ప్రజలనే నిందిస్తున్న బరితెగింపు

ప్రజలనే నిందిస్తున్న బరితెగింపు

‘ తెలంగాణ ప్రజల కంటే ఆంధ్రా ప్రజలు తెలివైనవారు’  ఈ మధ్య ఓ టీవీ ఛానెల్​లో ఏర్పాటు చేసుకున్న ఇంటర్వ్యూలో బీఆర్ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ చేసిన కామెంట్​ అది. తిన్నింటి వాసాలు లెక్కపెట్టడం అంటే ఇదే! పదేండ్లు తెలంగాణ పేరు చెప్పుకొని అధికారం అనుభవించిన నాయకుడు .. ఓడిపోగానే తెలంగాణ ప్రజలు తెలివిలేనోళ్లంటున్నాడు. ఇంతకు మించిన దగాకోరుతనం ఇంకేమైనా ఉంటదా? 2014, 2018లో ఆయనకు అధికారం ఇచ్చినపుడు   తెలివిలేనోళ్లేనా? ఈ విషయం కూడా ఆయన చెప్పిఉంటే బాగుండేది కదా! అయితే అట్లు పోయడం, లేదంటే రొట్టెలు చేయడంలో ఆయన్ను మించిన వాడు లేడనే చెప్పాలె!  

లోపలి మనిషి బయటపడ్డాడు!

తమ అధికారం కోసం తెలంగాణ అన్నాం తప్ప, తెలంగాణ ప్రజల కోసం అనలేదనే లోపలి మనిషి  బయటపడుతున్నాడు.   నిజం ఎప్పటికైనా బయటపడకతప్పదంటే ఆయన కామెంటే ఒక బలమైన సాక్ష్యం. ఆంధ్రా సెట్లర్లకు కాలుకు ముల్లు గుచ్చుకుంటే, పంటితో తీస్తాను అన్న కేసీఆర్,  ప్రగతి భవన్​ ముందు పెట్రోల్​ డబ్బాతో  నిలబడ్డ తెలంగాణ పేదోడిని మాత్రం ఏనాడూ లోపలికి అనుమతించలే. ​ తెలంగాణ ప్రజలు అన్ని రంగాల్లో ఎదిగిరావడానికి తెలంగాణ తెచ్చుకున్నాం అని ఉద్యమ కాలంలో చెప్పిన ఆ నోరే అధికారంలోకి వచ్చాక చేసిన ఘన కార్యాలు మామూలుగా లేవు. నిజమే.. వచ్చిన తెలంగాణలో కాంట్రాక్టులు, వ్యాపారాలు, రియలెస్టేట్​ లతో బాగుపడింది  తమతో పాటు ఆంధ్రా వ్యాపారులు తప్ప, తెలంగాణోళ్లు కాదని కేటీఆర్​కూ తెలుసు! 

ఎవరు బాగుపడ్డారు?

సినీ హీరోయిన్​ సమంతను చేనేత బ్రాండ్​ ఎంబాసిడర్​ను చేశారు. చేనేత బ్రాండ్​ ఎంబాసిడర్​ను చేయడానికి కేటీఆర్​కు తెలంగాణలో ఒక్క అమ్మాయి కూడా కనిపించలేదు మరి! యాదగిరిగుట్ట పుణ్యక్షేత్ర పునర్నిర్మాణానికి ఆగమ శాస్త్ర  పర్యవేక్షణకు ఆంధ్రా జీయర్​ స్వామి దొరికాడు తప్ప,  తెలంగాణలో ఒక్క బ్రాహ్మణోత్తముడూ దొరకలేదు. ప్రగతి భవన్​లోకి ఆంధ్రా వ్యాపారులకు అనుమతులు దొరికేవి తప్ప, తెలంగాణోడికి ప్రగతి భవన్​ గేటు ముందు మెడలు పట్టి గెంటివేతలే జరిగాయి! మంత్రుల చాంబర్లలోకి ఆంధ్రా వ్యాపారులకు అపాయింట్​మెంట్లు దొరికేవి తప్ప, ఏ తెలంగాణోడికైనా అపాయింట్​మెంట్​ దొరికేదా?  సెక్రటేరియట్​లో 85శాతం తెలంగాణ ఉద్యోగులు లేరెందుకు? పరిపాలనంతా ఆంధ్రా ఉద్యోగులతో నడిపి, తెలంగాణ ప్రజలను దగా చేసిన పాపం చిన్నది కాదు.  భూ ఆక్రమణలు, భూ దందాలతో తామూ ఎదిగారు, ఇతరులకు  తెలంగాణను దోచిపెట్టారు తప్ప, తెలంగాణ ఎదిగిందా?  ప్రాజెక్టులన్నీ ఆంధ్రా బడా కాంట్రాక్టర్లకు కట్టబెట్టారు. 

