
- వైజాగ్, విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం
- ఈ రెండింటికీ 50 శాతం నిధులిచ్చి మరీ సహకారం
- మొదటి దశలో రూ.21,616 కోట్ల పనులకు నేడు టెండర్లు
- హైదరాబాద్ మెట్రో 2 అనుమతులకు మాత్రం కేంద్రం మోకాలడ్డు
- తెలంగాణపై బీజేపీ వివక్ష చూపుతున్నదని విమర్శలు
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ మెట్రో 2 అనుమతులను రకరకాల కొర్రీలతో అడ్డుకుంటున్న కేంద్ర సర్కార్.. ఏపీలో మాత్రం ఒకేసారి వైజాగ్, విజయవాడ మెట్రో ప్రాజెక్టులకు పర్మిషన్లు ఇచ్చింది. 50 శాతం నిధులు కూడా ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ రెండు ప్రాజెక్టులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరో సగం నిధులను భరించనున్నాయి. మరోవైపు హైదరాబాద్ మెట్రోకు అనుమతిస్తే కేంద్రం భరించాల్సింది కేవలం18 శాతం నిధులే. కానీ ఆ మాత్రం ఇవ్వడం ఇష్టం లేకే ఫైల్ పక్కన పెడ్తోందనే విమర్శలు వస్తున్నాయి. కాగా వైజాగ్, విజయవాడలో మెట్రో ప్రాజెక్టుల నిర్మాణానికి శుక్రవారం టెండర్లు పిలవనున్నారు. మొదటి దశలో రూ. 21,616 కోట్ల పనులకు టెండర్లు ఆహ్వానించనున్నారు.
ఇందులో విజయవాడ మెట్రోకు రూ.10,118 కోట్లతో, వైజాగ్ మెట్రోకు రూ.11,498 కోట్ల తో టెండర్లు పిలవనున్నారు. ఈ రెండు ప్రాజెక్టుల డీపీఆర్‌లకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడంతో.. ప్రాథమిక దశలో మొత్తం ప్రాజెక్ట్ వ్యయంలో 40 శాతం పనులకు శుక్రవారం టెండర్లు పిలవనున్నారు. ఇలా ఏపీలో వేల కోట్ల రూపాయల మెట్రో ప్రాజెక్టులకు అనుమతులిచ్చి, నిధులు కూడా సమకూరుస్తున్న కేంద్రం.. హైదరాబాద్ మెట్రో విస్తరణకు ఎలాంటి అనుమతులు ఇవ్వకుండా మూడు నెలలుగా ఫైల్‌ను తన వద్ద పెండింగ్పెట్టుకోవడంపై విమర్శలు వస్తున్నాయి.
వాస్తవానికి హైదరాబాద్ మెట్రో మొదటి దశ విజయవంతంగా నడుస్తోంది. నగర జనాభా, విస్తరణ, ట్రాఫిక్సమస్యల దృష్ట్యా మెట్రో ఫేజ్2 విస్తరణ అత్యవసరం అని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. ఏప్రిల్‌లో ఒకసారి డీపీఆర్‌ను పంపగా, కేంద్రం అభ్యంతరాల నేపథ్యంలో మరోసారి సవరించి పంపింది. సీఎం రేవంత్ రెడ్డి సైతం పలుమార్లు కేంద్రమంత్రులను స్వయంగా కలిసి విజ్ఞప్తి చేసినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది.
ఇదీ హైదరాబాద్‌మెట్రో ఫేజ్2..
హైదరాబాద్‌మెట్రో ఫేజ్-2 ప్రాజెక్టు కింద కేటగిరీ 'ఏ' లో 76.4 కిలోమీటర్ల పొడవైన ఐదు కారిడార్ల నిర్మాణానికి రూ.24,269 కోట్లు, కేటగిరీ 'బీ'లో 86.1 కిలోమీటర్ల పొడవైన మూడు కారిడార్ల నిర్మాణానికి రూ.19,579 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. మొత్తంగా రెండో దశలో ఏ, బీ రెండు కేటగిరీలకు సంబంధించి రూ.43,848 కోట్లు ఖర్చు కానుంది. ఈ మెట్రోకు కేంద్రం ఆమోదం తెలిపితే.. ఏపీకి ఇచ్చినట్లు 50 శాతం కాకుండా కేవలం 18 శాతం మాత్రమే అంటే రూ.7892 కోట్లు మాత్రమే బీజేపీ సర్కారు ఇవ్వాల్సి ఉంటుంది. మిగతా మొత్తాన్ని సొంతంగా, రుణాల ద్వారా, పీపీపీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చుకోవాల్సి ఉంటుంది.
ఇటీవల మహారాష్ట్ర, చెన్నై, బెంగళూరు మెట్రోలతో పలు చిన్న నగరాల్లోనూ మెట్రోలకు ఆమోదం తెలిపిన కేంద్రం.. తాజాగా ఏపీలో కూడా టెండర్లు పిలుస్తోంది. పైగా అక్కడ 50:50 జాయింట్ వెంచర్ పద్ధతిలో పనులు చేపట్టనుంది. కానీ హైదరాబాద్మెట్రోకు 18శాతం నిధులు ఇచ్చేందుకే కేంద్ర ప్రభుత్వం సహకరించకుండా రకరకాల కొర్రీలు పెడ్తోందని తెలంగాణ అధికారులు వాపోతున్నారు. హైదరాబాద్‌మెట్రో రెండో దశ అంచనా వ్యయం భారీగా పెరిగిందని, కొన్ని కారిడార్లలో ‘పీక్ అవర్ పీక్ డైరెక్షన్ ట్రాఫిక్’ (పీహెచ్‌పీడీటీ) డిమాండ్ తక్కువగా ఉందని కేంద్రం అభ్యంతరాలు చెప్తోందని పేర్కొంటున్నారు.
కానీ ఇతర రాష్ర్టాల్లో పీహెచ్‌పీడీటీ అంచనాలు తక్కువగా ఉన్నా.. మెట్రో ప్రాజెక్టులకు అనుమతులిచ్చినట్టు తెలంగాణ అధికారులు గుర్తుచేస్తున్నారు. రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదని, అయినా ఏదో ఒక కొర్రీతో అనుమతులు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని విమర్శిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధికి, హైదరాబాద్ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి మెట్రో ఫేజ్ 2 ఎంతో కీలకమని, అందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఈ ప్రాజెక్టులకు అనుమతులు, నిధుల కోసం అభ్యర్థించినా కేంద్రం స్పందించడం లేదన్నారు.