ఇత‌ర రాష్ట్రాల్లో చిక్కుకున్నారా?: సొంతూరికి వెళ్లేందుకు కంట్రోల్ రూం నంబ‌ర్

ఇత‌ర రాష్ట్రాల్లో చిక్కుకున్నారా?: సొంతూరికి వెళ్లేందుకు కంట్రోల్ రూం నంబ‌ర్

క‌రోనా లాక్ డౌన్ కార‌ణంగా ఇత‌ర రాష్ట్రాల్లో చిక్కుకున్న వ‌ల‌స కార్మికులను స్వ‌స్థ‌లాల‌కు పంపేందుకు కేంద్రం గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డంతో అన్ని రాష్ట్రాలు దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ విష‌యంలో ఏపీ వేగంగా స్పందించింది. ఇత‌ర రాష్ట్రాల చిక్కుకుని సొంతూరికి వెళ్లాల‌‌నుకుంటున్న ఏపీ వాసుల కోసం కంట్రోల్ రూమ్ నంబ‌ర్ 0866 2424680 ను విడుద‌ల చేసింది. అలాగే ఏపీ నుంచి స్వ‌స్థ‌లాల‌కు వెళ్లాల‌నుకుంటున్న వారి కోసం 1902 టోల్ ఫ్రీ నంబ‌ర్ ను ప్ర‌క‌టించింది. ఈ వివ‌రాల‌ను గురువారం సాయంత్రం ఏపీ కొవిడ్‌ టాస్క్‌ ఫోర్స్‌ కమిటీ ఛైర్మన్‌ కృష్ణబాబు మీడియాకు వెల్ల‌డించారు. రాష్ట్రంలో ఒక జిల్లా నుంచి మ‌రో జిల్లాకు వెళ్లాల‌నుకుంటున్న వ‌ల‌స కూలీల‌ను ఇప్ప‌టికే వారిని స్వ‌స్థలాల‌కు త‌ర‌లించే ఏర్పాట్లు చేశామ‌న్నారు. పూర్తిగా ప్ర‌భుత్వ ఖ‌ర్చుతోనే వారి సొంతూర్ల‌కు పంపుతున్నామ‌ని చెప్పారు. అయితే ఇత‌ర రాష్ట్రాల నుంచి వ‌చ్చే వారినైనా, జిల్లాల మ‌ధ్య మారే వారైనా స‌రే క‌రోనా ప‌రీక్ష‌ల త‌ర్వాతే అనుమ‌తించాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు తెలిపారు. ఇత‌ర రాష్ట్రాల్లో చిక్కుకున్న ఏపీ వాసులు కంట్రోల్ రూం నంబ‌ర్ 0866 2424680 ఫోన్ చేసి సంప్ర‌దించాల‌ని సూచించారు.

రాష్ట్రంలోని గ్రీన్ జోన్ల‌లో ఆర్థిక కార్య‌క‌లాపాల‌ను స్టార్ట్ చేస్తున్నామ‌ని చెప్పారు కృష్ణ‌బాబు. గ్రీన్ జోన్ల‌లో ప‌నుల‌కు కార్మికులు అవ‌స‌ర‌మైతే ఇత‌ర గ్రీన్ జోన్లకు వాహ‌నాల‌ను పంపి ర‌ప్పించుకోవ‌చ్చ‌ని తెలిపారు. అలాగే వేరే రాష్ట్రాల‌కు చెందిన కార్మికులు కూడా ప‌నుల‌కు వెళ్లొచ్చ‌న్నారు. వాళ్ల సొంత రాష్ట్రాల‌కు వెళ్లిపోవాల‌నుకున్న వారు 1902కి ఫోన్ చేయాల‌ని చెప్పారు. కాగా, గుజరాత్‌ నుంచి బయలుదేరిన మత్స్యకారులు శుక్ర‌వారం రాష్ట్రానికి చేరుకుంటారని వెల్లడించారు.