ఒక్క తెలంగాణ కాంట్రాక్టరైనా ఎదిగివచ్చాడా? వివిధ రంగాలలో తెలంగాణ ప్రజల ఎదుగుదల అవకాశాలను దోపిడీ చేసి ఇతరులకు పంచిపెట్టిన ఘనాపాటికి.. తెలంగాణ ప్రజలు తెలివిలేనోళ్లుగా కనిపించరా! తెలంగాణ ప్రజల విశ్వసనీయతను వ్యాపారంగా మార్చుకున్న పాలకుడికి ఆంధ్రా దోస్తులే తెలివైన వారుగా.. తెలంగాణ ప్రజలు తెలివిలేనోళ్లుగానే కనిపించడం సహజమే! సుఖమొస్తే  ఇతరులకు సేవ చేయడం, కష్టమొస్తే తెలంగాణ పాటపాడటం  ఘనత వహించిన బీఆర్​ఎస్​ యాజమానులకు మామూలే! ప్రజలు ఎందుకు ఓడించారో ఆత్మపరిశీలన చేసుకోలేని చేతగాని నేతలు.. ప్రజలనే తెలివితక్కువ వాళ్లంటూ అవమానించడం  అజ్ఞానానికి, వారి అహంకారానికి పరాకాష్ట. 

‘పాలిచ్చే బర్రెను వదిలి దున్నపోతును తెచ్చుకున్నట్టు  లిల్లీపుట్​గాళ్లను తెచ్చుకున్నారు’  అని ప్రజలను నిందిస్తూ ఇటీవల సంగారెడ్డి జిల్లా సుల్తాన్​పూర్​ వద్ద ‘ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్​ చేసిన వ్యాఖ్య అది. ఓడిపోయిన ఏ పార్టీ అయినా, ఏ నాయకుడైనా ‘ప్రజాతీర్పును స్వీకరిస్తున్నాం, గౌరవిస్తున్నాం’ అంటాడు తప్ప, తీర్పు ఇచ్చిన ప్రజలను నిందించేపార్టీనిగానీ, నాయకుణ్ణిగానీ మనం ఈదేశంలో ఎన్నడూ, ఎక్కడా  చూసిలేం. దేశాన్ని అప్రతిహతంగా పాలించిన ఇందిరాగాంధీ సైతం ఏనాడూ తన ఓటమికి ప్రజలను నిందించలేదు.  వాజ్​పేయి, పీవీ లాంటి మహానేతలూ తమ ఓటమికి ఏనాడూ ప్రజలను నిందించలేదు. అధికారం లేకపోతే బతకలేననే పిచ్చి పీక్​స్థాయికి పెంచుకుంటే తప్ప ఓడిన వారెవరూ ప్రజలను నిందించరు! 75 ఏండ్ల దేశ రాజకీయ చరిత్రలో ప్రజలను తప్పుపట్టే నాయకుణ్ణి చూడటంలోనూ తెలంగాణ ప్రజలదే మొదటి అనుభవం.  

ప్రజలను సమీకరించి బహిరంగ సభలు పెట్టి, అదే ప్రజలను నిందించడం, అగౌరవపర్చడం ఈ  ప్రజాస్వామ్య దేశంలో మనం ఎక్కడైనా చూసి ఉంటామా? ‘ప్రజా ఆశీర్వాద సభ’ అని పేరు పెట్టి  ఆ సభల్లో  తన ఓటమికి ప్రజలనే నిందించడం చూస్తే   రాజకీయరంగంలో కేసీఆర్​ ఒక కొత్త ఒరవడి  తెచ్చారని చెప్పాలె. ఓపెన్​గా చెప్పాలంటే ఆయన బరితెగింపు రాజకీయం పీక్​ స్థాయికి చేరుకుందని ఎవరికైనా అనిపిస్తుంది. నాలుగు నెలల నుంచి ప్రతి బహిరంగ సభలో ప్రజలను నిందించడమే కార్యక్రమంగా మారింది.  ప్రజలనే ఎగతాళి చేస్తూ అవమానించడం చూస్తే.. ‘అహంకారం’ అదుపు తప్పిందని చెప్పకతప్పదు. 37శాతం ఓట్లు, 39 మంది శాసనసభ్యులను గెలిపించిన ప్రజలకైనా కనీసం కృతజ్ఞతలు కూడా చెప్పని కేసీఆర్​ ఇవాళ ఏకంగా ప్రజలనే నిందిస్తున్నాడంటే అది బరితెగింపే.    

ఏమైనా మిగిలిందా?

