
న్యూఢిల్లీ: మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో 11 మంది పిల్లలు చనిపోయారు. దగ్గు మందు తాగడం వల్లే ఈ చిన్నారులు చనిపోయారనే ప్రచారం దేశవ్యాప్తంగా ఆందోళన కలిగించింది. ఈ క్రమంలో చిన్నారులకు దగ్గు మందు వాడకంపై కేంద్ర ప్రభుత్వం కీలక హెచ్చరిక చేసింది. రెండేళ్ల లోపు చిన్నారులకు దగ్గు మందు వాడొద్దని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరించింది. అయితే.. కేంద్ర వైద్యఆరోగ్య శాఖ చేసిన పరీక్షల్లో ఆ దగ్గు మందు శాంపిల్స్లో చిన్నారులను చంపేంత ప్రమాదకర రసాయనాలు ఏవీ కలవలేదని తేలడం గమనార్హం.
చిన్నారుల మరణాలపై సమగ్ర దర్యాప్తు జరిగి అసలు కారణం తేలేంత వరకూ దగ్గు మందును చిన్నారులకు వాడకపోవడమే మంచిదనే అభిప్రాయంతో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా ప్రకటన చేసింది. రెండేళ్ల లోపు వయసున్న పిల్లలకు దగ్గు మందు వాడొద్దని సూచించింది. మధ్యప్రదేశ్లోని చింద్వారా జిల్లాలో పదిహేను రోజుల వ్యవధిలోనే తొమ్మిది మంది చిన్నారులు కిడ్నీలు ఫెయిల్ అయి చనిపోయారు. కిడ్నీలు ఫెయిల్ అవడానికి కారణం పిల్లలకు తాగించిన దగ్గు మందేనని ప్రచారం జరిగింది.
రాజస్థాన్లోని సికార్ జిల్లాలో కూడా కొన్ని రోజుల క్రితం ఆర్గాన్ ఫెయిల్యూర్తో ఇద్దరు పిల్లలు చనిపోయారు. ఈ రెండు రాష్ట్రాల్లో చిన్నారుల మరణాలకు దగ్గు మందు కారణం అని ప్రచారం జరిగింది. దీంతో.. పిల్లలకు దగ్గు మందు తాపించే తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. మధ్యప్రదేశ్లో చనిపోయిన తొమ్మిది మంది చిన్నారుల్లో ఐదుగురు పిల్లలకు Coldref అనే దగ్గు మందును, ఒకరికి Nextro Syrup వాడినట్లు తెలిసింది. ఈ కారణంగా.. డెక్స్ట్రోమెథోర్ఫాన్ హైడ్రోబ్రోమైడ్ సిరప్ బ్యాచ్‌లను అత్యవసరంగా పరీక్షించారు.
దగ్గు మందులుగా వాడుతున్న ఈ సిరప్‌లలో కిడ్నీ ఫెయిల్ అవడానికి కారణమయ్యే డైథిలిన్ గ్లైకాల్ (DEG), ఇథిలిన్ గ్లైకాల్ (EG) రసాయనాలు లేవని పరీక్షా ఫలితాలు నిర్ధారించాయని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ ఫలితాలను సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO), మధ్యప్రదేశ్ స్టేట్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (SFDA) కూడా ధృవీకరించాయి. అయినప్పటికీ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని దగ్గు మందుల అమ్మకాలను నిలిపివేశారు. ప్రస్తుతం, జలుబు, జ్వరం మరియు ఫ్లూ లాంటి లక్షణాలతో బాధపడుతున్న 1,420 మంది పిల్లలను వైద్య అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు.