
జగిత్యాల జిల్లా: ప్రేమ పెళ్లి చేసుకున్నరు.. దసరా పండుగకు కొత్త జంట అమ్మాయి తల్లి గారింటికి వెళ్లారు.. అక్కడ భార్యాభర్తల మధ్య లొల్లి జరిగింది. పండుగ చూసుకుని అత్తారింటికి వచ్చిన నవ వధువు పెళ్లయిన వారానికే అత్తింట్లో అనుమానాస్పద స్థితిలో చనిపోయి కనిపించింది.
జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎద్దండి గ్రామానికి చెందిన అల్లెపు గంగోత్రి అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. సెప్టెంబర్ 26వ తేదీన అదే గ్రామానికి చెందిన సంతోష్ను పెద్దల సమక్షంలో గంగోత్రి ప్రేమ వివాహం చేసుకుంది. దసరా పండుగకు నూతన దంపతులు తల్లి గారి ఇంటికి వెళ్లారు.
తల్లి గారి ఇంటి దగ్గర భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. సంతోష్, గంగోత్రి మధ్య లొల్లి జరిగినప్పటికీ ఇంట్లో పెద్దలు వారించడంతో ఇద్దరూ సైలెంట్ అయిపోయారు. భార్యాభర్తల మధ్య చిన్నచిన్న మనస్పర్థలు సహజమేనని, ఆ గొడవ అంతటితో సమసిపోయిందని అంతా భావించారు.
కానీ.. తిరిగి అత్తవారింటికి వెళ్లిన గంగోత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఇంటిదూలానికి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. అత్త గారింటికి వెళ్ళిన తర్వాత ఏదో జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తూ గంగోత్రి తల్లి బోదాసు శారద పోలీసులకు ఫిర్యాదు చేసింది. శారద ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.