- దిగుమతి సుంకం ఎత్తేయడంతో
- కొర్రీలు పెడుతూ కొనుగోలుకు ఆసక్తి చూపని సీసీఐ
మహబూబ్‌నగర్, వెలుగు : పత్తి రైతులు తమ పంటను అమ్ముకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే పత్తిపై సుంకాన్ని ఎత్తివేయడంతో టెక్స్‌టైల్ వ్యాపారులు అమెరికా పత్తి వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో దేశీయ కాటన్‌కు డిమాండ్ తగ్గిపోయింది. దీనికి తోడు సీసీఐ కొనుగోలు కేంద్రాలు తెరిచినా అనేక కొర్రీలు పెడుతోంది. కపాస్ కిసాన్ యాప్‌ను తీసుకొచ్చినా సాంకేతిక సమస్యలు, వివిధ రకాల కొర్రీలతో కొనుగోళ్లు జరగకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేట్ వ్యాపారులకైనా అమ్ముకుందామని వెళ్తే... మార్కెట్ లేదంటూ, తేమను సాకుగా చూపుతూ ధరను పూర్తిగా తగ్గించేస్తున్నారు. దీంతో ఏం చేయాలో తెలియక పత్తి రైతులు అయోమయంలో పడిపోయారు.
దిగుమతి సుంకాన్ని ఎత్తేయడంతో తగ్గిన డిమాండ్
దేశంలో మొత్తం 315 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతోంది. తెలంగాణ రాష్ట్రంతో పాటు మహారాష్ట్ర, కర్నాటక, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, హర్యానా, పంజాబ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో పత్తి సాగు జరుగుతుండగా.. ఏటా 300 లక్షల నుంచి 350 లక్షల బేళ్ల (ఒక్కో బేల్ 170 కిలోలు) ఉత్పత్తి అవుతుందని అంచనా. అయితే ఈ ఏడాది ఆగస్ట్‌లో కేంద్ర ప్రభుత్వం పత్తి దిగుమతులపై ఉన్న సుంకాన్ని ఎత్తేసింది. భారత్‌కు ప్రధానంగా అమెరికా నుంచే పత్తి దిగుమతి అవుతుంది. పత్తి దిగుమతిపై ఉన్న సుంకాలను కేంద్రం ఎత్తి వేయడంతో వస్త్ర వ్యాపారులు దేశీయ పత్తిని కొనుగోలు చేయడం బంద్ చేసి, అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ప్రస్తుతం దిగుబతి మొదలైనా కొనుగోళ్లు పూర్తి స్థాయిలో జరగకపోవడంతో పత్తి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు వర్షాలు, వాతావరణంలో వస్తున్న మార్పులతో పత్తిని కాపాడుకోవడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కష్టాలు తెచ్చిన ‘కపాస్’
కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) రైతుల నుంచి పత్తి కొనుగోళ్లు చేయడానికి రాష్ట్రంలో సెంటర్లను ఓపెన్ చేసింది. తేమ 8 శాతం నుంచి 12 శాతం వరకు ఉంటే మద్దతు ధర రూ.8,110 ఇస్తామని ప్రకటించింది. కానీ ఈ సెంటర్లలో పత్తిని అమ్మాలనుకుంటే పత్తి రైతులు ‘కపాస్ కిసాన్’ యాప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకొని, స్లాట్ బుక్ చేసుకోవాలని రూల్ పెట్టింది. దీంతో రైతులకు కష్టాలు మొదలయ్యాయి. కొందరికి స్లాట్ బుక్ కాకపోగా.. మరికొందరికి స్లాట్ బుక్ అయినా సెంటర్లకు వెళ్లాక వివరాలు కనిపించడం లేదంటూ రైతులను వెనక్కి పంపిస్తున్నారు. మరో వైపు సెంటర్లు ఓపెన్ చేసిన మొదట్లో ఎకరాకు 12 క్వింటాళ్ల చొప్పున కొనుగోలు చేస్తామని చెప్పినా.. తర్వాత ఏడు క్వింటాళ్లే కొంటామని ప్రకటించారు. అయితే పత్తిని తక్కువ మొత్తంలో కొనుగోలు చేయాలన్న ఉద్దేశంతోనే ఇలాంటి కొర్రీలు పెడుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ సీజన్‌లో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 51 లక్షల ఎకరాల్లో పత్తి సాగు జరుగగా.. సీసీఐ సెంటర్ల ద్వారా ఇప్పటివరకు 50 వేల నుంచి 60 వేల మంది రైతుల నుంచే పత్తిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
అదను చూసి అగ్గువకు కొంటున్న మిల్లర్లు
పత్తి కొనుగోళ్లలో రోజుకో కండీషన్ పెడుతుండడం, కొనుగోళ్లు ఆలస్యం అవుతుండడంతో రైతులు ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా తీసుకుంటున్న వ్యాపారులు పత్తిలో తేమ ఎక్కువగా ఉంది, మార్కెట్‌లో డిమాండ్ లేదు, పత్తి క్వాలిటీ సరిగా లేదని సాకులు చెబుతూ ధరను అమాంతం తగ్గించేస్తున్నారు. ప్రైవేట్ వ్యాపారులు క్వింటాల్ పత్తికి రూ.6 వేల నుంచి రూ.7 వేల కంటే ఎక్కువ ఇవ్వకపోవడంతో రైతులు తీవ్రంగా
నష్టపోతున్నారు.
పత్తి పంటను దున్నేస్తున్రు
శాయంపేట, వెలుగు : అకాల వర్షాలకు తోడు గులాబీ రంగు పురుగు.. పత్తి రైతులకు భారీ నష్టాన్ని మిగిల్చాయి. మొదట్లో పత్తి కాయలు ఎక్కువగా రావడంతో దిగుబడిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న రైతులకు చివరకు నిరాశే మిగిలింది. పత్తి చేతికొచ్చే సమయంలో వానలు పడడం, తర్వాత గులాబి రంగు పురుగు సోకడంతో దిగుబడిపై ఎఫెక్ట్ పడింది. ఎకరాలకు 12 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని ఆశించినా.. మూడు క్వింటాళ్లు కూడా రాలేదు. ఈ పత్తినైనా అమ్ముకుందామని మార్కెట్‌కు వెళ్తే.. ఎకరాకు రూ. 4 వేల నుంచి రూ. 5 వేలు మాత్రమే ఇస్తున్నారు. దీంతో దుక్కి దున్నినప్పటి నుంచి మొదలు పెట్టి పత్తి ఏరే వరకు ఎకరాకు రూ. 25 వేల నుంచి రూ. 30 వేలకు పైగా పెట్టుబడి అవుతుందని.. పంట అమ్మితే పెట్టుబడి కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పత్తిని ఏరకుండానే ట్రాక్టర్ల సాయంతో పంటను దున్నేస్తున్నారు.