పదేండ్లలో చేసిన ఘనకార్యాలన్నీ తెలంగాణకు అనర్థంగా మారాయే తప్ప, ఉపయోగం పడింది ఒక్కటీ లేదు.  రివర్స్​ పంపింగ్​ కాళేశ్వరం, అనువుగాని చోట పాలమూరు ఎత్తిపోతలు, దండగమారి పవర్​ ప్లాంట్లు ఎటు చూసినా.. చేసిన అభివృద్ధి అంతా గుదిబండలుగా మారాయి. ​ప్రజల సంక్షేమం వదిలి ఓట్ల సంక్షేమం నడిపారు.  పదేండ్ల తదుపరి చూస్తే లక్షల కోట్లలో అప్పులు, ఊడ్చేసిన ఖజానా. వ్యాపారంగా మార్చేసిన రాజకీయాలు. ఎటు చూసినా విధ్వంసం తప్ప, మేలు జరిగిందని చెప్పుకోవడానికి ఏమైనా మిగిలిందా? ఓటమిపై ఆత్మపరిశీలన చేసుకుంటే.. కేసీఆర్​కు అన్నీ అర్థమవుతాయి.  ఆయన్ను ప్రజలు రెండు సార్లు గెలిపిస్తే.. గెలిపించిన ప్రజలనే ఆయన రెండుసార్లు ఓడించాడు. అందుకే మూడోసారి ప్రజలే ఆయన్ను ఓడించారు. తన ఓటమి వెనకాల ఉన్న ఈ మాత్రం లాజిక్​ ఆయనకు తెలియకకాదు. పరనింద ఆత్మస్తుతికి అలవాటుపడ్డాడు!  ప్రజలను నిందిస్తున్నాడు!

ఆప్షన్​లేని పార్టీగా మారింది

చివరకు ఫోన్​ ట్యాపింగ్​ వ్యవహారం చూస్తే.. ప్రజాతీర్పులను చెరబట్టిన వైనం చూశాక అసలు తెలంగాణలో ఏదైనా వ్యవస్థ దుర్వినియోగం కాలేదని వెతుక్కోవడానికైనా మిగిలిందా? ఒంటి  స్తంభం మేడలో కూర్చొని శాశ్వత పాలకుడిగా రాజ్యమేలాలనే ఆకాంక్షతో అన్ని వ్యవస్థలనూ భ్రష్టు పట్టించారు. ఇన్ని జరిగాక బీఆర్​ఎస్​ రాజకీయంగా అవసరమనుకునే పరిస్థితి తెలంగాణ ప్రజల్లో ఎక్కడైనా కనిపిస్తున్నదా? ఫలితంగా, లోక్​సభ ఎన్నికల్లో తెలంగాణ ఓటర్లకు ఆప్షన్​ లేని పార్టీగా మారిపోలేదా?  పోటీ చేయడానికి ప్రకటించిన అభ్యర్థులు సైతం కొందరు పారిపోయిన పరిస్థితి ఆ పార్టీ దైన్య స్థితిని, దాని భవిష్యత్తును చెప్పడం లేదా? ప్రతిపక్షమే అక్కరలేదన్నట్లు వ్యవహరించిన కేసీఆర్ ఇవాళ  ప్రతిపక్షంగా మారాడు. కనీసం ప్రభుత్వ తప్పిదాలను నిలదీసే నైతికతను కూడా కాపాడుకోలేకపోయాడు. ఫిరాయింపు రాజకీయాలు, ధనరాజకీయాలు నడిపి తెలంగాణ రాజకీయ వ్యవస్థనే జుగుప్సాకరంగా మార్చిన పాపం.. ఇవాళ ఆ పార్టీకే ఒక శాపంగా మారింది. ఓటమి ఫ్రస్ట్రేషన్​లో పడి ప్రజలను నిందిస్తే ఆ పార్టీ కనుమరుగవడం తప్ప ఇంకేమైనా జరుగుతుందా?

ఓటమి జీర్ణించుకోలేక ప్రజలను నిందించడమా?

ప్రజలు ప్రసాదించిన అధికారాన్ని శాశ్వత అధికారంగా భావించడం మొదలు పెట్టారు కాబట్టే ఆయన ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు. దానికి అసహనం తోడై అదుపు తప్పి ప్రజలను నిందించే సాహసం చేస్తున్నారు! రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. ఆ విషయం మరిచినపుడే  ఓడించిన ప్రజలను నిందించే సాహసం చేస్తారు! ఓటమికి ప్రజలను నిందించే వారెవరూ నాయకుడు కాలేరు.  కేసీఆర్​ పాలన అర్థమయ్యేందుకు ప్రజలకు పదేండ్లు పట్టింది. అదే ఆయన పాలనకు చరమగీతం పాడింది.

-కల్లూరి శ్రీనివాస్​ రెడ్డి, సీనియర్​ జర్నలిస్ట్

  • Beta
Beta feature
  • Beta
Beta feature