కొమురం భీమ్ జిల్లా కాగజ్ నగర్ మండలంలోని అందవెల్లి దగ్గర బ్రిడ్జి కూలింది. రాకపోకలు ఇప్పటికే ఆపేయడంతో ప్రమాదం తప్పింది. పెద్దవాగు ఉధృతికి రెండు నెలలుగా వంతెన కుంగుతూ వచ్చింది. ఎప్పుడు కూలిపోతుందోనన్న టెన్షన్ నెలకొంది. లేటెస్ట్ గా తాజా వర్షాలతో బ్రిడ్జి కుప్పకూలింది. దీంతో 42 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న కాగజ్ నగర్ పోలీసులు అక్కడికి చేరుకుని రాకపోకల్ని పూర్తిగా నిలిపేశారు. స్థానిక తహసీల్దార్, ఎంపీడీవో బ్రిడ్జి వద్దకు చేరుకుని గోడ నిర్మాణానికి చర్యలు చేపట్టారు. బ్రిడ్జి పిల్లర్లు నీటిలో కుంగిపోవడంతో కూలిపోయిందంటున్నారు స్థానికులు. బ్రిడ్జికి మొత్తం 10 పిల్లర్లు, 11 స్లాబులు ఉన్నాయి. కూలిన బ్రిడ్జిని ఎమ్మెల్యే కోనప్ప పరిశీలించారు.
కాగజ్ నగర్ – దహేగాం మెయిన్ రోడ్ లో అందపెల్లి బ్రిడ్జి రిపేర్లకు 2 కోట్ల 90 లక్షల రూపాయలు మంజూరయ్యాయి. ఈ మరమ్మతులకు టెండర్లు పిలవగా ఏపీకి చెందిన ఒకే కంపెనీ పాల్గొంది. దీంతో టెండర్ ఆ కంపెనీకే దక్కింది. గతేడాది ఆగస్ట్ లో కురిసిన భారీ వానలు, వరదలకు పిల్లర్ కొంత వరకు కుంగిపోగా.. ఈ ఏడాది కురిసిన భారీ వర్షాలకు మరింతగా కుంగిపోయి బ్రిడ్జి ప్రమాదకరంగా మారింది. దీంతో అధికారులు రాకపోకలు ఆపేశారు. అప్పటి నుంచి వాగు అవతలి గ్రామాల ప్రజలు పెద్దవాగు దాటడానికి చాలా కష్టాలు పడుతూ వస్తున్నారు. తాత్కాలిక మరమ్మతులకు 22 లక్షల నిధులు కేటాయించగా పనులు చేసేందుకు ఏ కంపెనీ ముందుకు రాలేదు. దీంతో శాశ్వత రిపేర్ల కోసం 2 కోట్ల 90 లక్షలు కేటాయించారు.
