అమరావతి షిఫ్ట్​ అవుతుందా?

అమరావతి షిఫ్ట్​ అవుతుందా?

ఏపీ రాజధాని అమరావతి మరోసారి హాట్ టాపిక్ గా మారింది. రాజధానిపై త్వరలో కీలక ప్రకటన ఉంటుందని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటనతో రాజకీయ దుమారం రేగింది. అమరావతిపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు కుట్ర చేస్తోందని, రాయలసీమకు లబ్ధి చేకూర్చడం కోసం రాజధానిని తరలించేస్తున్నారని టీడీపీ ఆరోపించింది. చంద్రబాబుపై కక్ష సాధించేందుకే అమరావతిని తరలిస్తున్నారని, అదే జరిగితే ప్రజా ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించింది. టీడీపీ ఆరోపణలపై అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  గట్టిగా బదులిచ్చింది. రాజధాని కట్టక ముందే వరదలొచ్చి అమరావతి మునిగింది. ఇలాగే వరదలు వచ్చిన ప్రతిసారి అమరావతిలో నీళ్లు ఎత్తిపోయలేం కదా అని ప్రశ్నించింది. కొండవీటి వాగుతో కృష్ణా వరదల కారణంగా అమరావతిలో సగం ప్రాంతం మునుగుతోందని, దీని కోసం ప్రత్యేకంగా కాల్వలు, రిజర్వాయర్లు నిర్మించుకోవాల్సి ఉందని, అంత ఖర్చు చేసే స్థోమత ప్రభుత్వానికి లేదని వ్యాఖ్యానించింది. మరోవైపు చిత్తూరు జిల్లా మాజీ ఎంపీ ఒకరు రాజధానిని తిరుపతికి మార్చాలని సీఎంకు సూచించారు. రాజధాని మార్పుపై కేంద్రం నుంచి సమాచారం ఉందని ఆయన ప్రెస్ మీట్ లో చెప్పారు. సర్కారు పరిశీలనలో ఉన్న ప్రకాశం జిల్లా దొనకొండలో రైల్వే, రవాణా, నీటి సదుపాయాలు లేవని ఆయన అన్నారు. తిరుపతి అయితే అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందని ఆయన అన్నారు.

అమరావతి ఎంపిక జరిగిందిలా…

రాష్ట్ర విభజన తర్వాత రాజధాని నిర్మాణం కోసం వేసిన శివరామకృష్ణన్ కమిటీ  ప్రకాశం జిల్లాలోని దొనకొండను సిఫార్సు చేసింది. నీళ్లు, రవాణా మార్గాలను అభివృద్ధి చేసుకుంటే అనుకూలంగా ఉంటుందని రిపోర్ట్ ఇచ్చింది. కానీ చంద్రబాబు ఆ రిపోర్ట్ ను పక్కన పెట్టి అమరావతిపై మొగ్గు చూపారు. అమరావతి ఎంపికను పరిశీలించిన కమిటీ కీలక వ్యాఖ్యలు చేసింది. విజయవాడ, గుంటూరు మధ్యలో ప్రభుత్వ భూమి అందుబాటులో లేనందున రాజధాని నిర్మాణం భారమవుతుందని స్పష్టం చేసింది. ఏడాదికి మూడు పంటలు పండే భూమిలో రాజధాని ఎందుకని ప్రశ్నించింది. అంతే కాకుండా అక్కడి భూమికి భారీ భవనాలను తట్టుకునే శక్తి లేదని, సున్నితమైన ఒండ్రు మట్టి వ్యవసాయానికి మాత్రమే అనుకూలంగా ఉందని స్పష్టం చేసింది. అయినా చంద్రబాబు అమరావతికే సై అన్నారు. గుంటూరు జిల్లాలోని 29 గ్రామాలను సీడ్ క్యాపిటల్ గా ఎంపిక చేస్తూ రాజధానిగా అమరావతిని  ప్రకటించారు. విజయవాడ, గుంటూరును కలిపేలా అమరావతి నిర్మించి మూడు నగరాలతో మెగా రాజధానిని నిర్మిస్తామని ప్రకటించారు. తాడేపల్లి, మంగళగిరి నియోజకవర్గాల పరిధిలో రైతుల నుంచి 34 వేల ఎకరాల భూమిని సేకరించారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని 56 మండలాలను అమరావతి పరిధిలోకి చేరుస్తూ నోటిఫికేషన్ ఇచ్చారు. 2015లో దసరా నాడు ప్రధానితో రాజధానికి శంకుస్థాపన చేయించారు.  ప్రతిపక్షంగా ఉన్న వైఎస్సార్ సీపీ రాజధానిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. చంద్రబాబు అండ్ కంపెనీ అక్కడ భూములు కొని ఇన్సైడ్ ట్రేడింగ్ చేశారని ఆరోపించింది.

రాజధాని రైతుల్లో టెన్షన్ టెన్షన్

మంత్రి బొత్స ప్రకటనతో అమరావతికి భూములు ఇచ్చిన రైతుల్లో ఆందోళన నెలకొంది. రాజధానికి ఇచ్చిన భూమిలో నాలుగో వంతు భూమిని కమర్షియల్ స్పేస్ గా అభివృద్ధి చేసి రైతులకు అప్పగించేలా ప్రభుత్వం గతంలో ఒప్పందం చేసుకుంది. అప్పటివరకు ఎకరాకు ఏటా రూ. 50 వేల కౌలు చెల్లిస్తానని ప్రకటించింది. దీంతో 29 గ్రామాల రైతులు 34 వేల ఎకరాలను ప్రభుత్వానికి అప్పగించారు. అమరావతిని ఎలా మారుస్తారని జగన్ సర్కారును విమర్శిస్తూనే మాజీ సీఎం చంద్రబాబుపై రైతులు మండిపడుతున్నారు. శాశ్వత రాజధాని నిర్మాణం మొదలు పెట్టుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అమరావతి ప్రస్తుత పరిస్థితి..

వైఎస్సార్ సీపీ అధికారంలోకి రావడంతో  రాజధానిలో నిర్మాణాలు తాత్కాలికంగా ఆగిపోయాయి. గత ప్రభుత్వంలో భూముల కేటాయింపుపై జగన్ సర్కారు విచారణకు ఆదేశించడంతో రియల్ ఎస్టేట్ పడిపోయింది. సబ్ కమిటీ విచారణ కారణంగా వరల్డ్ బ్యాంక్ నుంచి అమరావతికి అందాల్సిన రుణం వెనక్కెళ్లిపోయింది. కేంద్ర సాయం కూడా అందడం లేదు. బిల్లులు చెల్లిస్తారో లేదో అనే భయంతో కాంట్రాక్టులు పొందిన సంస్థలు కూడా పనులు ఆపేశాయి. ఇంతలోనే అమరావతి షిఫ్టింగ్ పై చర్చ మొదలైంది. జగన్ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందోనని ఉత్కంఠ నెలకొంది. రాజధాని అమరావతిని చంద్రబాబు సర్కారు  చట్టబద్ధం చేసింది. జగన్ సర్కారు రాజధానిని తరలించాలంటే ఆ చట్టాన్ని సవరించాల్సి ఉంటుంది. రాయలసీమ ప్రాంతానికి లేదా ప్రకాశం జిల్లా దొనకొండకు రాజధానిని మారుస్తారనే ప్రచారం జరుగుతోంది.