'అలయ్ బలయ్'లో రాజకీయం లేదు.. సమైక్యత స్ఫూర్తిని పెంచిందన్న నాగార్జున, బ్రహ్మానందం!

'అలయ్ బలయ్'లో రాజకీయం లేదు..  సమైక్యత స్ఫూర్తిని పెంచిందన్న నాగార్జున,  బ్రహ్మానందం!

దసరా పండుగ మరుసటి రోజున హైదరాబాద్‌లో ప్రతి ఏటా ఘనంగా నిర్వహించే 'అలయ్ బలయ్' కార్యక్రమం ఈ ఏడాది కూడా ఉల్లాసంగా, ఉత్సాహంగా జరిగింది. హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ వేడుకకు సినీ, రాజకీయ రంగాల ప్రముఖులు భారీగా హాజరయ్యారు. కులమతాలకు, పార్టీలు, సిద్ధాంతాల సంఘర్షణలకు అతీతంగా 'మనమంతా ఒక్కటే' అనే సమైక్యత స్ఫూర్తిని ఈ పండుగ చాటుతుంది.

 రాజకీయ విభేదాలను పక్కన పెట్టి, సంస్కృతిని, సంప్రదాయాన్ని గౌరవిస్తూ ఒకే వేదికపైకి రావడం ఈ కార్యక్రమం యొక్క ప్రత్యేకత. 'అలయ్ బలయ్' పండుగ ఏకత్వాన్ని, పరస్పర గౌరవాన్ని పెంపొందిస్తూ తెలంగాణ సంస్కృతిలో ఒక భాగమైంది. తెలంగాణ ఉద్యమ సమయంలో నాయకుల మధ్య ఐక్యత కోసం సుమారు 20 ఏళ్ల క్రితం దత్తాత్రేయ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి ప్రతి ఏటా ఈ సంప్రదాయం కొనసాగుతోంది. ఈ ఏడాది అలయ్ బలయ్ వేదిక 85 రకాల ప్రత్యేక తెలంగాణ వంటకాలు, వెజ్, నాన్-వెజ్ పిండివంటలు, స్వీట్లతో అతిథులకు విందు ఇచ్చింది.

 కాన్ఫిడెన్స్ పెంచిన ఐక్యత!

ఈ కార్యక్రమంలో పాల్గొన్న సినీ నటుడు అక్కినేని నాగార్జున తన అనుభవాన్ని పంచుకున్నారు. ఇలా అన్ని వర్గాల వారిని ఒకే వేదికపై సత్కరించడం, ముఖ్యంగా పార్టీలకు అతీతంగా రాజకీయ నేతలంతా ఒకచోట చేరడం నాకు చాలా కొత్తగా అనిపించింది. ఈ వాతావరణం అందరిలో కాన్ఫిడెన్స్ పెంచింది. ఏదైనా సమస్య వస్తే, మనమంతా సపోర్ట్‌గా నిలబడతామనే నమ్మకం కుదిరింది అని నాగార్జున అన్నారు. 2005 నుంచి 20 ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న దత్తాత్రేయకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

శాంతి కరవైన కాలంలో ఆలింగనం

 'అలయ్ బలయ్' అంటే హృదయపూర్వకంగా ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ప్రేమను పంచుకోవడమని నటుడు బ్రహ్మానందం అన్నారు. శ్రీరామ చంద్రుడు హనుమంతుడిని ఆలింగనం చేసుకున్నారు. అప్పటి నుంచే అలయ్ బలయ్ సంస్కృతి ఉంది. శాంతి, ప్రేమ కరవైపోతున్న ప్రస్తుత కాలంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించి పరస్పర గౌరవాన్ని పెంపొందించడం చాలా అవసరం అని చెప్పారు.

 

ఈ వేడుకలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, సీపీఐ నేత నారాయణ, ప్రొఫెసర్ కోదండరామ్ వంటి కీలక రాజకీయ నేతలు, అలాగే సినీ ప్రముఖులు పాల్గొని దత్తాత్రేయ ప్రయత్నాన్ని ప్రశంసించారు.