వాటర్ ట్యాంకర్లో చిన్నారి శవం.. వీడిన మిస్టరీ.. మేనమామ, అత్త కలిసి ఈ పాపం చేశారు !

వాటర్ ట్యాంకర్లో చిన్నారి శవం.. వీడిన మిస్టరీ.. మేనమామ, అత్త కలిసి ఈ పాపం చేశారు !

హైదరాబాద్: హైదరాబాద్ సిటీలోని మాదన్నపేట ఏరియాలో హత్యకు గురైన ఏడేళ్ల చిన్నారి కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఏడేళ్ల చిన్నారి హుమేయానీ సుమ్మయాను కిరాతకంగా చంపేసింది ఎవరో కాదు.. ఆ చిన్నారి మేనమామ, అత్తనేనని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అమ్మమ్మ ఇంటికి వచ్చిన పాప.. ఇంట్లో అల్లరి చేస్తుందన్న కోపంతో ఆమె మేనమామ పాప కాళ్లూచేతులు కట్టేసి వాటర్‌ ట్యాంక్‌లో పడేశాడు. 

చిన్నారి మేనమామ, అత్త కలిసి పాప నోటికి ప్లాస్టర్ వేసి ఊపిరాడకుండా చేశారు. వాటర్ ట్యాంకర్లో పడేసిన కాసేపటికే పాప ఊపిరాడక చనిపోయింది. బాలిక తల్లితో కొన్నాళ్లుగా ఆస్తి పంపకాల విషయంలో పాప మేనమామ, మామ గొడవ పడ్డారు. ఆస్తి పంపకాల విషయంలోనూ గొడవలను మనసులో పెట్టుకుని అభంశుభం తెలియని చిన్నారిని మేనమామ, అత్త పొట్టనపెట్టుకున్నారు.

అసలేం జరిగిందంటే..
పాతబస్తీకి చెందిన ఏడేళ్ల బాలిక అమ్మమ్మ ఇంటికి వెళ్లి తప్పిపోయిందని పోలీసులకు ఫిర్యాదు అందింది. తీరా పోలీసులు కేసు నమోదు చేసి సీసీ కెమెరాలను తనిఖీ చేసినా.. ఎక్కడా ఇంటి నుంచి బయటికి వెళ్లిన దృశ్యాలు కనిపించలేదు. ఇంటిపై ఉన్న వాటర్ ట్యాంక్లో తనిఖీ చేయగా చేతులు, కాళ్లు కట్టేసి వాటర్ ట్యాంక్లో విగత జీవిగా ఆ పాప పడి ఉంది. ఈ ఘటన బుధవారం రాత్రి మాదన్నపేట పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కంచన్ బాగ్కు చెందిన మహ్మద్ అజీమ్, షబానా బేగం దంపతులు. వీరికి హుమేయానీ సుమ్మయా(7) కుమార్తె ఉంది. మంగళ వారం బాలిక తన తల్లితో మాదన్నపేట చావనీలోని అమ్మమ్మ ఇంటికి వచ్చింది. రాత్రికి బాలిక కనిపించకపోవడంతో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సీసీ కెమెరాలో ఎక్కడా బయటికి వెళ్లిన దృశ్యాలు కనిపించలేదు. దీంతో పోలీసులు ఇంట్లో మొత్తం తనిఖీ చేశారు. ఫలితం లేకపోవడంతో ఇంటిపై ఉన్న వాటర్ ట్యాంక్లో చూడగా బాలిక శవం కనిపించింది. పాప డెడ్ బాడీని బయటికి తీసి చూడగా చేతులు, కాళ్లు కట్టేసి గొంతు నులిమి చంపిన్నట్లు పోలీసులు నిర్ధారించారు. పోలీసులు చిన్నారి మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్కు తరలించి, క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ బృందాలతో విచారణ చేపట్టారు. కుటుంబ సభ్యులే ఈ ఘాతుకానికి పాల్పడి ఉండొచ్చనే పోలీసులు అనుమానమే నిజమైంది.