పోలీసులు ఎత్తుకెళ్లిన నా కొడుకు కోసం మార్చురీలోనూ వెతికా : సాయికృష్ణ తల్లి కన్నీటి వేడుకోలు

పోలీసులు ఎత్తుకెళ్లిన నా కొడుకు కోసం మార్చురీలోనూ వెతికా : సాయికృష్ణ తల్లి కన్నీటి వేడుకోలు

ఆంధ్రప్రదేశ్ విజయవాడలోని ఓ కేసు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. విజయవాడ కృష్ణ లంక పోలీస్ స్టేషన్ పరిధిలో గాదె సాయి కృష్ణ అనే యువకుడు ఉన్నాడు. అతనిపై కొన్ని కేసులు ఉన్నాయి. కొంత కాలంలో అతను ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఉంటున్నాడు. మార్కాపురంలో ఉంటున్న గాదె సాయికృష్ణను విజయవాడ సిటీ పరిధిలోని కృష్ణలంక పోలీసులు అదుపులోకి తీసుకున్నారని.. ఆ తర్వాత తన కుమారుడిని కోర్టులో హాజరుపరచలేదని.. అతని ఆచూకీ తెలియటం లేదని యువకుడు సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఏపీ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటీషన్ దాఖలు చేశారు.

కేసు విచారణ సందర్భంగా సాయి కృష్ణ ఆచూకీ ఇంకా దొరకలేదని.. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోలీస్ బృందాలు అతని కోసం గాలిస్తున్నట్లు హైకోర్టుకు వివరించారు పోలీసులు. ఆచూకీ దొరికిన వెంటనే హైకోర్టులో ప్రవేశపెట్టాలని పోలీసులను ఆదేశిస్తూ జూన్ 29వ తేదీకి విచారణ వాయిదా వేసింది కోర్టు. 

ఏపీ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటీషన్ పై విచారణ సందర్భంగా.. పోలీస్ కస్టడీలో ఉన్న సాయికృష్ణ తల్లి తరపు లాయర్ ఆదిత్యచౌదరి వాదనలు వినిపించారు. పోలీసుల చిత్రహింసల వల్లే అతను మరణించి ఉండొచ్చన్న అనుమానాన్ని పిటీషనర్ వ్యక్తం చేస్తున్నారని.. సాయికృష్ణకు ప్రాణహాని జరిగి ఉండొచ్చని కుటుంబం భయపడుతోందని పిటీషనర్ తరపున లాయర్ కోర్టు దృష్టికి తెచ్చారు. 

హైకోర్టులో కేసు విచారణ తర్వాత మీడియాతో మాట్లాడారు యువకుడు సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి. ఆమె మాటలు వేడుకుంటున్న తీరు అందర్నీ కలిచి వేస్తుంది. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి మాటల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. 
విజయవాడ కృష్ణ లంక పోలీస్ స్టేషన్ నుంచి ఇద్దరు కానిస్టేబుళ్లు మా ఇంటికి వచ్చారు. నా సెల్ ఫోన్ తీసుకుని వెళ్లారు. 15 రోజులు నా ఫోన్ వాళ్ల దగ్గరే పెట్టుకున్నారు. ఎన్నిసార్లు అడిగినా ఇవ్వలేదు. కొడుకు ఆచూకీ కోసం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా సరైన సమాధానం చెప్పలేదు. నీ కొడుకు లేడనుకో.. నీ కొడుకు చనిపోయాడు అనుకో.. నీ కొడుకు నీ దగ్గరకు రాడు అనుకో అంటూ కృష్ణలంక సీఐ నాగరాజు చెప్పినట్లు సాయికృష్ణ తల్లి మీడియా ఎదుట కన్నీళ్లతో చెప్పుకొచ్చారు. 

నా ఫోన్ తీసుకున్న పోలీసులు అందులోని నా కొడుకు ఫొటోలు అన్నీ తీసేసి ఇచ్చారని చెప్పుకొచ్చారు. నా కొడుకు కోసం 15 రోజులు వెతికాను అని.. చివరికి గవర్నమెంట్ ఆస్పత్రి మార్చురీలోనూ వెతికానంటూ బోరున విలపిస్తూ చెప్పుకొచ్చారు. నా కొడుకు బతికి ఉంటే చూపించాలని.. ఎక్కడ ఉన్నాడో చెప్పాలని.. సీఐ నాగరాజు చెప్పినట్లు చనిపోయి ఉంటే కనీసం ఆ మృతదేహాన్ని అయినా ఇవ్వాలంటూ కన్నీటితో వేడుకుంటున్న తీరు అందర్నీ కలిచి వేసింది.

మార్కాపురం నుంచి సాయికృష్ణను తీసుకెళ్లింది విజయవాడ కృష్ణలంక పోలీసులు అని సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి తన పిటీషన్ లో స్పష్టం చేయటం.. దాదాపు 20 రోజులుగా ఆచూకీ లేకపోవటం.. ఎక్కడ ఉన్నాడో కూడా తెలియని పరిస్థితుల్లో.. హైకోర్టు ఆదేశాల ప్రకారం సాయికృష్ణను జూన్ 29వ తేదీలోపు పోలీసులు కోర్టులో హాజరుపరుస్తారా లేదా అనేది ఆసక్తిగా మారింది.