ఎయిర్ టెల్ రీఛార్జ్ ప్లాన్లు మారాయ్.. రోజుకు 1.5 జీబీ డేటా కావాలంటే..

ఎయిర్ టెల్ రీఛార్జ్ ప్లాన్లు మారాయ్.. రోజుకు 1.5 జీబీ డేటా కావాలంటే..

ఎయిర్ టెల్ కొన్ని ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లను అప్ డేట్ చేసింది. 249 రూపాయల బేసిక్ ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ను తొలగించిన ఎయిర్ టెల్ తాజాగా ఆరు 1.5 జీబీ డైలీ డేటా ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో కొన్ని ప్లాన్లు గతంలో ఉన్నవే అయినా కొన్ని అప్డేట్ చేయడం గమనార్హం. 28 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 1.5 జీబీ డేటా కావాలంటే ఇకపై ఎయిర్ టెల్ ప్రీపెయిడ్ యూజర్లు 349 రూపాయల ప్లాన్ తో రీఛార్జ్ చేసుకోవాల్సిందే. 1.5 జీబీ డైలీ డేటాతో 56 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ కావాలంటే 579 రూపాయలు, 60 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ అయితే 619 రూపాయలు, 77 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ 799 రూపాయలు, 84 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ 859 రూపాయలు, 90 రోజుల అంటే మూడు నెలల వ్యాలిడిటీతో రోజుకు 1.5 జీబీ హై స్పీడ్ డేటా ప్లాన్ అయితే 929 రూపాయలతో రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంది.

ఎయిర్ టెల్లో 1.5 జీబీ డైలీ డేటాతో మూడు నెలల వ్యాలిడిటీ లోపు అందుబాటులో ఉన్న ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్స్ అయితే ఇవే. ప్రీపెయిడ్ రీఛార్జ్‌‌ ప్లాన్స్‌‌ను టెల్కోలు 2024లో 40 శాతం పెంచిన సంగతి తెలిసిందే. ఇలా పెరిగిన టారిఫ్‌‌ల వలన లాంగ్‌‌ టైం కోసం రీఛార్జ్‌‌ చేసుకునే యూజర్లు, నెల వారీ రీఛార్జ్కు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. ఇలాంటి సమయంలో నెల వారీ ప్లాన్ ధరను 349 రూపాయలకు ఎయిర్ టెల్ పెంచడం గమనార్హం.

2019, అక్టోబర్‌‌‌‌లో ఎడ్జెస్టడ్‌ గ్రాస్‌ రెవెన్యూ(ఏజీఆర్‌‌‌‌)పై సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు వలన, టెలికాం కంపెనీలు రూ. 1.47 లక్షల కోట్ల బకాయిలను ప్రభుత్వానికి చెల్లించాల్సి వచ్చింది. ఈ భారాన్ని తగ్గించుకోవడానికి టెలికాం కంపెనీలు అప్పటి నుంచి టారిఫ్‌‌లను పెంచుకుంటూ వచ్చాయి. కరోనా టైంలో డేటా వినియోగం విపరీతంగా పెరిగింది. జియో ఇబ్బడిముబ్బడిగా డేటా ప్లాన్లను ప్రకటించడంతో ఎయిర్ టెల్ కూడా ఆ బాటలో నడవక తప్పలేదు. అయితే.. ఆ తర్వాత జియో కూడా యూజర్లకు షాకిచ్చింది.

2024లో రీఛార్జ్ ప్లాన్ల ధరలను అమాంతం పెంచేసింది. డేటా వినియోగానికి విపరీతంగా అలవాటు చేసి ఎంత ఖర్చు చేసైనా రీఛార్జ్ చేసుకోక తప్పని పరిస్థితులు తీసుకొచ్చింది. ఎయిర్ టెల్, జియో టారిఫ్ రేట్లు తట్టుకోలేక కొందరు బీఎస్ఎన్ఎల్కు మారిపోయారు. అయినప్పటికీ.. హై స్పీడ్ డేటాను అందించే విషయంలో బీఎస్ఎన్ఎల్ ఇప్పటికీ వెనకబడే ఉంది. అందుకే.. జియో, ఎయిర్ టెల్ ఇప్పటికీ ఇండియన్ టెలికాం రంగంలో అత్యధిక యూజర్లతో దూసుకుపోతున్నాయి.