
తన కలను సాకారం చేసుకోవడానికి అండగా నిలిచిన తల్లికి ఓ కొడుకు వినూత్నంగా కృతజ్ఞతలు తెలిపాడు. జీవితంలో మరిచిపోలేని విధంగా ఎంతో ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇండిగో ఎయిర్ లైన్స్ పైలట్ జస్వంత్ వర్మ విమానంలో తన తల్లికి స్పెషల్‌గా స్వాగతం పలికాడు. ఫ్లైట్‌లో తల్లికి వెల్ కమ్ చెప్పడంతో పాటు.. ఆమె పక్కనే నిలబడి పైలట్ కావాలన్న తన కలను సాకారం చేసుకోవడంలో అమ్మ పాత్రను విమానంలోని ప్రయాణికులందరికీ వివరించాడు.
అమ్మ వల్లే తన కల సాకారం అయ్యిందని.. ఆమె లేకపోతే ఇవాళ పైలట్ అయ్యేవాడిని కాదన్నాడు. తన తల్లి ప్రయాణీకురాలిగా వెళ్తోన్న విమానం నడపడం ఇదే మొదటిసారి అని, తనకు ఈ రోజు చాలా ప్రత్యేకమని చెప్పాడు. మాది ఆంధ్రప్రదేశ్‌లోని మారుమూల గ్రామమని, తన ప్రాంతం నుండి పైలట్ కావాలనుకునే వ్యక్తి ఊహకు అందనివాడని చెప్పాడు. అయినప్పటికీ మా అమ్మ నా కలను నిజం చేసుకోవడానికి సహాయం చేసిందన్నాడు జస్వంత్ వర్మ. నైతికంగా, ఆర్థికంగా అన్ని విధాలుగా అండగా నిలిచిందన్నాడు.
Also read:-ఎయిర్ టెల్ రీఛార్జ్ ప్లాన్లు మారాయ్.. రోజుకు 1.5 జీబీ డేటా కావాలంటే..
నా విజయానికి ఆమె కారణం.. ఆమె వల్లే నేను ఇక్కడ కెప్టెన్‌గా నిలబడి విమానం నడుపుతున్నాను. నా జీవితాన్ని నా కలను ఆస్వాదిస్తున్నాను.. ఆమె లేకపోతే నేను లేనని ఎమోషనల్ స్పీచ్ ఇచ్చాడు కెప్టెన్ జస్వంత్. అమ్మకు స్వాగత ప్రకటన అంటూ ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు పైలట్ జస్వంత్ వర్మ. తన డ్రీమ్ ఫుల్‌ఫిల్ చేసుకోవడంలో అండగా నిలిచిన అమ్మకు జీవితాంతం గుర్తుండిపోయేలా సదరు పైలట్ పలికిన స్వాగతం, ఎమోషనల్ వెల్కమ్ స్పీచ్ విమానంలోని ప్రయాణికులతో పాటు నెటిజన్ల చేత ప్రశంసలు కురిపించింది. తల్లి కష్టానికి తగ్గ ప్రతిఫలం అందించావని కొందరు.. అమ్మతో కలిసి డ్యూటీలో ఉన్నప్పుడు నాకు కూడా ఇదే అనుభూతి కలిగిందని ఇంకొకరు.. ఈ వీడియో చూస్తున్నప్పుడు ఏడ్చానని మరో నెటిజన్ కామెంట్ చేశారు.