కల్తీ కల్లుతో అనర్థాలు

కల్తీ కల్లుతో అనర్థాలు

రాష్ట్రంలో తాటి, ఈత చెట్ల నుంచి వచ్చే పానీయాన్ని కల్లుగా పిలుస్తారు. ఈత, తాటి చెట్లు బంజరు భూముల్లో,  ఇతర పడావు భూముల్లో అధికంగా పెరుగుతాయి. రాష్ట్రంలో ఒకప్పుడు ఈత, తాటి చెట్లు విపరీతంగా ఉండేవి.  గత 50 సంత్సరాల నుంచి వ్యవసాయం, రహదారుల విస్తరణ, పట్టణాల పెరుగుదలతో చాలా చెట్లు కొట్టివేయడమైంది. గతంలో హైదరాబాద్​ నగర పరిసరాలలో విరివిగా కనిపించే ఈత, తాటి చెట్లు నగరానికి 50 కి.మీ.లలోపు కనబడకుండా పోయినాయి. హైదరాబాద్​నగరంలో కల్లు తాగుతున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా మురికివాడలలో నివసించే పేదలు ఎక్కువగా కల్లు తాగుతున్నారు. 

కల్లుకు గిరాకీ పెరగడంతో అనంతపురం, ప్రకాశం, కరీంనగర్‌‌ వంటి దూరప్రాంతాల నుంచి  హైదరాబాదు నగరానికి కల్లు  రవాణా అయ్యేది.  రవాణా సమయంలో కల్లు నాణ్యత చెడిపోతుండటం, అదీకాక కల్లుకు ఉన్న డిమాండ్​ను దృష్టిలో ఉంచుకొని కల్లు అమ్మేవారు సింథటిక్‌‌ కల్లు తయారుచేయడం మొదలుపెట్టారు. దానిలో మత్తు రావడానికి ప్రమాదకరమైన క్లోరల్‌‌ హైడ్రేట్‌‌, డైజోపామ్‌‌, ఆల్ర్పజోలం వంటివి కలపడంతో ప్రజల ఆరోగ్యంపై చాలా ప్రభావం పడడం మొదలైంది.  క్లోరల్‌‌ హైడ్రేట్‌‌ నాడీ మండలంపై ప్రభావం చూపుతుంది. కడుపులోని పేగులలో మంటలకు కారణమవుతుంది. లివర్‌‌ డామేజ్‌‌ చేస్తుంది. కంటిచూపు మందగించడం, గుండెపై  ప్రభావం చూపుతుంది. 

సింథటిక్ కల్లుతో ముప్పు

 ఒకసారి కల్లు వాడకం మొదలుపెడితే దీనికి బానిస అవుతారు. దీర్ఘకాలిక వాడకంతో చనిపోవడం కూడా జరుగుతుంది. కల్లులో  డైజోపామ్‌‌ వాడకంతో తలనొప్పి, మూత్రపిండాలపై ప్రభావం పడుతోంది. అధిక మోతాదులో  వాడినప్పుడు బాధితులు కోమాలోకి వెళ్లే అవకాశం ఉంది. ఇక ఆల్ర్పజోలం వాడకంతో డిప్రెషన్‌‌, కేంద్ర నాడీమండలంపై ప్రభావం, జ్ఞాపకశక్తి క్షీణత జరుగుతుంది.  ఈ పరిస్థితులను గమనించి 2004లో  అప్పటి ప్రభుత్వం   హైదరాబాద్​ నగరంలో 50 కి.మీ. లోపు ఈత, తాటి చెట్లు లేనందున దుకాణదారులు సింథటిక్‌‌ కల్లు తయారుచేస్తున్నారని కల్లు దుకాణాలన్నీ మూయించినారు. దీనిపై గీత సహకార సంస్థ వారు హైకోర్టును ఆశ్రయించారు. (డబ్ల్యుపి. సంఖ్య 18181 /2004). రాష్ట్ర ప్రభుత్వం ఆబ్కారీ శాఖ పాలసీ ప్రకారం హైదరాబాద్​నగరం చుట్టూ 50 కి.మీ.లలోపు తాటి, ఈత చెట్లు లేవని,  హానికరమైన రసాయనాలతో కల్తీ కల్లు తయారుచేసి అమ్ముతున్నారని, 2002 నుంచి 2004 సంవత్సరాలలో కల్తీ కల్లు అమ్మకంపై 3,100 కేసులు నమోదు చేయడం జరిగిందని, సుమారు 100 మంది కల్తీ కల్లు బారిన పడి చనిపోయినారని కోర్టుకు తెలిపింది. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా హైదరాబాద్​ నగరంలో కల్లు దుకాణాలు మూయించినట్లు వెల్లడించింది.  ప్రభుత్వ చర్యను కోర్టు సమర్థిస్తూ కేసు కొట్టివేసింది. 2004  నుంచి 2014 వరకు హైదరాబాద్​ నగరంలోని కల్లు దుకాణాలు మూతపడ్డాయి. 

