Idli Kadai Box Office : ధనుష్ 'ఇడ్లీ కొట్టు' బ్రేక్ ఈవెన్ సాధిస్తుందా? వీక్ డేస్ వసూళ్లే కీలకంగా!

Idli Kadai Box Office : ధనుష్ 'ఇడ్లీ కొట్టు' బ్రేక్ ఈవెన్ సాధిస్తుందా? వీక్ డేస్ వసూళ్లే కీలకంగా!

తమిళ స్టార్ హీరో ధనుష్, నిత్యా మేనన్ ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ చిత్రం 'ఇడ్లీ కడై'. భారీ అంచనాలతో అక్టోబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది. తెలుగులో దీనిని 'ఇడ్లీ కొట్టు' రిలీజ్ చేశారు. బాక్సాఫీస్ వద్ద తొలి రెండు రోజుల్లోనే అద్భుతమైన వసూళ్లను సాధించి, ట్రేడ్ పండితులను ఆశ్చర్యపరిచింది. పెద్దగా ప్రమోషన్లు లేకుండానే విడుదలైనప్పటికీ, 'ఇడ్లీ కడై' కంటెంట్ బలంగా ఉంటే ప్రేక్షకుల మనసు గెలుచుకోవడం ఖాయమంటున్నారు నిర్మాతలు. 

బాక్సాఫీస్ వద్ద ధనుష్ స్టామినా

ఈ సినిమా దాదాపు రూ.104 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందించినట్లు సమాచారం. ఈ లెక్కన బ్రేక్ ఈవెన్ సాధించాలంటే సినిమా మరో వారం రోజులు స్థిరంగా వసూళ్లు రాబట్టాల్సి ఉంటుంది. ఈ చిత్రం విడుదలైన కేవలం రెండు రోజుల్లో రూ. 20 కోట్ల క్లబ్‌లో చేరింది. 'కాంతారా చాప్టర్ 1', 'సన్నీ సంస్కారి కీ తులసి కుమారి' వంటి భారీ చిత్రాలతో పోటీ పడినప్పటికీ, ప్రేక్షకుల నుంచి, విమర్శకుల నుంచి ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు దక్కడం వసూళ్లకు దోహదపడింది.  

ప్రముఖ సినీ ట్రాకింగ్ వెబ్‌సైట్ సక్నిల్క్ నివేదికల ప్రకారం 'ఇడ్లీ కడై'  తొలి రోజు రూ. 11 కోట్లు రాబట్టింది. రెండవ రోజున రూ.10 కోట్లు వసూలు చేసింది. దీంతో, ఈ సినిమా మొత్తం నెట్ కలెక్షన్  రూ21 కోట్లకు చేరింది. గురువారం రోజున ఈ సినిమాకు ఓవరాల్‌గా 59.87 శాతం తమిళ ఆక్యుపెన్సీ నమోదైంది. ముఖ్యంగా, మధ్యాహ్నం షోలలో 70.02 శాతం, సాయంత్రం షోలలో 69.21 శాతం, రాత్రి షోలలో 65.26 శాతం ఆక్యుపెన్సీ సాధించింది. వీక్ డేస్ లో మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.

ALSO READ :  'మన శంకర వరప్రసాద్ గారు' ఫ్యాన్స్‌లో జోష్..

కథా నేపథ్యం

'ఇడ్లీ కడై' సినిమా కథాంశం ఎంతో భావోద్వేగంగా, ఆసక్తికరంగా ఉంది. మురుగన్ (ధనుష్) అనే యువకుడు తన గ్రామాన్ని, తండ్రి నడిపే 'ఇడ్లీ కడై'ని వదిలిపెట్టి, ప్రపంచంలోనే ప్రఖ్యాత చెఫ్‌గా ఎదగాలనే కలను వెంటాడుతూ బ్యాంకాక్‌కు వెళ్తాడు. అక్కడ కొన్ని సంవత్సరాల తర్వాత, అతను కోటీశ్వరుడైన విష్ణువర్ధన్ వద్ద పనిచేస్తూ, అతని కుమార్తె మీరాను వివాహం చేసుకోబోయే దశకు చేరుకుంటాడు. ఈ క్రమంలో తన తండ్రి మరణ వార్త విని, మురుగన్ గ్రామానికి తిరిగి వస్తాడు. అయితే, అతని రాక ఆనందంగా ఉండదు. అతని తండ్రి ప్రతిష్ట, వారసత్వం ప్రమాదంలో పడతాయి. పరిస్థితులను తనకనుకూలంగా మార్చుకోవడానికి మురుగన్ చేసే ప్రయత్నం చుట్టూ కథనం తిరుగుతుంది.

ధనుష్ స్వీయ దర్శకత్వంలో, వండర్‌బార్ ఫిల్మ్స్ బ్యానర్‌లో రూపొందిన ఈ సినిమాలో నిత్యా మేనన్, అరుణ్ విజయ్, షాలిని పాండే, రాజ్‌కిరణ్, సముద్రఖని, రాధాకృష్ణన్ పార్తిబన్, గీత కైలాసం వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషించారు.   ఈ చిత్రం, మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను అలరిస్తోంది. రానున్న రోజుల్లో ఈ సినిమా కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.