
హైద్రాబాద్: అనుమతులు లేకుండా ఇంట్లో మద్యం నిల్వ చేసి అమ్మకాలు చేస్తున్న వ్యక్తిని సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. మీర్ చౌక్కు చెందిన నర్సింగరావును పోలీసులు అరెస్ట్ చేశారు. మద్యం షాపులో mrp రేట్కు బల్క్గా లిక్కర్ కొనుగోలు చేసి డ్రై డేస్ టార్గెట్గా అధిక ధరకు అమ్ముతునట్లు పక్కా సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. 57.2 లీటర్ల 60 వేలకు పైగా విలువ చేసే వివిధ బ్రాండ్లకు చెందిన 318 బాటిళ్లను సీజ్ చేశారు.
గాంధీ జయంతి, దసరా ఒకేరోజు రావడంతో బ్లాక్లో లిక్కర్ అమ్ముతూ ఇలా కొందరు డ్రై డేను సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నించారు. దసరా పండుగకు అఫిషియల్ గానే రూ.698 కోట్ల లిక్కర్ వ్యాపారం జరిగింది. 3 రోజుల్లో 6 లక్షల 71 వేల కేసుల లిక్కర్ సేల్ అయింది. బీర్లు ఏరులై పారాయి. 7 లక్షల 22 వేల కేసుల బీర్లు అమ్ముడుపోయాయంటే దసరా దావత్లు ఎంత జోరుగా సాగాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
సెప్టెంబర్ నెల మొత్తం మీద 3 వేల 48 కోట్ల లిక్కర్ సేల్స్ జరిగాయి. గతేడాది దసరా పండుగ సీజన్తో పోల్చితే మద్యం అమ్మకాలు 76 శాతం పెరిగాయి. గాంధీ జయంతి, దసరా ఒకేరోజు వచ్చినా ఆ డ్రై డే ఎఫెక్ట్ మద్యం అమ్మకాలపై ఏమాత్రం కనిపించలేదు. డ్రై డే అని మద్యం ప్రియులకు క్లారిటీ ఉండటంతో రెండు, మూడు రోజులు ముందుగానే మద్యం కొని తెచ్చి పెట్టుకున్నారు. అందువల్ల.. ఆ డ్రై డే ఎఫెక్ట్ లిక్కర్ సేల్స్పై ఏమాత్రం పడకపోవడం గమనార్హం. తాగాక చాలకపోతే పండుగ రోజు దొరికే ఛాన్స్ లేదనో.. ఏమో.. ప్రతీ ఏడాది కంటే ఈ ఏడాది దసరా పండుగకు తెలంగాణలో లిక్కర్ సేల్స్ జరంత గట్టిగానే నడిచాయి.