టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, నటి భాగ్యశ్రీ బోర్సే మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ గత కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. వీరిద్దరూ కలిసి నటించిన లేటెస్ట్ చిత్రం 'ఆంధ్రకింగ్ తాలూకా' . అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరి మధ్య సాన్నిహిత్యం పెరిగిందని టాక్ విపినించింది. వీరి స్నేహం కాస్త ప్రేమగా మారిందనే పుకార్లు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. అయితే ఈ రూమర్స్‌పై లేటెస్ట్ గా హీరో రామ్ పోతినేని స్వయంగా స్పందించి, తనదైన శైలిలో క్లారిటీ ఇచ్చారు.
ప్రేమ గీతమే కారణం..
లేటెస్ట్ గా'ఆంధ్రకింగ్ తాలూకా' (Andhra King Taluka) సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రామ్ పోతినేని.. తాను భాగ్యశ్రీతో డేటింగ్‌లో ఉన్నాననే వార్త కేవలం రూమర్ మాత్రమేనని స్పష్టం చేశారు. నేను 'ఆంధ్రకింగ్ తాలూకా' సినిమా కోసం ఒక అద్భుతమైన ప్రేమ గీతం రాశాను. ఆ పాట విడుదలైన తర్వాతే ఈ పుకార్లు మొదలయ్యాయి. భాగ్యశ్రీపై మనసులో ప్రేమ ఉంది కాబట్టే రామ్ ఇంత గొప్ప పాట రాయగలిగాడని అని అందరూ అనుకున్నారు. కానీ వాస్తవం ఏంటంటే.. ఈ సినిమాలో హీరోయిన్‌గా భాగ్యశ్రీని ఎంపిక చేయకముందే నేను ఆ పాట రాశాను అని చెప్పారు. సినిమాలో హీరో, హీరోయిన్ల పాత్రలను ఊహించుకొని ఆ లిరిక్స్ రాస్తే.. అంతా దాన్ని మరోలా అర్థం చేసుకున్నారని రామ్ తెలిపారు . తన మాటలతో ఈ ప్రేమాయణం కథకు ఫుల్‌స్టాప్ పెట్టారు. అంతేకాకుండా, రామ్ తన సినిమాలకు పాటలు రాయడం అనేది కొత్త టాలెంట్‌గా బయటపడటం అభిమానులకు సంతోషాన్నిచ్చింది.
భాగ్యశ్రీ సైతం క్లారిటీ..
ఇదే విషయంపై మరో ఇంటర్వ్యూలో నటి భాగ్యశ్రీ బోర్సే కూడా స్పందించింది. రామ్ పోతినేని తనకు కేవలం మంచి స్నేహితుడు మాత్రమేనని, ఒక నటుడిగా ఆయన అంటే తనకు ఎంతో గౌరవం ఉందని తెలిపింది. రామ్ డెడికేషన్ చూసి నేను చాలా నేర్చుకున్నాను. నటనపై ఆయనకున్న శ్రద్ధ అద్భుతం. అంతకు మించి మా మధ్య ఎలాంటి సంబంధం లేదు. ఇవన్నీ కేవలం రూమర్స్ మాత్రమే అని భాగ్యశ్రీ బోర్సే కూడా క్లారిటీ ఇచ్చింది. ఈ ఇద్దరు స్టార్స్ ఒకేసారి, ఒకే విధమైన క్లారిటీ ఇవ్వడంతో.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ ప్రేమ గాథకు తెరపడింది.
'ఆంధ్రాకింగ్ తాలూకా' విడుదల సిద్ధం.
రామ్-భాగ్యశ్రీ జంటగా నటించిన 'ఆంధ్రాకింగ్ తాలూకా' సినిమా విడుదలకు సిద్ధమైంది.. పి. మహేశ్‌బాబు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రామ్ ఒక స్టార్ హీరోకి వీరాభిమానిగా కనిపించనున్నారు. కన్నడ నటుడు, రియల్ స్టార్ ఉపేంద్ర ఈ సినిమాలో ఒక కీలక పాత్ర పోషించడం సినిమాపై అంచనాలు పెంచింది. ఈ హై-ఎనర్జీ యాక్షన్ ఎంటర్‌టైనర్ నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. రామ్, భాగ్యశ్రీల ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ ఎంత బాగా కుదిరిందో సినిమా విడుదలైతే తెలుస్తుంది.
