విశ్లేషణ: ధరణి ఏర్పాటు వెనుక రహస్య అజెండా

విశ్లేషణ: ధరణి ఏర్పాటు వెనుక రహస్య అజెండా

ధరణి పోర్టల్ ఏర్పాటుతో పాత భూ సమస్యలు పరిష్కారం కాకపోగా కొత్త రకం సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ధరణి సమస్యలు, సాంకేతిక లోపాలు, వాటిని పరిష్కరించడంలో జాప్యం, రైతుల అర్జీలపై నిర్లక్ష్యం వహిస్తున్న తీరు చూస్తుంటే దీనిని ఏర్పాటు చేయడంలో సీఎం కేసీఆర్​కు ఒక రహస్య ఎజెండా ఉందనే విషయం స్పష్టమవుతున్నది. కబ్జాదారు/కాస్తు కాలం తీసివేయడం, రాత పూర్వకంగా ఉన్న రికార్డులు లేకుండా చేయడం వల్ల, భూ పోరాటాల ద్వారా సాధించుకున్న భూములన్నీ పోయాయి. వాటిల్లో వ్యవసాయం చేసుకుంటున్న చిన్న, సన్నకారు రైతులకు భూమి హక్కు లేకుండా పోయింది. రాష్ట్రంలో ఆధునిక భూస్వామ్య వ్యవస్థకు తెర లేపిన ఘనత కేసీఆర్​కే దక్కుతుంది.

ధరణి పోర్టల్​తో రెవెన్యూ శాఖలో అవినీతి తగ్గుతుందని, రైతుల భూహక్కు పత్రాలు పక్కాగా ఇస్తామని, వాటిని తీసుకోవడానికి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదని సీఎం కేసీఆర్​ప్రకటించారు. ఆయన మాటలు విన్న రైతులు.. ఇక తమ సమస్యలు తీరినట్లేనని అనుకున్నారు. కానీ మొట్టమొదటి అడుగులోనే మోసపోయిన వాస్తవాన్ని వారు గ్రహించారు. 2018 మే నెలలో కరీంనగర్ జిల్లాలో మొదలుపెట్టిన కొత్త పాసు పుస్తకాల పంపిణీ లక్షల మందికి నిరాశ మిగిల్చింది. అనేక మందికి ఇప్పటికీ కొత్త పాసు పుస్తకాలు చేరనే లేదు. కలెక్టర్లకు కుప్పలు తెప్పలుగా అర్జీలు వచ్చినా.. ఫలితం మాత్రం శూన్యం. ఇంకా వేలాది మంది రైతులు కొత్త పాసు పుస్తకం రాక తీవ్ర మనోవేదనకు గురవుతూనే ఉన్నారు. తెలంగాణ రెవెన్యూ వ్యవస్థలో ఒక మంచి పద్ధతి ఉండేది. నిజాం కాలం నుంచి రాష్ట్రం ఏర్పాటు వరకు రెవెన్యూ చట్టాల్లో భూమి హక్కును పటిష్టం చేయడానికి రాష్ట్రమంతటా రెవెన్యూ సదస్సులు నిర్వహించేవారు. గతంలో గ్రామ గ్రామాన నిర్వహించి సుమారు ఆరు లక్షల ముప్పై నాలుగు వేల ఎకరాలకు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేశారు. సాదా బైనామాలు కూడా ఎక్కువ మొత్తంలో పరిష్కారమయ్యాయి. ఎవరికీ డబ్బులు ఇచ్చే అవసరం రాలేదు. రైతులు ఎక్కడికీ తిరిగే అవసరం లేని ఈ పద్ధతి కాదని, ఆధునిక సాంకేతిక పరిష్కారం పేరిట ధరణి తీసుకురావడంతో భూసమస్యలు మరింత జటిలమయ్యాయి. 
సమస్య చెప్పుకునే అవకాశం లేదా?
భూమి హక్కుల విషయంలో భారత న్యాయవ్యవస్థ అనేక సార్లు ప్రభుత్వాలను మందలించింది. ఐక్యరాజ్య సమితి 2018 డిసెంబర్17 న సర్వప్రతినిధి సభ ఆమోదించిన తీర్మానంలో కూడా గ్రామంలో సేద్యం చేస్తున్న రైతుకు భూమి హక్కు ఉండాలని, వ్యవసాయ కూలికి పని హక్కు ఉండాలని తీర్మానం చేసింది. అయితే రాష్ట్రంలో మాత్రం ధరణి పోర్టల్ వల్ల భూమి హక్కు హరించుకుపోతోంది. ధరణి ఏర్పాటు చేసి నాలుగేండ్లు అయినా కూడా, దాదాపు 24 లక్షల ఎకరాల భూమి ధరణి సాంకేతిక రికార్డు వ్యవస్థలో నమోదు కాలేదు.

