అందెశ్రీ కొత్త ఇల్లు ఇదే.. పూర్తయ్యే లోపే కన్నుమూత !

అందెశ్రీ కొత్త ఇల్లు ఇదే.. పూర్తయ్యే లోపే కన్నుమూత !

ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ కన్నుమూశారు. ఎంతో ఇష్టంతో నిర్మించుకుంటున్న కలల సౌధం పూర్తి కాకముందే చనిపోవడం బాధాకరమైన విషయం. చనిపోయే ముందు రోజు 2025, నవంబర్ 09 వ తేదీన సాయంత్రం వరకు అక్కడే ఉన్నట్లు చెబుతున్నారు. సాయంత్రం వరకు ఇల్లు నిర్మాణ పనులను పర్యవేక్షించి వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 

మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ మున్సిపాలిటీ ఎన్ ఎఫ్ సీ నగర్ లో కొత్తగా ఇల్లు నిర్మిస్తున్నారు అందెశ్రీ. ఆదివారం మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం వరకు NFC నగర్ లో గడిపారు. తానే స్వయంగా దగ్గర ఉండి కొత్త ఇంటిని కట్టించుకుంటున్నారని మేస్త్రీలు, కాంట్రాక్టర్లు చెప్పారు. 

NFC నగర్ లో 348 గజాల్లో G+3 పెంట్ హౌస్ నిర్మిస్తున్నారు అందెశ్రీ . మధ్యాహ్నం వరకు కొత్త ఇంటి దగ్గర ఉన్న ఆయన.. సాయంత్రం అయోధ్య రెడ్డి ఇంటి దగ్గర అయ్యప్ప పూజ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ తర్వాత ఇంటికెళ్లిన అందెశ్రీ అర్ధరాత్రి తర్వాత గుండెపోటుతో చనిపోయారు. ఉదయం గాంధీ ఆస్పత్రికి తరలించగా ఐదు గంటల ముందే చనిపోయి ఉంటారని ప్రకటించారు. 

అందెశ్రీ రాసిన జయజయహే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం.. ఆయనకు కోటి రూపాయల నజరానా అందించిన విషయం తెలిసిందే. అదే విధంగా ఇంటి నిర్మాణానికి 348 గజాల స్థలాన్ని కూడా బహుకరించింది. దీంతో ఆయన ఇంటి నిర్మాణం మొదలు పెట్టారు. దాదాపు ఇల్లు పూర్తయ్యింది. కొన్నాళ్లలో ఇంట్లోకి వెళ్లే ముందే.. చనిపోవడంపై కుటుంబ సభ్యులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. 

అందెశ్రీ 2025 నవంబర్ 10న ఉదయం హైదరాబాద్ లాలాగూడలోని ఆయన ఇంట్లో ఒక్కసారిగా కుప్పకలిపోయారు. కుటుంబ సభ్యులు హుటాహుటిన గాంధీ ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు తెలిపారు. అందెశ్రీ మృతిపట్ల పలువురు సినీ,రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.  తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతం 'జయ జయహే తెలంగాణ జననీ జయ కేతనం' ను రచించారు అందెశ్రీ.