
హైదరాబాద్: పాతబస్తీకి చెందిన ఏడేళ్ల బాలిక అమ్మమ్మ ఇంటికి వెళ్లి తప్పిపోయిందని పోలీసులకు ఫిర్యాదు అందింది. తీరా పోలీసులు కేసు నమోదు చేసి సీసీ కెమెరాలను తనిఖీ చేసినా.. ఎక్కడా ఇంటి నుంచి బయటికి వెళ్లిన దృశ్యాలు కనిపించలేదు. ఇంటిపై ఉన్న వాటర్ ట్యాంక్లో తనిఖీ చేయగా చేతులు, కాళ్లు కట్టేసి వాటర్ ట్యాంక్లో విగత జీవిగా ఆ పాప పడి ఉంది. ఈ ఘటన బుధవారం రాత్రి మాదన్నపేట పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కంచన్ బాగ్కు చెందిన మహ్మద్ అజీమ్, షబానా బేగం దంపతులు. వీరికి హుమేయానీ సుమ్మయా(7) కుమార్తె ఉంది. మంగళ వారం బాలిక తన తల్లితో మాదన్నపేట చావనీలోని అమ్మమ్మ ఇంటికి వచ్చింది. రాత్రికి బాలిక కనిపించకపోవడంతో తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
సీసీ కెమెరాలో ఎక్కడా బయటికి వెళ్లిన దృశ్యాలు కనిపించలేదు. దీంతో పోలీసులు ఇంట్లో మొత్తం తనిఖీ చేశారు. ఫలితం లేకపోవడంతో ఇంటిపై ఉన్న వాటర్ ట్యాంక్లో చూడగా బాలిక శవం కనిపించింది. పాప డెడ్ బాడీని బయటికి తీసి చూడగా చేతులు, కాళ్లు కట్టేసి గొంతు నులిమి చంపిన్నట్లు పోలీసులు నిర్ధారించారు. పోలీసులు చిన్నారి మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్కు తరలించి, క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ బృందాలతో విచారణ చేపట్టారు. కుటుంబ సభ్యులే ఈ ఘాతుకానికి పాల్పడిన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.