రెవెన్యూ చట్టం క్లాజు ‘22 ఏ’ కింద లక్షల ఎకరాలు భూములను చేర్చి రైతుల హక్కులకు భంగం కలిగిస్తున్నది కేసీఆర్​ప్రభుత్వ యంత్రాంగం. భూసేకరణ చట్టం అమలు చేయకుండా ఈ సెక్షన్ వాడుకుని రైతులను ఒత్తిడికి గురి చేస్తోంది. ధరణి వచ్చిన తర్వాత తగ్గాల్సిన అవినీతి అనేక రెట్లు పెరిగిపోయింది. సామాన్య రైతు తమ గోడు వెళ్లబోసుకునే అవకాశం కూడా లేకుండా చేసిందీ ధరణి పోర్టల్. గత నాలుగేండ్లుగా భూమి హక్కు కలిగి ఉండి కూడా సన్న, చిన్నకారు, దళిత, బలహీన వర్గాల రైతులకు కొత్త పాసు పుస్తకాలు రాకపోవడం అత్యంత దారుణం. 
మాజీ సైనికుల భూములు..
దేశానికి చేసిన సేవలను గుర్తించి మాజీ సైనికులకు, ఫ్రీడం ఫైటర్స్​కు కాంగ్రెస్​ ప్రభుత్వం గతంలో అసైన్డ్ చేసిన భూములకు టీఆర్ఎస్ ​సర్కారు రెడ్ మార్క్ పెట్టింది. వారి భూములన్నింటినీ ధరణిలో నిషేధిత ఆస్తులుగా చూపెడుతోంది. దీంతో వారు వాటిని అమ్ముకోకుండా.. వారసులకు ఇచ్చుకోకుండా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మాజీ సైనికులు, ఫ్రీడం ఫైటర్లకు చెందిన 2 లక్షల ఎకరాలను నిషేధిత జాబితాలో పెట్టి ఇబ్బందులకు గురి చేస్తోంది. దేశం కోసం పని చేసిన తమకు ఈ ప్రభుత్వమిచ్చే బహుమతి ఇదేనా. 
ఎక్కువ తక్కువలు..
కొన్ని సర్వే నంబర్లలో మొత్తం భూవిస్తీర్ణం ఎక్కువ  లేదా తక్కువగా నమోదైంది. ఇలాంటి సర్వే నంబర్లలోని ఎక్కువ, తక్కువలను సేత్వార్, ఖాస్రా పహణీల ఆధారంగా సరి చేయడానికి ధరణిలో ప్రస్తుతం ఆప్షన్​ లేదు. బేస్​సర్వే నంబర్​లోని మొత్తం భూ విస్తీర్ణాన్ని సరిదిద్దేందుకు ఆప్షన్​ఇవ్వాల్సి ఉంది. సర్వే నంబర్ లో ఉన్న భూమి కంటే ఎక్కువగానో లేదా తక్కువగానో పేర్కొంటూ  రైతుల పేరిట పట్టా పాస్​ పుస్తకాలు జారీ అయ్యాయి. బై నంబర్లు వేసి పాస్​ బుక్స్​ ఇచ్చారు. బేస్​ సర్వే నంబర్​లోని మొత్తం విస్తీర్ణం ఆధారంగా ఇలాంటి తప్పులను సరి చేయాలి.
నష్టపోతున్న రైతులు..
ప్రభుత్వం చర్యలతో రైతులు భూ హక్కు కోల్పోయి అనేక రకాలుగా నష్టపోతున్నారు. రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలకు దూరం అవుతున్నారు. పంట రుణాలు కూడా సరిగా రావడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న వివిధ రకాల సబ్సిడీలు అందడం లేదు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో పండించిన పంటను కూడా అమ్ముకునే అవకాశం లేకుండా పోతోంది. చివరకు పిల్లల పెళ్లిళ్ల కోసం, పైచదువుల కోసం తన సొంత భూమిని అమ్ముకుందామంటే కూడా అమ్ముకోలేని దయనీయ పరిస్థితి నెలకొంది. పట్టా పాసు పుస్తకాలు అందక అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కుటుంబాలు విచ్చిన్నం అవుతున్నయి. పేదరికం పెరుగుతున్నది. సామాన్యుడు భూమి హక్కు కోల్పోయి స్థిరాస్తికి దూరం అవుతున్నాడు. పాసు పుస్తకం రాని రైతు మండల రెవెన్యూ అధికారిపై పెట్రోలు పోసిన దుస్థితి చూశాం. భూమి కోసం తగాదాలు పెరుగుతున్నాయి.
ధరణి వ్యవస్థను సమీక్షించాలె..
ప్రభుత్వం వెంటనే ధరణి వ్యవస్థను పారదర్శకంగా సమీక్షించి నిపుణుల సంప్రదింపుల తర్వాత ప్రజాభిప్రాయ సేకరణ ఆధారంగా సమూలంగా మార్చాలి. రెవెన్యూ చట్టంలో క్లాజు ‘22ఏ’ లో చేర్చిన రైతుల భూములను నిషేధిత జాబితా నుంచి తక్షణమే తొలగించాలి. రెవెన్యూ సదస్సుల నిర్వహణ ద్వారా ప్రతి గ్రామంలో తలెత్తిన భూమి సమస్యలను ఎక్కడికక్కడ పరిష్కరించాలి. కేంద్ర ప్రభుత్వం ఇదివరకు ఇచ్చిన రూ.80 కోట్ల నిధులను వినియోగించుకుంటూ, ఇంకా అవసరమైన నిధులు సేకరించి భూ సర్వే చే పట్టాలి.  రెవెన్యూ వ్యవస్థలో అవినీతి పోవాలంటే దస్తావేజులు, రిజిస్ట్రేషన్లు, ధరణి వంటి చర్యల్లో పారదర్శక పద్ధతులు తీసుకురావాలి. గ్రామ స్థాయిలో రెవెన్యూ సహాయకులను నియమించాలి. గ్రామ స్థాయి రికార్డు వ్యవస్థలను బలోపేతం చేయాలి. అప్పుడే రైతులకు కష్టాలు తప్పుతాయి. -కోదండరెడ్డి, ఉపాధ్యక్షుడు, ఆలిండియా కిసాన్ కాంగ్రెస్