అరిషడ్వర్గాల కాన్సెప్ట్‌తో 'అరి': అనసూయ, సాయి కుమార్ నటించిన సినిమా రిలీజ్ డేట్ ఖరారు!

అరిషడ్వర్గాల కాన్సెప్ట్‌తో 'అరి': అనసూయ, సాయి కుమార్ నటించిన సినిమా రిలీజ్ డేట్ ఖరారు!

విభిన్న కథాంశాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న చిత్రాల కోవలోకి 'అరి' చేరనుంది. వినోద్ వర్మ, అనసూయ భరద్వాజ్, సాయి కుమార్, శ్రీకాంత్ అయ్యంగార్ వంటి నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా నుంచి విజయదశమి సందర్భంగా ఒక ఆసక్తికరమైన అప్‌డేట్ విడుదలైంది. జైశంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 10న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఏషియన్ సురేష్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.

'అరి' అంటే సంస్కృతంలో శత్రువు అని అర్థం. మనిషిలో ఉండే అంతర్గత శత్రువులైన కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు కాన్సెప్ట్‌ను ఈ సినిమాకు ప్రధాన కథాంశంగా ఎంచుకున్నారు దర్శకుడు జైశంకర్. ఇప్పటివరకు ఏ తెలుగు సినిమా టచ్ చేయని ఈ క్లిష్టమైన అంశాన్ని తెరకెక్కించడం విశేషం.

 

దర్శకుడు జైశంకర్ మాట్లాడుతూ, "మనిషి మనసులో పది తలలున్న రావణుడు కాదు, కేవలం ఆరు తలలున్న అరిషడ్వర్గాలు ఎంతటి విధ్వంసం సృష్టిస్తాయో ఈ సినిమాలో చూపించాం. కృష్ణ తత్వాన్ని కొత్త కోణంలో ఆవిష్కరించాం. ఈ కాన్సెప్ట్ కచ్చితంగా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని మాకు నమ్మకం ఉంది" అని తెలిపారు.

ఆర్వీ సినిమాస్ పతాకంపై రామిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి సమర్పణలో శ్రీనివాస్ రామిరెడ్డి, డి. శేషురెడ్డి, మారంరెడ్డి, నాయుడు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లింగ గులపనేని ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. భావోద్వేగాలు, తాత్వికత, మరియు యాక్షన్ కలబోసిన 'అరి' చిత్రం అక్టోబర్ 10న ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.