TVS XL బయటపెట్టిన నిజం.. ఈ పాయింట్తో మర్డర్ మిస్టరీ సినిమా తీస్తే.. పక్కా సూపర్ హిట్..!

TVS XL బయటపెట్టిన నిజం.. ఈ పాయింట్తో మర్డర్ మిస్టరీ సినిమా తీస్తే.. పక్కా సూపర్ హిట్..!

కర్ణాటకలో జరిగిన ఈ క్రైం నేరస్తుల చావు తెలివితేటలకు నిదర్శనం. క్రైం చేసి ఎంత తెలివిగా మేనేజ్ చేసినా ఒక్క పాయింట్ దగ్గర దొరికిపోతారని చెప్పడానికి ఈ క్రైం ఉదాహరణ. ఒక వ్యక్తి ఇన్సూరెన్స్ కడుతున్నాడు. అతను యాక్సిడెంట్లో చనిపోతే పాలసీ ప్రకారం.. 5.2 కోట్ల డబ్బు అతని కుటుంబానికి దక్కుతుంది. ఈ సంగతి తెలుసుకున్న ఒక ముఠా అతనిని చంపేసి.. యాక్సిడెంట్గా చిత్రీకరించి.. ఇన్సూరెన్స్ డబ్బులు కాజేయాలని ప్లాన్ చేసింది. అతని భార్య ఈమేనని చూపించడానికి ఒక మహిళను కూడా సీన్లోకి తీసుకొచ్చింది. 

అంతా పక్కాగా ప్లాన్ చేసుకున్నారు కానీ.. ఒక్క పొరపాటు నేరస్తులను జైలు ఊచలు లెక్కబెట్టేలా చేసింది. అప్పటికే మూడేళ్లుగా పక్షవాతంతో బాధపడుతున్న సదరు వ్యక్తి బండి ఎలా నడుపుతాడనే ఒక్క పాయింట్ నేరస్తులను పట్టించింది. ఇక్కడ దొరికిపోయారు. ఇదీ ఈ క్రైం కథా చిత్రంలో హైలైట్ ట్విస్ట్. ఈ ఘటన కర్ణాటకలోని హోస్ పేట్ పరిధిలో జరిగింది.

హోస్ పేటకు చెందిన గంగాధర్కు (34) ఆరేళ్ల క్రితం పెళ్లైంది. మూడేళ్ల క్రితం పక్షవాతం రావడంతో అప్పటి నుంచి మందులు వాడుతూ ఇంట్లోనే ఉంటున్నాడు. అతను కడుతున్న ఇన్సూరెన్స్ పాలసీ గురించి.. ఆ పాలసీ క్లైం చేసుకుంటే వచ్చే డబ్బుల గురించి ఎలా తెలిసిందో గానీ అతనిని చంపేసి ఆ డబ్బు కొట్టేయాలని ప్లాన్ చేసింది. అనుకున్నట్టుగానే గంగాధర్ను చంపేశారు. అతని డెడ్ బాడీని హోస్ పేట్ సిటీ శివార్లకు తీసుకెళ్లి పడేశారు. యాక్సిడెంట్గా చిత్రీకరించే ప్లాన్ అప్పటి నుంచే అమలు చేశారు. ఎక్కడ నుంచి తెచ్చారో.. లేక గతంలో గంగాధర్ వాడిన బండినో తెలియదు గానీ.. TVS XL తీసుకొచ్చి అతని డెడ్ బాడీ దగ్గర పడేశారు. కారుతో ఆ స్కూటీని ఢీ కొట్టారు. ఆ సీన్ చూసిన వాళ్లకు నిజంగానే యాక్సిడెంట్ జరిగిందని అనిపించేలా అంతా సెట్ చేశారు.

సెప్టెంబర్ 28న తెల్లవారుజామున 5.30 సమయంలో విజయనగర ఎస్పీ ఎస్ జాన్వీకి హిట్ అండ్ రన్ కేసు గురించి ఒక కాల్ వచ్చింది. సండూర్ రోడ్డులో ఒక డెడ్ బాడీ పడి ఉందని కాల్లో చెప్పడంతో ఎస్పీతో సహా కొందరు పోలీసులు స్పాట్కు వెళ్లారు. గంగాధర్ మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు తరలించారు. గంగాధర్ భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్నారు. గంగాధర్ భార్య శారదమ్మ చెప్పిన ఒక విషయం పోలీసులకు డౌట్ వచ్చేలా చేసింది. తనకు గంగాధర్ తో పెళ్లై ఆరేళ్లయిందని, మూడేళ్ల నుంచి పక్షవాతం, స్ట్రోక్ వచ్చిందని.. అతని బాడీలో లెఫ్ట్ సైడ్ పనిచేయదని చెప్పింది.

అలాంటి వ్యక్తి బండి ఎలా నడిపాడనే అనుమానంతో ఉన్న పోలీసులకు గంగాధర్ చనిపోయింది హిట్ అండ్ రన్ కారణంగా కాదని తేలిపోయింది. పోలీసులు కేసును లోతుపాతుల్లోకి వెళ్లి విచారించగా.. అతని పాలసీ డబ్బుల కోసం చంపేసి ప్రమాదంగా చిత్రీకరించారని విచారణలో వెల్లడైంది. 24 గంటల్లోనే పోలీసులు ఈ మర్డర్ మిస్టరీని సాల్వ్ చేశారు. ఆరుగురు ముఠాను అరెస్ట్ చేశారు. ఈ ఆరుగురిలో గంగాధర్ భార్య క్యారెక్టర్ చేసిన ఒక మహిళ కూడా ఉంది. కారును, ఆ టూవీలర్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.