సొంతూళ్ల నుంచి తిరిగి వచ్చేటోళ్లు జాగ్రత్త.. జగిత్యాల జిల్లాలో ఏమైందో చూడండి !

సొంతూళ్ల నుంచి తిరిగి వచ్చేటోళ్లు జాగ్రత్త.. జగిత్యాల జిల్లాలో ఏమైందో చూడండి !

జగిత్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. వెల్గటూర్ మండలం కొత్తపల్లి గ్రామ శివారులో చెట్టును కారు ఢీ కొట్టింది. కారులో ఉన్న వ్యక్తికి గాయాలవడంతో స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అతి వేగంతో చెట్టును ఢీకొట్టడంతో కారు నుజ్జునుజ్జయింది. హైదరాబాద్ నుంచి లక్షెట్టిపేటకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

సిద్దిపేట జిల్లా గజ్వేల్ శివారులోని సంగుపల్లి దగ్గర కూడా రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మూడేళ్ల చిన్నారి చనిపోయింది. చేగుంట నుంచి గజ్వేల్కు వస్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదంలో గాయపడ్డ వారందరూ ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు తెలిపారు. యశ్వంత్ రెడ్డి, వైష్ణవి, నరేష్ రెడ్డిలకు తీవ్ర గాయాలయినట్లు చెప్పారు.

దసరా పండుగకు సొంతూర్లకు వెళ్లి సిటీ బాట పడుతున్న జనం జాగ్రత్త వహించి వాహనాలను నడపాలని.. అతి వేగం ప్రమాదకరమని పోలీసులు హెచ్చరించారు. అంతెందుకు.. దసరా పండుగకు రెండు మూడు రోజుల ముందు కూడా ఇలాంటి రోడ్డు ప్రమాదమే నల్గొండ జిల్లాలో జరిగింది. పండుగ వేళ నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చింతపల్లి మండలం నసర్లపల్లి గేట్ దగ్గర ఆటో, కారు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.