తమిళనాడులో కల్లుపై నిషేధం

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత  మూతపడ్డ కల్లు దుకాణాలను ప్రభుత్వం జీఓ 24 ప్రకారం 4-–9-–2014న మళ్లీ తెరిపించింది. నేడు హైదరాబాద్ నగరంలో 100 వరకు కల్లు దుకాణాలు ఉండగా కల్తీ కల్లును పెద్ద ఎత్తున అమ్మకం జరుపుతున్నారు. కల్తీ కల్లు తాగిన పేదలు తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో చనిపోతున్నారు. కర్నాటక రాష్ట్రం కల్లు విక్రయం ఆపివేసినప్పుడు గీత కార్మికసంఘాలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.  కర్నాటక ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని కల్లు విక్రయాలు ఆపివేసిందని, ఈ విషయంలో మేము ప్రభుత్వాన్ని అభినందిస్తున్నామని సుప్రీంకోర్టు తెలిపి కల్లు అమ్మకం ప్రాథమిక హక్కు కాదని పేర్కొంటూ కేసు కొట్టివేసింది. ఇక తమిళనాడు రాష్ట్రంలో తాటిచెట్టు రాష్ట్ర వృక్షం. అక్కడ కల్లు అమ్మకంపై నిషేధముంది. తాటికల్లును బెల్లంగా తయారుచేసి గీత పనివారు అధిక లాభాలు పొందుతున్నారు. కేరళ రాష్ట్రంలో కల్లును మత్తు పానీయంగా 'ప్రకటించారు. దీనిపై గీత కార్మికులు సుప్రీంకోర్టును ఆశ్రయించగా కేరళ ప్రభుత్వం కల్లులో 8.1 % ఆల్కహాలు ఉంటుందని, మామూలు బీరులో 6% మాత్రమే ఆల్కహాలు ఉంటుందని అందుకే కల్లును మత్తుపానీయంగా 'ప్రకటించామని కోర్టుకి తెలుపగా కేసు కొట్టివేసింది.  

తాటి బెల్లం తయారీకి..గీత కార్మికులను ప్రోత్సహించాలి

నీటిలో మినప్పప్పు, ఫోమింగ్‌‌ ఏజెంట్‌‌, కలరింగ్‌‌ ఏజెంట్‌‌, సిట్రిక్‌‌ యాసిడ్‌‌ వంటివి కలిపి సింథటిక్‌‌ కల్లును తయారుచేస్తున్నారు. బస్తీవాసులు దీనికి అలవాటుపడి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే కల్తీకల్లు తప్ప స్వచ్ఛమైన కల్లుతో బస్తీవాసులకు నిషా రాక పిచ్చి ఎక్కినట్టు ప్రవర్తిస్తున్నారు. హైదరాబాద్​ నగరంలో 1,600  మురికివాడలలో నివసించే పేదలు ఎక్కువగా కల్తీ కల్లుకు  బానిసలైనారు. ఆబ్కారీ శాఖ  కల్తీ కల్లు గురించి పట్టించుకోవడం లేదు.  గత ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా మూతపడిన కల్లు దుకాణాలు తెరవడమే కాక ప్రభుత్వం నీరా అమ్మకం అంటూ కొత్త రాగం అందుకుంది. నెక్లెస్‌‌ రోడ్డులో రూ.15 కోట్ల ఖర్చుతో ఒక షెడ్డువేసి నీరా అమ్మకం మొదలుపెట్టింది. శాసనసభలో స్వయాన ముఖ్యమంత్రి, అలాగే ఆబ్కారీ శాఖ  మంత్రి నీరా ఎన్నో జబ్బులను నయం చేస్తుందని చెప్పడంతో కొత్తలో ప్రజలు నీరా కేఫ్‌‌ వద్దకు పోటెత్తారు. నీరాలో చాలా జబ్బులు నయంచేసే గుణాలు ఉంటే, గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల వద్ద నీరా దుకాణాలు తెరిచి జబ్బులతో బాధపడే రోగులకు రోజుకు 2 బాటిళ్లు నీరా తాగమని సూచనలు చేయవచ్చు కదా.  గుడుంబాను 2015లో ప్రభుత్వం ఉక్కుపాదంతో అణచివేసింది. కానీ, కల్తీ కల్లు హానికరమని తెలిసినా మూతపడ్డ  దుకాణాలు తెరిపించి కల్లు తాగడాన్ని ప్రోత్సహించింది. ఇప్పటికైనా కొత్త ప్రభుత్వం ఈ విషయంపై సరియైన నిర్ణయం తీసుకోవాలి. అలాగే ఇతర పట్టణాలలో 50 కి.మీ.లోపు తగినన్ని ఈత, తాటి చెట్లు లేనట్టయితే కల్లు దుకాణాలను మూసివేయాలి. ఈ చర్యతో నష్టపడ్డ కల్లు దుకాణదారులకు ప్రభుత్వం సహాయం చేయాలి.  తాటికల్లును బెల్లంగా మార్చి మార్కెట్‌‌లో అమ్మేలా గీత కార్మికులకు ప్రోత్సాహం, ఆర్థిక సహాయం అందించాలి.

- ఎం. పద్మనాభరెడ్డి, ఫోరం​ ఫర్​ గుడ్​ గవర్నెన్స్​