
టాలీవుడ్‌లో కొన్నేళ్ల నుంచి విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా ప్రేమలో ఉన్నారని, పెళ్లి పీటలెక్కబోతున్నారని ఏదో ఒక సందర్భంలో ప్రచారం జరుగుతూనే ఉంది. ఈ రూమర్లను ఇటు విజయ్ గానీ, అటు రష్మిక గానీ ఖండించలేదు అలా అని ప్రేమలో ఉన్నామని, పెళ్లి చేసుకుంటామని కూడా కన్ఫర్మ్ చేయలేదు.
కానీ.. ఇన్నాళ్లూ గాసిప్స్ గానే చెప్పుకుంటూ వచ్చిన ఈ ప్రచారం నిజమైనట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా నిశ్చితార్థం జరిగిపోయిందని.. విజయ్ దేవరకొండ ఇంట్లో కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో సింపుల్‌గా ఈ వేడుక జరిగిందని సోషల్ మీడియా కోడై కూస్తోంది. చాలా సీక్రెట్‌గా, మీడియాకు తెలియకుండా నిశ్చితార్థం చేసుకున్నట్లు తెలిసింది.
సినీ రంగానికి సన్నిహితంగా మెలిగే కొందరు పీఆర్వోలు కూడా తమ ‘ఎక్స్’ పేజీల్లో రష్మిక మందన్నా ఫొటోలను కొన్నింటిని పోస్ట్ చేసి కంగ్రాట్స్ చెబుతున్నారు. విజయ్ దేవరకొండ ఇల్లు ఎలా ఉంటుందో సోషల్ మీడియాను ఫాలో అయ్యే చాలామందికి తెలుసు. రష్మిక తాజా ఫొటోలను గమనిస్తే.. విజయ్ దేవరకొండ ఇంట్లో.. నుదుటిన కుంకుమ బొట్టుతో రష్మిక మందన్నా కనిపించింది. హిందూ సాంప్రదాయం ప్రకారం.. విజయ్, రష్మిక నిశ్చితార్థం జరిగిందని నెట్టింట టాక్. కానీ.. ఇక్కడ అసలు అర్థం కాని విషయం ఏంటంటే.. విజయ్, రష్మిక ప్రేమాయణం గురించి ఎప్పటి నుంచో సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.
విజయ్ సినిమా ఏదైనా విడుదలైనప్పుడు రష్మిక చేసే ట్వీట్లు, ఇన్ స్టాలో పెట్టే పోస్టులు ఈ ఇద్దరి ప్రేమ బంధాన్ని చెప్పకనే చెబుతుంటాయి. ఈ ఇద్దరూ చూడచక్కనైన జంట అని అందరికీ తెలుసు. ఈ ఇద్దరూ పెళ్లి చేసుకుంటే నెగిటివిటీ రావడానికి ఎలాంటి అవకాశం లేదు. మరి అలాంటప్పుడు నిశ్చితార్థం జరిగిందనే విషయం బయటకు చెప్పడానికి రష్మిక, విజయ్ ఎందుకు వెనకడుగు వేశారో అర్థం కాని పరిస్థితి.
ఏదేమైనా.. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా నిశ్చితార్థం వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో, మీడియాలో ట్రెండింగ్ టాపిక్ అయింది. ‘ఎక్స్’లో అయితే #VijayDevarakonda, #RashmikaMandanna హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ కావడం చూస్తుంటే ఈ ఇద్దరి పెళ్లి ముచ్చట ఎంత హాట్ టాపిక్ అయిందో తెలుస్తూనే ఉంది. 2026 ఫిబ్రవరిలో రష్మిక, విజయ్ దేవరకొండ పెళ్లి ఉంటుందని విజయ్ సన్నిహితులు చెబుతున్నారు.