక్తగాయాలతో కొట్టుమిట్టాడుతున్న 12 ఏళ్ల  కుమార్తె ను తిరుపతి  రుయాకు తరలించారు. అప్పిటికే తీవ్ర రక్త స్రావం కావడంతో చికిత్స ఫలించక మృతి చెందింది.

చిత్తూరు జిల్లా యాదమరి మండలం 184 గొల్లపల్లి కి చెందిన పి దేవేంద్ర కుమార్ భార్య పి.జమున(30) తన కుమార్తె మీనాక్షి (12),కుమారుడు దీపక్ కుమార్ (8)లతో స్కూటీలో ఐతేపల్లి నుంచి చిన్నగొటిఘల్లు మండలం బాకరాపేటకు వస్తుండగా ప్రమాదం జరిగింది.  శ్రీకాళహస్తి కి చెందిన ట్రాక్టర్ నెల్లూరు జిల్లా నాయుడుపేట నుండి గడ్డిని తీసుకుని వాల్మీకిపురం మండలం చింతపర్తి పరిసర ప్రాంతాల్లో దింపి తిరిగి శ్రీకాళహస్తి కి బయలుదేరింది. మార్గం మధ్యలో బాకరాపేట వద్ద ఘాట్లో ట్రాక్టర్ అదుపుతప్పింది.  ట్రాలీ వేరుపడి ఎదురుగా స్కూటీ పై వస్తున్న తల్లి బిడ్డలపైకి దూసుకెళ్లడంతో జమున, దీపక్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. మీనాక్షిని తిరుపతి రుయా కు తరలించగా చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందారు. పీలేరు రూరల్ సిఐ మురళీకృష్ణ సంఘటన స్థలాన్ని పరిశీలించి ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు.