
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ 'OG' ( 'They Call Him OG') . సెప్టెంబర్ 25న విడుదలైన బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాస్తోంది. దర్శకుడు సుజిత్ తెరకెక్కించిన ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా... తొలి వారం పూర్తయినా కూడా స్థిరమైన వసూళ్లు సాధిస్తూ, అభిమానులను ఉర్రూతలూగిస్తోంది. పవన్ కెరీర్ లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది.
పవన్ కెరీర్ లో అత్యధిక వసూళ్లు
ఈ చిత్రం వారం రోజులు పూర్తిచేసుకుని ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ. 361.24 కోట్ల గ్రాస్ వసూలు సాధించినట్లు నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ రికార్డులు కొనసాగుతున్నాయంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 154 కోట్లకు పైగా వసూలు చేసి పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే కాకుండా టాలీవుడ్‌లోనూ కొత్త రికార్డు నెలకొల్పింది. అటు సాక్నిల్క్ ప్రకారం, ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ చిత్రం దసరా నాడు రూ.7.50 కోట్లకు పైగా వసూలు చేసింది . దీనితో, ఈ సినిమా మొత్తం దేశీయ కలెక్షన్ ఇప్పుడు రూ.171 కోట్లకు పెరిగింది. దసరా సెలవులు ఖచ్చితంగా దానికి అనుకూలంగా పనిచేశాయి. కన్నడ బ్లాక్‌బస్టర్ 'కాంతార: చాప్టర్ 1' తో పోటీ పడినప్పటికీ, ఈ చిత్రం మంచి కలెక్షన్లను సాధించింది. వరుస సెలవులు రావడంతో వసూళ్లు మరింత పెరుగుతుందని మూవీ టీమ్ ధీమా వ్యక్తం చేస్తోంది.
#OG 8 Days Worldwide Gross Collection ₹361.24 Crores 💥💥#BoxOfficeDestructorOG @PawanKalyan #TheyCallHimOG pic.twitter.com/dlzSvhtZ2n
— DVVEntertainment. (@DVVMovies2) October 3, 2025
'ఓజీ'కి ప్రీక్వెల్, సీక్వెల్.
ఇటీవల హైదరాబాద్ లో నిర్వహించిన సక్సెస్ మీట్ లో పవన్ కల్యాణ్ చేసిన ప్రకటనతో ఫ్యాన్స్ సంతోషంలో మునిగిపోయారు.'OG' ఫ్రాంచైజీకి సంబంధించి ఏకంగా రెండు కొత్త చిత్రాలను ప్రకటించారు. అదే ప్రీక్వెల్, సీక్వెల్. ఈ ప్రకటనతో సభలోని అభిమానులంతా హర్షధ్వానాలతో హోరెత్తించారు. కథ రాయడం సులభమే కానీ, దాన్ని తెరపైకి తీసుకురావడం చాలా కష్టం అని పవన్ కల్యాణ్ అన్నారు.. నిజం చెప్పాలంటే, నాకు కూడా 'OG' పూర్తి కథ తెలియదు. త్రివిక్రమ్ గారు సుజిత్ పేరు చెప్పిన తర్వాత నేను అతన్ని కలిశాను. సుజిత్ నాతో మీరు జపనీస్ దుస్తుల్లో, ఒక కత్తి పట్టుకుని, తుపాకీతో ఉన్న గ్యాంగ్‌స్టర్‌గా కనిపిస్తారు అని చెప్పాడు. అప్పుడు కథ పూర్తిగా అర్థం కాకపోయినా, నా కొడుకు ఆ నోట్స్ చదువుతూ సంతోషపడటం చూసి ఈ కథకు ఈ తరంలో ఒక ప్రాముఖ్యత ఉందని నేను గ్రహించాను అని తెలిపారు.
'OG' చిత్రంలో బాలీవుడ్ నటుడు ఎమ్రాన్ హష్మి విలన్‌గా తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఆయన నటనకు కూడా ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు పడ్డాయి. పవన్ కల్యాణ్ సరసన ప్రియాంక మోహన్ నటించగా, అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శ్రీయా రెడ్డి, హరీష్ ఉత్తమన్ వంటి వారు కీలక పాత్రలు పోషించారు. డివివి దానయ్య డివివి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మించిన ఈ చిత్రానికి తమన్ ఎస్ సంగీతం అందించారు. ఈ చిత్రానికి వచ్చిన అద్భుతమైన స్పందన కారణంగా, పవన్ కల్యాణ్ తన తదుపరి చిత్రాల ప్రణాళికలో 'OG' సీక్వెల్, ప్రీక్వెల్‌కు ప్రాధాన్యత ఇస్తుండటం అభిమానులకు పండుగే అని చెప్పొచ్చు.