V6 News

సీఎం విజన్‌‌‌‌కు ఫిదా అయ్యా : ఆనంద్ మహీంద్రా

సీఎం విజన్‌‌‌‌కు ఫిదా అయ్యా : ఆనంద్ మహీంద్రా
  • విజన్ డాక్యుమెంట్ చూసి ఆశ్చర్యపోయా: ఆనంద్ మహీంద్రా కితాబు
  • జనం ఆకాంక్షలకు అనుగుణంగా రూపొందించారు 
  • సీఎం రేవంత్ గొప్ప నెగోషియేటర్ అని ప్రశంస 

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ విజన్ డాక్యుమెంట్ అద్భుతంగా ఉందని ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా ప్రశంసించారు. ‘‘ఈ విజన్ డాక్యుమెంట్ చూసి ఆశ్చర్యపోయాను.

నేను ప్రపంచవ్యాప్తంగా చూసిన అత్యంత ఆశావహమైన, ప్రజల కేంద్రంగా రూపొందించిన విజన్ డాక్యుమెంట్లలో ఇదొకటి. దీని గొప్పతనం కేవలం దాని లక్ష్యాల్లోనే కాదు.. దాని పునాదిలోనూ ఉంది. ఇది ఎవరో నలుగురు రాసింది కాదు.. ప్రజలతో, నిపుణులతో విస్తృతంగా చర్చించి.. వారి ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా రూపొందించారు. ప్రజలు తమ భవిష్యత్తును తామే డిజైన్ చేసుకున్నప్పుడు.. విజయం సాధించే అవకాశాలు చాలా రెట్లు పెరుగుతాయి” అని పేర్కొన్నారు.

గ్లోబల్ సమిట్‌‌‌‌లో భాగంగా మంగళవారం విజన్ డాక్యుమెంట్ విడుదల కార్యక్రమంలో ఆనంద్ మహీంద్రా మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి.. గొప్ప నెగోషియేటర్ అని ఆయన ప్రశంసించారు. ‘‘వ్యాపారవేత్తగా 40 ఏళ్ల అనుభవంతో చెబుతున్నాను.. నేను చాలా గట్టి నెగోషియేటర్‌‌‌‌‌‌‌‌ను. కానీ సీఎం రేవంత్ రెడ్డి రూపంలో నాకు సరైన జోడీ దొరికింది. ఆయన ‘నో’ అంటే.. ఇక అంగీకరించే మనిషి కాదు. సీఎం పట్టుదలకు ఫిదా అయ్యాను. అందుకే స్కిల్ వర్సిటీ పదవి చేపట్టాను” అని తెలిపారు.  

ఇకపై అవే ‘గోల్డ్ కాలర్’ జాబ్స్.. 

తెలంగాణ అభివృద్ధిలో తాము కూడా భాగస్వాములు అవుతామని ఆనంద్ మహీంద్రా తెలిపారు. జహీరాబాద్‌‌‌‌లో బ్యాటరీ తయారీ ప్లాంట్ ఏర్పాటు చేశామని చెప్పారు. ‘‘మనం ఇప్పుడు డిజిటల్ సునామీలో బతుకుతున్నాం. ఏఐ గురించి అందరూ భయపడుతున్నారు. ఏఐ వస్తే ఉద్యోగాలు పోతాయని అంటున్నారు. కానీ నేను దానికి విరుద్ధంగా ఆలోచిస్తాను. ప్రపంచం ఎంత డిజిటల్‌‌‌‌గా మారితే.. ‘హ్యూమన్ టచ్’ విలువ అంత పెరుగుతుంది.

రొటీన్ పనులను యంత్రాలు చేస్తాయి. కానీ చేతి నైపుణ్యం, క్లిష్టమైన సమస్యలను పరిష్కరించే తెలివి యంత్రాలకు ఉండదు. అందుకే ఇకపై ‘బ్లూ కాలర్’ జాబ్సే.. ‘గోల్డ్ కాలర్’ జాబ్స్ కాబోతున్నాయి. అభివృద్ధి చెందిన దేశాల్లో మేనేజర్లు ఎక్కువయ్యారు. కానీ పని చేసేవాళ్లు దొరకడం లేదు. స్కిల్ వర్సిటీ ద్వారా తెలంగాణ ఆ లోటును భర్తీ చేయబోతున్నది” అని పేర్కొన్నారు.